Share News

ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్‌ సస్పెన్షన్‌

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:36 PM

రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనపై ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్‌ సస్పెన్షన్‌
ప్రధానోపాధ్యాయుడు, డిప్యూటీ వార్డెన్‌ను విచారిస్తున్న ఐటీడీఏ పీవో శ్రీపూజ

హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు

విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనపై ఐటీడీఏ పీవో సీరియస్‌

నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక

కొయ్యూరు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనపై ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన డిప్యూటీ వార్డెన్‌ను సస్పెండ్‌ చేయాలని, ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని ఏటీడబ్ల్యూవోను ఆమె ఆదేశించారు. ఈ పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థినులు ఈ నెల 15న ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పాఠశాలను మంగళవారం మధ్యాహ్నం ఐటీడీఏ పీవో సందర్శించారు. హెచ్‌ఎంతో పాటు డిప్యూటీ వార్డెన్‌, సిబ్బందిని విచారించారు. అనంతరం మెనూ అమలుతోపాటు వసతి సౌకర్యంలో లోపాలు, తదితర విషయాలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలతోపాటు క్రిమినల్‌ చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అనంతరం వంటశాలలో నిత్యావసరాలు, కూరగాయలను పరిశీలించారు. ఉల్లిపాయలు కుళ్లినవి ఉండడంతో డిప్యూటీ వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం, పప్పులు, నూక తదితర సామగ్రి శాంపిల్స్‌ తీసి పరీక్షలకు పంపాలని ఏటీడబ్యువోను ఆదేశించారు. అక్కడి నుంచి నేరుగా పీహెచ్‌సీకి వెళ్లి విద్యార్థినులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడారు. 15వ తేదీ రాత్రి విద్యార్థినులు అస్వస్థతకు గురైతే ఇద్దరు వైద్యాధికారులు సత్వరం స్పందించకపోవడం, టైఫాయిడ్‌ పరీక్ష చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యాలయానికి వచ్చి దీనిపై వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించారు. కాగా ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు పాఠశాల డిప్యూటీ వార్డెన్‌ జగం జ్యోతిని సస్పెండ్‌ చేశామని, ప్రధానోపాధ్యాయుడు గోపాలంకు షోకాజ్‌ నోటీసు ఇచ్చామని ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్‌ తెలిపారు. రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న 25 మంది విద్యార్థినులు పూర్తిగా కోలుకోవడంతో వైద్యాధికారిణి స్నేహలత మంగళవారం సాయంత్రం వారిని డిశ్చార్జి చేశారు.

కేజీబీవీ సందర్శన

కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని ఐటీడీఏ పీవో శ్రీపూజ సందర్శించారు. పరిసరాలు దుర్గంధం వెదజల్లుతుండడంతో ఎస్‌వో పరిమళను దీనిపై ప్రశ్నించారు. అనంతరం విలేకరులతో ఐటీడీఏ పీవో మాట్లాడుతూ పాఠశాల పరిసరాల్లో తాగునీటిని పరీక్షించగా, కెమికల్‌ రిపోర్టు సంతృప్తికరంగా ఉందన్నారు. అయినా బయాలజికల్‌ పరీక్షలు జరిపించి తేడాలు గుర్తిస్తే అవసరమైన చర్యలు చేపడతామన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 11:36 PM