Share News

ఆశ్రమ బాలికల ఆందోళన

ABN , Publish Date - Oct 26 , 2025 | 10:57 PM

మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల-1 విద్యార్థినులు ఆదివారం ఆందోళన చేశారు. ఉదయం అల్పాహారం తినకుండా పాఠశాల ఆవరణలో బైఠాయించారు.

ఆశ్రమ బాలికల ఆందోళన
పాఠశాల ఆవరణలో ఆందోళన చేస్తున్న విద్యార్థినులు

సక్రమంగా మెనూ అమలు చేయకపోవడంతో నిరసన

అల్పాహారంగా ఇడ్లీకి బదులు ఉడకని గెంజి అన్నం పెట్టడంతో తిరస్కరణ

పాఠశాలలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

ఇన్‌చార్జి ఏటీడబ్ల్యూవో హామీతో ఆందోళన విరమణ

ముంచంగిపుట్టు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల-1 విద్యార్థినులు ఆదివారం ఆందోళన చేశారు. ఉదయం అల్పాహారం తినకుండా పాఠశాల ఆవరణలో బైఠాయించారు. మెనూ సక్రమంగా అమలు కావడం లేదని, ఉడకని, చాలీచాలని ఆహారం పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు. ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజనసంఘ నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా మెనూ సక్రమంగా అమలు కావడం లేదని, ఎలా వండినా వారు పెట్టిందే తినాల్సి వస్తుందని, కొన్ని సందర్భాల్లో తినకుండా పస్తులు ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహ నిర్వాహకులకు ఎన్నిసార్లు చెప్పినా వారి తీరు మారడంలేదని, అలాగే ఈ విషయాన్ని పర్యవేక్షణకు వచ్చే అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని వాపోయారు. ఆదివారం ఉదయం అల్పాహారంగా ఇడ్లీ పెట్టాల్సి ఉండగా, ఉడకని గెంజి అన్నం, బఠాణి కూర పెట్టారని చెప్పారు. మొత్తం 371 మంది విద్యార్థినులు ఉండగా, 21 మరుగుదొడ్లు ఉన్నాయని, వాటిలో 12 పూర్తి స్థాయిలో పాడైపోయాయని, ఉన్న మరుగుదొడ్లకు సక్రమంగా తలుపులు లేవని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి.కార్తీక్‌ శ్రీను మాట్లాడుతూ ఆశ్రమ బాలికల పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు చేయాలని విద్యార్థినులు వార్డెన్‌గా అదనపు బాధ్యతలు చేపడుతున్న ఆ పాఠశాల హెచ్‌ఎం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి మెనూ సక్రమంగా అమలు జరిగే విధంగా చూడాలని, పూర్తి స్థాయిలో వర్కర్లను నియమించాలని, వ్యాధుల బారిన పడే విద్యార్థినులకు సకాలంలో వైద్య సేవలు అందే విధంగా చూడాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న ఇన్‌చార్జి ఏటీడబ్ల్యూవో జగత్‌రాయ్‌, స్థానిక ఎస్‌ఐ జె.రామకృష్ణ పాఠశాలకు వచ్చి ఆందోళన చేస్తున్న విద్యార్థినులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఇచ్చిన అల్పాహారాన్ని ఎస్‌ఐ రుచి చూశారు. మెనూ సక్రమంగా అమలు జరిగే విధంగా చూస్తామని, సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని వారు హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ పి.సత్యనారాయణ, లక్ష్మీపురం సర్పంచ్‌ కె.త్రినాథ్‌, గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఎం.ఎం.శ్రీను, గాసీరాందొర, చరణ్‌, గణేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2025 | 10:57 PM