స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:22 PM
జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా స్థాయిలో జరిగే ఈ వేడుకలకు స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల మైదానం వేదిక కానున్నది.
ముఖ్య అతిథిగా కలెక్టర్ జెండా ఆవిష్కరణ
వేడుకలకు తలారిసింగి ఆశ్రమ పాఠశాల మైదానం వేదిక
సాంస్కృతిక ప్రదర్శనలకు గిరిజన విద్యార్థులు సన్నద్ధం
పాడేరు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా స్థాయిలో జరిగే ఈ వేడుకలకు స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల మైదానం వేదిక కానున్నది. కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ ఆధ్వర్యంలో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా ప్రత్యేక పోలీస్ పరేడ్ నిర్వహించేందుకు ఆర్ముడ్ రిజర్వుడ్ కానిస్టేబుళ్లు సాధన చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమాలపై శకటాలు, ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
గిరి విద్యార్థుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ
పాడేరులో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో గిరిజన విద్యార్థుల దేశభక్తి ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సుమారుగా 15 పాఠశాలలకు చెందిన గిరిజన విద్యార్థులు వివిధ రకాల దేశభక్తి గేయాలు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఇచ్చేందుకు వారం రోజులుగా తమ పాఠశాలల్లో సాధన చేస్తున్నారు. స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల విద్యార్థుల మానవ పిరమిడ్, విలువిద్య, కొయ్యూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మల్లకంభ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
స్వాతంత్య్ర వేడుకల్లో కార్యక్రమాలివి...
పాడేరులో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్‌చే జాతీయ పతాకావిష్కరణ, 9.10కి పోలీస్ పరేడ్, గౌరవ వందనం స్వీకరణ, 9.20కు కలెక్టర్ సందేశం, 10 గంటలకు విద్యార్థులతో దేశభక్తి, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, 11 గంటలకు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాల పంపిణీ, 11.45 గంటలకు ప్రభుత్వం శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్ల ప్రదర్శన, 12 గంటలకు వందన సమర్పణతో కార్యక్రమం ముగుస్తుంది.
కలెక్టర్‌కే జెండా ఆవిష్కరించే అవకాశం
జిల్లా కేంద్రంలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్‌కు జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించే అవకాశం దక్కింది. దీనికి సంబంధించి గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, గుంటూరులో మంత్రి నారా లోకేశ్, మిగిలిన 22 జిల్లాల్లో స్వాతంత్య్ర దినోత్సవంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రులు మాత్రమే జాతీయ జెండాను ఆవిష్కరించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రం ఆ అవకాశాన్ని కలెక్టర్ దినేశ్‌కుమార్‌కు కల్పించింది.
విద్యాలయాల్లో ఎస్‌ఎంసీ చైర్మన్‌లకు అవకాశం
జిల్లాలోని విద్యాలయాల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఎస్‌ఎంసీ) చైర్మన్లే జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. గతేడాది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులే స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. గతేడాది ఆగస్టు 8న స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఎన్నికలు జరిగినా చైర్మన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఎన్నికల కోడ్ కావడంతో వారికి ఆ అవకాశం దక్కలేదు. కానీ ఈ ఏడాది ఎటువంటి నిబంధనలు అడ్డులేకపోవడంతో పాఠశాలల్లో ఎస్‌ఎంసీ చైర్మన్లకు జాతీయ జెండాలను ఆవిష్కరించే అవకాశం దక్కింది.