Share News

కోనాం వైపు కన్నెత్తి చూడరే?

ABN , Publish Date - Jul 07 , 2025 | 11:25 PM

మండలంలోని కోనాం జలాశయం నిర్లక్ష్యానికి గురవుతోంది. పదేళ్ల కిందట నుంచి సమస్యలు వేధిస్తున్నా గత వైసీపీ పాలనలో జలాశయాన్ని పట్టించుకోకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది.

కోనాం వైపు కన్నెత్తి చూడరే?
దిగువ కాలువ ద్వారా వృథాగా పోతున్న నీరు

నిర్లక్ష్యానికి గురవుతున్న జలాశయం

గత వైసీపీ పాలనలో పూర్తిగా పట్టించుకోని వైనం

గేట్లకు అమర్చిన రబ్బరు తొడుగులు పని చేయని వైనం

రోజూ 50 క్యూసెక్కుల నీరు వృథా

పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

చీడికాడ, జూలై 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని కోనాం జలాశయం నిర్లక్ష్యానికి గురవుతోంది. పదేళ్ల కిందట నుంచి సమస్యలు వేధిస్తున్నా గత వైసీపీ పాలనలో జలాశయాన్ని పట్టించుకోకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. బలహీన పడిన గట్టు, శిథిలమైన సిబ్బంది గృహాలు, రిజర్వాయర్‌కు వెళ్లే మార్గం అధ్వానంగా ఉన్నా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మండలంలోని కోనాంలో వేచలపు పాలవెల్లి జలాశయాన్ని 45 ఏళ్ల క్రితం నిర్మించారు. తొలి ముఫ్పై సంవత్సరాలు నిర్వహణ బాగానే ఉన్నా ఆ తరువాత పదేళ్లుగా సమస్యలు వేధిస్తున్నాయి. పదేళ్ల కిందట విద్యుత్‌ బకాయిలు పేరుకుపోవడంతో విద్యుత్‌ శాఖ అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. అప్పటి నుంచి వర్షాకాలంలో మూడు నెలలు, నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు జనరేటర్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ రిజర్వాయర్‌ ఎగువ కాలువ కింద సుమారు మూడు వేల ఎకరాలు, దిగువ కాలువ కింద 11,500 ఎకరాల సాగు భూములు ఉన్నాయి. వాస్తవానికి రిజర్వాయర్‌ వద్ద విధులు నిర్వహించేందుకు నలుగురు లస్కర్లు, ఒక ఆపరేటర్‌, ఇద్దరు హెల్పర్‌లు, ఇద్దరు హెడ్‌ మజ్దూర్‌లు, ఒక ఏఈ ఉండాలి. కానీ ప్రస్తుతం వాచ్‌మన్‌, ఏఈ మాత్రమే ఉన్నారు. సిబ్బంది ఉండేందుకు నిర్మించిన క్వార్టర్లు శిథిలావస్థలో ఉన్నాయి. గత్యంతరం లేక వాచ్‌మన్‌ అందులోనే నివాసముంటున్నాడు. ఇక జలాశయం పరిశీలనకు వచ్చే అధికారుల కోసం ఇరవై ఏళ్ల క్రితం నిర్మించిన విశ్రాంతి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది.

రోజూ 50 క్యూసెక్కుల నీరు వృథా

జలాశయం గరిష్ఠ స్థాయి నీటిమట్టం 101.25 మీటర్లుగా అధికారులు నిర్ణయించారు. అయితే 92 మీటర్లు స్థాయికి వచ్చేసరికి ఎగువ కాలువ ద్వారా సాగునీరు నిలిపివేస్తున్నారు. అలాగే 87 మీటర్లు వచ్చేసరికి దిగువ కాలువ సాగునీరు నిలిపివేస్తున్నారు. 14,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు గాను దిగువ కాలువకు రెండు గేట్లు, ఎగువ కాలువకు ఒక గేటు ఏర్పాటు చేశారు. 15 సంవత్సరాలుగా దిగువ కాలువ గేట్లకు అమర్చిన రబ్బరు తొడుగులు పనిచేయకపోవడంతో అధికారులు పూర్తిగా గేట్లు మూసినా దిగువ గేట్లు ద్వారా ప్రతి రోజు 50 క్యూసెక్కులకు పైగా సాగునీరు వృథాగా పోతోంది. కోనాం బోగొండమ్మ దేవాలయం నుంచి మెయిన్‌ గేట్ల ద్వారా సుమారు కిలోమీటరు మేర ఉన్న జలాశయం గట్టు వర్షాకాలంలో పూర్తిగా బురదమయంగా ఉండగా, కోనాం మెయిన్‌రోడ్డు నుంచి జలాశయానికి వచ్చే అధికారులు, రైతుల కోసం ఏర్పాటు చేసిన రోడ్డు సైతం రాళ్లుతేలి ఉంది. దీంతో పర్యాటకులు, అధికారులు ఇక్కడికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. కోనాం జలాశయం సమస్యల పరిష్కారానికి కోటి రూపాయలు మంజూరు చేశామని ఆరు నెలల కిందట ప్రజాప్రతినిధులు ప్రకటించారని, ఆ నిధులు ఏమయ్యాయో రైతులకు వివరించాలని సీడీసీ చైర్మన్‌ సుంకరి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. జలాశయం ప్రాజెక్టు కమిటీ ఏర్పాటు చేసి ఆరు నెలలు గడిచినా కనీసం ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని మర్లగుమ్మి ఆనకట్టు, దిబ్బపాలెం చానల్‌ సాగునీటి సంఘం అధ్యక్షుడు దారపు మండేలు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కోనాం జలాశయం సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jul 07 , 2025 | 11:25 PM