రక్షణ చర్యలు ఇలాగేనా?
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:57 PM
చింతాలమ్మ ఘాట్ రోడ్డులో జాతీయ రహదారి 516-ఈ నిర్మాణానికి వీలుగా మలుపుల్లో కొండను దొలిచిన అధికారులు కంటితుడుపు చర్యగా కొండ నుంచి మట్టి, రాళ్లు జారిపడకుండా పీచు కార్పెట్లను అమర్చడం విమర్శలకు తావిస్తోంది. తాత్కాలికంగా చేపట్టిన రక్షణ చర్యల వలన భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
- ప్రమాదాల నియంత్రణకు కంటితుడుపు చర్యలు
- హైవే 516-ఈ నిర్మాణం కోసం చింతాలమ్మఘాట్ రోడ్డులో కొండను దొలిచిన వైనం
- మట్టి, రాళ్లు జారిపడకుండా పీచు కార్పెట్లతో మూసివేత
- ఎంత కాలం ఉంటాయో తెలియని పరిస్థితి
- ఇనుప మెష్‌లు అమర్చాలని వాహనచోదకుల డిమాండ్
కొయ్యూరు, జూలై 29(ఆంధ్రజ్యోతి): చింతాలమ్మ ఘాట్ రోడ్డులో జాతీయ రహదారి 516-ఈ నిర్మాణానికి వీలుగా మలుపుల్లో కొండను దొలిచిన అధికారులు కంటితుడుపు చర్యగా కొండ నుంచి మట్టి, రాళ్లు జారిపడకుండా పీచు కార్పెట్లను అమర్చడం విమర్శలకు తావిస్తోంది. తాత్కాలికంగా చేపట్టిన రక్షణ చర్యల వలన భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు చేపడుతున్న జాతీయ రహదారి 516-ఈ నిర్మాణ పనులు కొయ్యూరు మండల పరిధిలో దాదాపు చివరి దశకు చేరాయి. ఇందులో భాగంగా చింతాలమ్మఘాట్‌లో ఏడొంపుల ఘాట్ విస్తరణ పనులకు వీలుగా ఘాట్ రోడ్డులో పలు చోట్ల కొండను దొలిచి నిర్మాణాలు చేపట్టారు. భవిష్యత్తులో దొలిచిన కొండవాలు నుంచి బండరాళ్లు, మట్టి జారిపడకుండా కొన్ని చోట్ల రక్షణ గోడలు నిర్మించారు. కొయ్యూరు నుంచి కృష్ణాదేవిపేట వెళ్లే మార్గంలో ఘాట్‌రోడ్డు మొదటి మలుపు వద్ద రహదారి విస్తరణకు వీలుగా సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి పెద్ద బండరాళ్లను పేల్చి మట్టిని తొలగించారు. అలాగే ఎస్ ఆకార మలుపు వద్ద కొండను పిండి చేశారు. ఘాట్ మధ్యలో మరో చోట 15 అడుగులు మేర మట్టిని తొలగించారు. అలాగే కృష్ణాదేవిపేట నుంచి కొయ్యూరు వెళ్లే మార్గంలో ఘాట్‌రోడ్డు ప్రారంభం రెండవ మలుపు వద్ద 30 అడుగులు పైబడి మట్టిని తొలగించి రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. వాస్తవానికి ఈ ప్రదేశాలు ప్రమాదకరమైనవి. వర్షం కురిస్తే మట్టి కరిగి బండరాళ్లు కింద పడే ప్రమాదం ఉంది. ఇటువంటి ప్రమాదకర ప్రదేశాల్లో రక్షణ గోడలు నిర్మించలేదు. కంటితుడుపు చర్యగా పీచుతో తయారు చేసిన కార్పెట్లను అక్కడ అమరుస్తున్నారు. దీని వల్ల ఘాట్ రోడ్డులో రక్షణ చర్యలు ప్రశ్నార్థకంగా మారాయి. భారీ వర్షం కురిస్తే విరిగి పడే కొండచరియలను ఈ కార్పెట్లు అడ్డుకోవడం కష్టమే. ప్రమాదాలు జరగక ముందే అధికారులు స్పందించి ఆయా ప్రదేశాల్లో పీచు కార్పెట్లకు బదులు ఇనుప మెష్‌లను అమర్చాలని పలువురు కోరుతున్నారు.