Share News

వీఎంఆర్‌ఆర్‌డీఏలో ఇష్టారాజ్యం

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:21 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

వీఎంఆర్‌ఆర్‌డీఏలో ఇష్టారాజ్యం

కళ్లు మూసుకొని పనిచేస్తున్న అధికారులు

ఎదురుగానే ఉన్నా చిల్డ్రన్‌ ఎరీనాపై ఎప్పుడూ నిర్లక్ష్యమే

దాంతో రాజకీయ వివాదం

కైలాసగిరిపైనే అంతే...

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు కళ్లు మూసుకొని అంతా బాగానే నడిచిపోతున్నదని కాలం గడిపేస్తున్నారు. సోమవారం గ్రీవెన్స్‌లో బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే తప్ప ఉన్నతాధికారుల దృష్టికి అసలు వాస్తవాలు రావడం లేదు.

తాజాగా సిరిపురంలో చిల్డ్రన్‌ ఎరీనా కేటాయింపు రద్దు రాజకీయ వివాదానికి దారితీసింది. చిల్డ్రన్‌ ఎరీనా వీఎంఆర్‌డీఏ ప్రధాన కార్యాలయానికి ఎదురుగానే ఉన్నా ఉన్నతాధికారులు ఎప్పుడూ దానిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. గతంలో అక్కడ పనిచేసే ఉద్యోగి హాల్‌ను బుక్‌ చేసుకునే వారు తాను చెప్పిన వారి దగ్గరే క్యాటరింగ్‌, ఫొటోగ్రాఫర్‌, వీడియోగ్రాఫర్‌, డెకరేషన్‌ బుక్‌ చేసుకోవాలని ఒత్తిడి పెట్టేవారు. వారి దగ్గర కమీషన్లు తీసుకునేవారు. దీని కోసం ఎరీనాలోనే ఓ కంప్యూటర్‌ పెట్టుకొని, కార్యాలయం సెటప్‌ చేసుకున్నారు. ఫిర్యాదులు అందడంతో ఆ తరువాత చర్యలు తీసుకున్నారు. చిల్డ్రన్‌ ఎరీనాను రాజకీయ కార్యక్రమాల నిర్వహణకు ఇవ్వరు. అది నిబంధనలకు విరుద్ఢం. అలాగే హిందూ వివాహాలకు కూడా ఇవ్వరు. హోమం నిర్వహించేటప్పుడు వచ్చే పొగకు పైన ఫైర్‌ సెన్సార్లు యాక్టివేట్‌ అయి అలారం మోగుతుందని వాటిని కూడా జాబితా నుంచి తీసేశారు. కొద్ది రోజుల క్రితం ధర్మాన ఆనంద్‌ అనే వ్యక్తి ‘గెట్‌ టుగెదర్‌’ పేరుతో ఈ నెల 22వ తేదీకి ఎరీనాను బుక్‌ చేసుకున్నారు. ఈ కార్యక్రమం సోమవారం జరగాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం వచ్చి బ్యానర్లు పెట్టారు. అవన్నీ వైసీపీకి చెందినవి కావడం గమనార్హం. అందులో జగన్‌ ఫొటోలు, జిల్లా నాయకుల ఫొటోలు ఉన్నాయి. తాను వైసీపీలో చేరడానికి ఆయన ఎరీనాను వేదికగా ఎంపిక చేసుకున్నారు. సోమవారం ఉదయం వరకూ అధికారులు ఈ విషయం గుర్తించలేదు. వాట్సాప్‌ గ్రూపుల్లో ‘వైసీపీలో చేరికలు’కు ఆహ్వానం అంటూ పోస్టింగ్స్‌ రావడంతో ఎవరో చూసి వీఎంఆర్‌డీఏ పెద్దలకు వాటిని పంపించారు. అది చూసి వారు నాలుక కరుచుకున్నారు. వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి రాజకీయ కార్యక్రమాలకు ఎలా ఇచ్చారు?...అని ప్రశ్నిస్తే. ఎవరి మటుకు వారు ‘నాకు తెలియదు అంటే నాకు తెలియదు’ అంటూ తప్పించుకున్నారు. చివరకు అంతా ఒక నిర్ణయానికి వచ్చి ఆ కేటాయింపును రద్దు చేస్తున్నట్టు సదరు వ్యక్తికి సమాచారం పంపించి, సోమవారం ఉదయం ఎరీనా గేట్లకు తాళం వేశారు.

కైలాసగిరిపైనా అంతే...

కైలాసగిరిపై ఆరు నెలల క్రితం 3,900 గజాల స్థలం వేలానికి పెట్టారు. ఓ వ్యక్తి పాడుకొని అందులో దుకాణాల ఏర్పాట్లు ప్రారంభించారు. అది చూసి అర్బన్‌ ఫారెస్ట్‌ విభాగం అధికారులు ఆ స్థలంలో మొక్కలు ఉన్నాయని, వాటిని వదిలేసి మిగిలిన ప్రాంతంలో పని చేసుకోవాలని సూచించారు. ఇలా కేటాయించిన స్థలంలో మార్పులు జరిగితే ఆ వేలం రద్దు చేసి మళ్లీ వేలం వేయాలి. కానీ అధికారులు అలా చేయలేదు. సదరు వ్యక్తి ఏకంగా ఐదు వేల గజాల విస్తీర్ణంలో దుకాణాలు ఏర్పాటు చేసి, అన్ని రకాల వ్యాపారాలు ప్రారంభించడంతో మిగిలిన వారి వ్యాపారాలు ఆగిపోయాయి. దాంతో వారు లబోదిబోమంటూ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఆ కేటాయింపు రద్దు చేశారు. ఇక్కడ మరో తప్పు చేశారు. ఎవరికైనా స్థలం కేటాయిస్తే దానికి నిబంధనలతో కూడిన ప్రొసీడింగ్స్‌ ఇస్తారు. అవి అందిన తరువాతే పనులు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఈ కేసులో అధికారులు అసలు ప్రొసీడింగ్సే ఇవ్వలేదు. అవి లేకుండా రద్దు ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. విభాగాధిపతుల సీట్లలో కూర్చొని ఇలాంటి తప్పుడు చేస్తున్నారేమిటి?...అంటూ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ ఆ స్థలం కేటాయించిన ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే విభాగంలో ఎరీనా కేటాయింపు వివాదం తలెత్తింది. ఎదురుగా ఉన్న ఎరీనాలోనే ఏమి జరుగుతున్నదో అధికారులు గుర్తించకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనలకు విరుద్ధమనే రద్దు

తేజ్‌ భరత్‌, మెట్రోపాలిటన్‌ కమిషనర్‌

చిల్డ్రన్‌ ఎరీనాలో ఆదివారం మాజీ సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా వారు బ్యానర్లు కట్టారు. నిబంధనల ప్రకారం రాజకీయ నాయకుల ప్రచారం ఆ ప్రాంగణంలో నిషిద్ధం. అందుకని సోమవారం కార్యక్రమానికి కేటాయింపు రద్దు చేశాం. అదొక్కటే కాకుండా ఏసీలు పనిచేయడం లేదనే విషయం తెలిసింది. వాటిని రిపేర్‌ చేయడానికి రెండు రోజులు ఎవరికీ ఇవ్వడం లేదు.

Updated Date - Dec 23 , 2025 | 01:21 AM