జనవరి 3, 4 తేదీల్లో అరకు చలి ఉత్సవాలు
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:34 PM
ఆంధ్రా ఊటీ అరకులోయలో జనవరి నెల 3, 4 తేదీల్లో చలి ఉత్సవాలు నిర్వహించే అవకాశముందని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు.
కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్
ఉత్సవాలకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశం
ఉత్సవాలపై టీజర్, వాల్‌పోస్టర్లు రూపొందించాలని సూచన
పాడేరు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా ఊటీ అరకులోయలో జనవరి నెల 3, 4 తేదీల్లో చలి ఉత్సవాలు నిర్వహించే అవకాశముందని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం అరకు చలి ఉత్సవాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చలి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రెండు రోజులు వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాల ఏర్పాట్లను పక్కాగా చేయాలన్నారు. అలాగే ఎవరికి అప్పగించిన పనులను వారు సక్రమంగా చేపట్టి ఉత్సవాలను సంపూర్ణంగా విజయవంతం చేయాలన్నారు.
ఉత్సవాల్లో రెండు రోజులు చేపట్టే కార్యక్రమాలు
అరకు చలి ఉత్సవాలు మొదటి రోజు (జనవరి 3న) వివిధ రకాల స్టాళ్ల ప్రారంభోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తారు. రెండో రోజు(4న) సైక్లింగ్, లేజర్ షో, ప్లవర్ షో, గిరిజన సంప్రదాయ ప్రదర్శనలు, దేశంలో వివిధ ప్రాంతాల గిరిజన కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని కలెక్టర్ దినేశ్‌కుమార్ పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల నుంచి ప్రభుత్వ స్టాళ్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే సైక్లింగ్ పోటీల నిర్వహణకు అనుగుణంగా ఎటువంటి ప్రమాదాలకు జరగకుండా జాతీయ రహదారిపై అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ఉత్సవాలకు వచ్చేవారికి సౌకర్యవంతంగా ఉండేలా ఫుడ్ స్టాళ్లు నిర్వహించాలన్నారు. ఉత్సవాలకు వచ్చే వారంతా ఆహ్లాదకర వాతావరణంలో ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. అలాగే ఉత్సవాలకు విస్తృత ప్రచారం కల్పించాలని, అందుకు టీజర్, వాల్‌పోస్టర్లను సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, జిల్లా పర్యాటకాధికారి జి.దాసు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీవీ.పరిమిళ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.