19న డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు
ABN , Publish Date - Sep 14 , 2025 | 01:08 AM
మెగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 19వ తేదీన అమరావతిలో నియామక పత్రాలు అందజేస్తారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ల చేతుల మీదుగా అందజేత
వెలగపూడిలో సచివాలయం సమీపాన అభినందన సభ
ఉత్తరాంధ్రలో గల 2,660 అభ్యర్థుల కోసం 118 బస్సులు ఏర్పాటు
ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం అభ్యర్థులకు పది రోజులపాటు శిక్షణ
విశాఖపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):
మెగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 19వ తేదీన అమరావతిలో నియామక పత్రాలు అందజేస్తారు. ఇందుకోసం వెలగపూడిలో సచివాలయం వెనుక అభినందన సభ ఏర్పాటుకు విద్యా శాఖ సన్నాహాలు చేస్తోంది. ఉత్తరాంధ్రలో 2,660 మందికి నియామక పత్రాలు అందజేస్తారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ, గురుకులాలు/మోడల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, టీజీటీ, పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తోడుగా కుటుంబ సభ్యుల్లో ఒకరిని అభినందన సభకు అనుమతిస్తారు. ఉత్తరాంధ్ర నుంచి అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులను తీసుకువెళ్లడానికి సుమారు 120 బస్సులు ఏర్పాటుచేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి ఈనెల 18వ తేదీ ఉదయం బస్సులు బయలుదేరతాయి. ఆరోజు రాత్రికి విజయవాడ సమీపంలో వారికి వసతి ఏర్పాటుచేస్తారు. 19వ తేదీ ఉదయం అభినందన సభలో జిల్లాల నుంచి ఎంపిక చేసిన కొద్దిమందికి సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, ఇతర ప్రముఖులు నియామక పత్రాలు అందజేస్తారు. మిగిలిన వారికి అదే ప్రాంగణంలో ఏర్పాటుచేసే కౌంటర్ల ద్వారా పత్రాలు ఇవ్వనున్నారు. అభినందన సభ ముగిసిన తరువాత తిరిగి అవే బస్సుల్లో జిల్లాలకు తీసుకువస్తారు. ఆ తరువాత ఎంపికైన అభ్యర్థులకు పాఠశాలల నిర్వహణ, బోధన, పరిపాలన, ఇతర అంశాలపై జిల్లాల వారీగా పది రోజులపాటు శిక్షణ ఇస్తారు. ఇప్పటివరకూ డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్లను కౌన్సెలింగ్‌లోనే పాఠశాలలు కేటాయించేసేవారు. ఈ పర్యాయం పది రోజుల శిక్షణ ఇచ్చిన తరువాత పాఠశాలలకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఉద్యోగికి శిక్షణ అవసరమని విద్యా శాఖ అధికారి ఒకరు తెలిపారు. దసరా సెలవులు తరువాత కొత్త టీచర్లకు పాఠశాలలు కేటాయించనున్నట్టు పేర్కొన్నారు.