Share News

అర్జీలను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 14 , 2025 | 01:15 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) లో స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత అధికారులకు సూచించారు.

అర్జీలను త్వరగా పరిష్కరించాలి
ఐడీడీఏలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న డీఆర్‌వో పద్మలత, టీడబ్ల్యూ ఎస్‌డీసీ లోకేశ్వరరావు

జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత

పీజీఆర్‌ఎస్‌లో 105 వినతులు స్వీకరణ

పాడేరు, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) లో స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత అధికారులకు సూచించారు. కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్‌ శార్యమన్‌పటేల్‌ అమరావతి వెళ్లడంతో శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎంవీఎస్‌.లోకేశ్వరరావుతో కలిసి డీఆర్వో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాము స్వీకరించిన వినతులను సంబంధిత శాఖలకు పంపిస్తామని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, వేగంగా పరిష్కరించాలన్నారు. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని ఆమె స్పష్టం చేశారు.

105 వినతులు స్వీకరణ

ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 105 వినతులను అధికారులు స్వీకరించారు. ముంచంగిపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ నడుమూరుకు చెందిన నారాయణరావు, తనకు హౌసింగ్‌ బిల్లులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని మంజూరు చేయించాలని కోరారు. కొయ్యూరు మండలం అంతాడ పంచాయతీ ఎద్దుమామిడి, సింగూరు గ్రామాలకు తారురోడ్డు నిర్మించాలని గ్రామస్థులు రమణబాబు, సోమరాజు కోరారు. తన కుమార్తెకు ఏకలవ్య మోడల్‌ స్కూల్‌లో ఆరో తరగతిలో ప్రవేశం కల్పించాలని పాడేరు మండలం గుత్తులపుట్టు పంచాయతీ జల్లిపల్లికి చెందిన మజ్జి రవికుమార్‌ కోరగా, చింతపల్లి మండలం లంబసింగిలో నాటుసారాను నిర్మూలించాలని గ్రామస్థులు మహేశ్‌, కృష్ణమూర్తిరాజు, కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. వై.రామవరం మండలం బొద్దిగొంది గెడ్డపై వంతెన నిర్మించాలని గిరిజనులు సంతోశ్‌, వెంకటరావు, సతీశ్‌, తదితర 50 మంది వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ జమాల్‌బాషా, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నంద్‌, డ్వామా పీడీ విద్యాసాగరావు, జిల్లా ఉద్యావనాధికారి రమేశ్‌కుమార్‌రావు, సర్వే విభాగం ఏడీ దేవేంద్రుడు, పట్టు పరిశ్రమ శాఖ ఏడీ రమణారావు, పశు సంవర్థక శాఖ డీడీ నరసింహులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 01:15 AM