సమస్యల పరిష్కారంలో అర్జీదారులు సంతృప్తి చెందాలి
ABN , Publish Date - May 19 , 2025 | 11:25 PM
అర్జీదారులు సంతృప్తి చెందేలా వారు ఇచ్చిన వినతులకు పరిష్కారం చూపాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి కలెక్టరేట్, మే 19 (ఆంధ్రజ్యోతి): అర్జీదారులు సంతృప్తి చెందేలా వారు ఇచ్చిన వినతులకు పరిష్కారం చూపాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ఆమెతోపాటు డీఆర్‌ఓ సత్యనారాయణరావు, ఎస్‌డీసీ సుబ్బలక్ష్మి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులకు సంబంధించిన సమస్యలను నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలన్నారు. ఒకవేళ సమస్య పరిష్కరించడానికి వీలుకానిపక్షంలో అందుకుగల కారణాన్ని సంబంధిత అర్జీదారునికి అర్థం అయ్యేలా వివరించాలని సూచించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 370 అర్జీలు అందాయని కలెక్టరేట్ అధికారులు తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో..
అనకాపల్లి రూరల్, మే 19 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు అందించే ప్రతి అర్జీ లేదా ఫిర్యాదుపై సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ తుహిన్‌సిన్హా పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అందరి సమస్యలను స్వయంగా ఆలకించి, అర్జీలను పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు బదలాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీస్ శాఖకు అందే అర్జీలను సాధ్యమైనంతవరకు శత శాతం పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. కాగా పీజీఆర్‌ఎస్‌లో 40 అర్జీలు అందినట్టు జిల్లా పోలీస్ కార్యాలయం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ (క్రైమ్) ఎల్.మోహన్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.