Share News

అప్పన్న ఉత్తర ద్వార దర్శనం రేపు

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:45 AM

సింహగిరిపై ఈనెల 30వ తేదీన జరగనున్న వరాహలక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

అప్పన్న ఉత్తర ద్వార దర్శనం రేపు

అర్థరాత్రి నుంచి ఉత్సవాలు ప్రారంభం

అనువంశిక ధర్మకర్తకు తొలి దర్శనం

వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్లు

40 వేల మంది భక్తులు వస్తారని అంచనా

ఉదయం 5.30 గంటల నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం

నేటి సాయంత్రం 6 గంటల నుంచి ఆలయంలో స్వామి దర్శనాలు నిలుపుదల

సింహాచలం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి):

సింహగిరిపై ఈనెల 30వ తేదీన జరగనున్న వరాహలక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సుమారు 40 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్టు ఈవో నున్న సుజాత తెలిపారు. సాధారణ భక్తుల దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తూనే.. ప్రొటోకాల్‌ పరిధిలో వీఐపీ గ్యాలరీ ఏర్పాటుచేస్తామన్నారు. ఉత్సవం సందర్భంగా రాజగోపురాలను, గర్భాలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకునేలా క్యూలైన్లు సిద్ధం చేశామన్నారు.

మంగళవారం రాత్రి ఒంటి గంటకు సుప్రభాతసేవ, 1.30 నుంచి వేకువజామున 3.30 గంటల వరకు ఆరాధన, 4 నుంచి 4.45 గంటల వరకు అయ్యవారి సేవ, ఉదయం 5 నుంచి 5.15 గంటల వరకు ఉత్తరద్వారంలో స్వామిని ఉంచి అనువంశిక ధర్మకర్తకు తొలి దర్శనం కల్పిస్తారు. ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు ఉత్తర రాజగోపురంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై స్వామి భక్తులకు దర్శనమిస్తారు. 11 నుంచి గ్రామ తిరువీధి, 11.30 నుంచి 3 గంటల వరకు పవళింపుసేవ నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వర కు సాధారణ దర్శనాలు, ఆ తరువాత ఆరాధన నేపథ్యం లో దర్శనాలను నిలిపివేస్తారు. ఉత్సవం నేపథ్యంలో నిత్య కల్యాణంతో పాటు ఆర్జితసేవలను రద్దుచేశారు. ప్రొటోకాల్‌ ప్రముఖులకు మినహా ఇతరులకు నీలాద్రిగుమ్మం నుంచి లఘు దర్శనాలు మాత్రమే కల్పిస్తారు. అంతరాలయంలో పూజలు, వేదాశీర్వచనాలు ఉండవు. 29న సాయంత్రం ఆరు గంటల తరువాత భక్తులకు దర్శనాలు లభించవు. ముక్కోటి ఏకాదశి రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తులకు నిర్విరామంగా పొంగలి, పులుసు ప్రసాదాన్ని పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో తాగునీరు, పాలు, బిస్కెట్లు అందించనున్నారు. భక్తుల భద్రతకు 340 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారు.


నేడు రెవెన్యూ క్లినిక్‌

కలెక్టరేట్‌ వీసీ హాల్లో నిర్వహణ

హాజరుకానున్న జేసీ, ఇద్దరు ఆర్డీవోలు, 11 మంది తహశీల్దార్లు

కలెక్టరేట్‌లో యథావిధిగా పీజీఆర్‌ఎస్‌

విశాఖపట్నం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి):

భూ సంబంధ సమస్యల పరిష్కారానికి నిర్వహించనున్న రెవెన్యూ క్లినిక్‌లు సోమవారం ప్రారంభం కానున్నాయి. ప్రతి వారం నిర్వహించే ప్రజాఫిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్‌)తో పాటు వీటిని నిర్వహిస్తారు. ఇందుకోసం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ను సిద్ధం చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌అశోక్‌ తెలిపారు. కార్యక్రమంలో విశాఖ, భీమిలి ఆర్డీవోలు, 11 మండలాల తహశీల్దార్లు పాల్గొంటారన్నారు. రెవెన్యూ సంబంధ అంశాలపై ప్రజలు తమ అర్జీలు రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలని కోరారు. కాగా కలెక్టరేట్‌లో ప్రజాఫిర్యాదుల పరిష్కారవేదికలో యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌ స్పష్టం చేశారు.

నిర్వహణ ఇలా...

ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్‌లో అర్జీలు స్వీకరిస్తారు. ఈ క్రమంలో గ్రామ అడంగల్‌, 10(1) రికార్డు, వెబ్‌ల్యాండ్‌, ఎస్‌ఎఫ్‌ఏ, ఇతర రికార్డులు సిద్ధంగా ఉంచాలని తహశీల్దార్లకు ఆదేశాలిచ్చారు. అంశాలవారీగా ఆర్‌ఓఆర్‌, ఏజెన్సీ భూముల రీసర్వే పేరిట రెవెన్యూ టేబుళ్లు ఏర్పాటుచేస్తారు. రిసెప్షన్‌ ఏర్పాటు చేసి, వచ్చిన పని, అవసరమైన డాక్యుమెంట్లు తెచ్చారా పరిశీలించి ఏ టేబుల్‌ వద్దకు వెళ్లాలో చెప్పాలి. సర్వేనంబరు ఆధారంగా భూమి వివరాలు తీసుకోవాలి. ఇతర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పరిశీలించాలి. ఫిర్యాదులో పేర్కొన్న భూమి స్వభావం, సమస్య, పరిష్కార చర్యలతో నివేదిక అర్జీదారుడికి అందించాలి.

చర్యలు ఇవీ...

పిటిషన్‌లోని అంశాలు సివిల్‌ వివాదమైతే కోర్టుకు వెళ్లాలని సూచించాలి. వాటిపై తహశీల్దారు స్పందన తీసుకోవాలి. క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాల్సి వస్తే వెంటనే ఫోన్‌ చేయాలి. పరిష్కారంలో తహశీల్దార్లదే ప్రాఽథమిక బాధ్యత, ప్రతి పిటిషన్‌పై సరైన చర్య ఉన్నట్టు నిర్ధారించుకున్న తరువాతే ముగించాలి. ఈ విషయాన్ని పిటిషనర్‌కు తెలియజేయాలి.

నేడు విశాఖ- అరకు ప్రత్యేక రైలు

విశాఖపట్నం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ- అరకు మధ్య ఈనెల 29న (సోమవారం) ప్రత్యేక రైలును నడుపుతున్నామని సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌ తెలిపారు. 08525 నంబరు గల రైలు సోమవారం (29న) ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయలుదేరి 11.45 గంటలకు అరకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08526 నంబరు గల రైలు సోమవారం (29న) మధ్యాహ్నం 2 గంటలకు అరకులో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుతుంది.


మద్యం మత్తులో వీరంగం

ట్రాఫిక్‌ ఎస్‌ఐపై నేవీ అధికారి దాడి

కారు ఆపినందుకు సిబ్బందిపై చిందులు

కేసు నమోదుచేసిన పోలీసులు

మల్కాపురం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి):

మద్యం మత్తులో నేవీ అధికారి వీరంగం సృష్టించాడు. ట్రాఫిక్‌ సిబ్బందిపై చిందులేసి, ఎస్‌ఐపై దాడిచేశాడు. దీంతో మల్కాపురం పోలీసులు కేసు నమోదుచేశారు. సీఐ గొలగాని అప్పారావు తెలిపిన వివరాల మేరకు...

సింథియా సమీపంలోని పైప్‌లైన్‌ జంక్షన్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మల్కాపురం ట్రాఫిక్‌ ఎస్‌ఐ కె.శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో నేవల్‌ లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ రాహుల్‌ కిషన వేగంగా వస్తుండగా సిబ్బంది ఆపారు. ఎస్‌ఐ వద్దకు వెళ్లాలని సూచించగా వారిపై చిందులేసి దాడి చేశాడు. అనంతరం ఎస్‌ఐ శ్రీనివాసరావు వద్దకు వెళ్లి అతనిపై ముష్టిఘాతాలు కురిపించాడు. హఠాత్పరిణామంతో పోలీసుల్లో ఆందోళన నెలకొంది. ఈ లోగా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఫిర్యాదుపై సీఐ గొలగాని అప్పారావు కేసు నమోదుచేశారు. క్రిషన్‌కు ఆల్కహాల్‌పరీక్ష నిర్వహించగా 88.4/100 ఎంజీగా వచ్చింది. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Updated Date - Dec 29 , 2025 | 12:45 AM