Share News

నేటి నుంచి అప్పన్న వార్షిక తిరు కల్యాణోత్సవాలు

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:00 AM

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం వరాహలక్ష్మీనృసింహస్వామి వార్షిక తిరు కల్యాణోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

నేటి నుంచి అప్పన్న వార్షిక తిరు కల్యాణోత్సవాలు

  • వారం రోజుల పాటు నిర్వహణ

  • 8వ తేదీ రాత్రి 10.30 గంటలకు కల్యాణం

  • ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థానం అధికారులు

  • ఉత్సవాల నేపథ్యంలో దర్శన వేళల్లో స్వల్ప మార్పు, ఆర్జిత సేవలు రద్దు

సింహాచలం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం వరాహలక్ష్మీనృసింహస్వామి వార్షిక తిరు కల్యాణోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వారం రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు వేకువజామున నాలుగు గంటల నుంచి సాయంత్రం వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరగనున్నాయి. రాత్రి 7 గంటలకు భక్తులకు దర్శనాలను నిలిపివేశాక ప్రధానాలయంలో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణము, ఉత్సవాంగీకారం జరుగుతాయి. అనంతరం చక్రపెరుమాళ్‌ను పల్లకీలోలో పుట్టబంగారం మండపానికి తీసుకువెళ్లి, మృత్య్సంగ్రహణం చేశాక అంకురార్పణలతో కల్యాణోత్సవాలకు శ్రీకారం చుడతారు. 8వ తేదీ రాత్రి 10.30 గంటల నుంచి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం విశేష హోమాలు చేసేందుకు ఉత్తర రాజగోపురానికి సమీపంలో ప్రత్యేక యాగశాలను నిర్మించారు. మధ్యాహ్నం 3 గంటలకు కొట్నాల ఉత్సవం, సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు ఆరాధన, విశేష హోమాలు, ధ్వజారోహణం, తిరువీధి, సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు ఎదురు సన్నాహోత్సవం, రాత్రి 7.30 నుంచి 8 గంటల వరకు స్వామివారిని రథంపై ఉంచి అలంకరణ, 8.15 నుంచి 9.30 వరకు మాడవీధుల్లో రథోత్సవం జరుపుతారు. ఆ తరువాత ఉత్తర రాజగోపురానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ప్రత్యేకంగా తయారుచేసిన పుష్ప వేదికపై స్వామివారి వార్షిక తిరు కల్యాణాన్ని నిర్వహిస్తారు. 10న పండిత సద్యసాన్ని పురస్కరించుకుని సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేణుగోపాలుడిగా అలంకరించి సర్వజన మనోరంజని వాహనంలో మాడవీధుల్లో ఊరేగిస్తారు. స్వామివారు స్వర్ణనారసింహ కవచంలో భక్తులకు దర్శనమిస్తారు. 11న సాయంత్రం 5 గంటలకు సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో తిరువీధి నిర్వహిస్తారు. 12వ తేదీ వేకువజామున 3 గంటలకు సుప్రభాతసేవ చేశాక ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, తిరువీధి, చక్రస్నానం, రాత్రి 7 గంటలకు మృగయోత్సవం (దొంగలదోపు ఉత్సవం), అశ్వవాహనంపై తిరువీధి, ధ్వజారోహణం జరుగుతాయి. 13వ తేదీ ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, 8 నుంచి వినోదోత్సవం (ఉంగరపు సేవ) నిర్వహిస్తారు.

దర్శన వేళల్లో మార్పు, ఆర్జిత సేవలు రద్దు

వార్షిక తిరు కల్యాణం, నిజరూప దర్శనం చందనోత్సవాలను పురస్కరించుకుని సింహాచలేశుని దర్శన వేళల్లో స్వల్ప మార్పు చేయడంతో పాటు ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈనెల 7 నుంచి 14 వరకు వేకువజామున జరిగే సుప్రభాతసేవ, ఉదయం, రాత్రి ఆరాధన సేవ టికెట్ల విక్రయాలను రద్దు చేశారు. 7వ తేదీ నుంచి 14 వరకు రాత్రి 7 గంటల తరువాత భక్తులకు దర్శనాలు లభించవు. అలాగే 7 నుంచి 23వ తేదీ వరకు ఆలయంలో జరిగే నిత్య కల్యాణం, స్వర్ణ పుష్పార్చన, సహస్రనామార్చన, గరుడసేవ, తదితర అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేశారు. 13న స్వామివారి శ్రీపుష్పయాగాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనాలు లభిస్తాయి.

Updated Date - Apr 07 , 2025 | 12:00 AM