అప్పన్న చందనోత్సవ టికెట్ల విక్రయాలు ప్రారంభం
ABN , Publish Date - Apr 25 , 2025 | 01:17 AM
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిపై పూతగా వేసేందుకు చందనం సిద్ధం చేస్తున్నారు.
సింహాచలం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) టికెట్ల విక్రయాల గురువారం ప్రారంభమయ్యాయి. నిర్ణీత సమయానికి దేవస్థానం ఈఓ కె.సుబ్బారావు పూజలు చేసి, తొలి టికెట్‌ను సింహగిరిపై పాత పీఆర్‌ఓ ఆఫీసు కౌంటర్‌లో భక్తునికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఈవో అందజేశారు. టికెట్ల కోసం దేవస్థానం రూపొందించిన ప్రత్యేక దరఖాస్తులో పేరు, ఆధార్ కార్డు నంబరు, చిరునామాలను రాసి అందజేయాలి. దాని ఆధారంగా కౌంటర్‌లోని సిబ్బంది రూ.300 లేదా రూ.1000 టికెట్లను స్లాట్స్ కేటాయించి అందజేస్తున్నారు. ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్ సింహాచలం శాఖలతోపాటు నగరంలోని మరికొన్ని శాఖల్లో, ఆన్‌లైన్‌లో కూడా చందనోత్సవ టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి.
తొలివిడత చందనం అరగదీతకు శ్రీకారం
సింహాచలం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిపై పూతగా వేసేందుకు చందనం సిద్ధం చేస్తున్నారు. గురువారం ఆలయ ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వామికి నాలుగు విడతలలో 12 మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. తొలివిడత చందన చెక్కల అరగదీతను ఏటా చైత్రమాస బహుళపక్ష ఏకాదశినాడు ప్రారంభించడం ఆచారంగా వస్తోంది. అదేక్రమంలో గురువారం సుప్రభాతసేవ, ప్రభాతారాధనలు తరువాత ముందుగా సిద్ధం చేసిన మంచి గంధపు చెక్కను మంగళవాయిద్యాల నడుమ దేవస్థానం ఈఓ కె.సుబ్బారావుతో కలిసి బేడామండప ప్రదక్షిణయుతంగా అంతరాలయంలోకి తీసుకువెళ్లి పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో సిద్ధంగా ఉంచిన ప్రత్యేక శిలలపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ అరగదీయడానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఈ నెల 30న చందనోత్సవం రోజున అప్పన్నకు తొలివిడత చందనం సమర్పిస్తారు.