Share News

30న ఉత్తర ద్వారంలో అప్పన్న

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:31 AM

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీ సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

30న ఉత్తర ద్వారంలో అప్పన్న

ఆన్‌లైన్‌లోనే టికెట్ల విక్రయం

సింహాచలం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీ సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆరోజు దర్శన టిక్కెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే విక్రయించనున్నట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ఎన్‌.సుజాత సోమవారం ప్రకటన విడుదల చేశారు. శీఘ్రదర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లతోపాటు ముక్కోటి ఉత్సవాన్ని పురస్కరించుకుని అదనంగా రూ.500 ప్రత్యేక టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో మాత్రమే భక్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. టికెట్లు ఈ నెల 26 నుంచి 29వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దేవస్థానం వెబ్‌సైట్‌లో లేదా మనమిత్ర మొబైల్‌ యాప్‌ ద్వారా వాట్సాప్‌ నంబరు 95523 00009 నుంచి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.

29 వరకు ఉదయం 9.30 నుంచి అప్పన్న దర్శనానికి బ్రేక్‌

సింహాద్రినాథుని సన్నిధిలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా పగల్‌పత్తు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో బేడా మండప తిరువీధి తరువాత అత్యవసరంగా జరపాల్సిన వైదిక కార్యక్రమాల దృష్ట్యా ఈ నెల 29 వరకూ ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి సుమారు 30 నిమిషాల పాటు అప్పన్న దర్శనాలు భక్తులకు లభించవని దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ఎన్‌.సుజాత పేర్కొన్నారు. వైదిక విశేష కార్యక్రమాల తరువాత యథావిధిగా భక్తులకు సర్వదర్శనాలు ఉంటాయన్నారు.


విశాఖపట్నం పోర్టు కోసం షిప్‌యార్డ్‌లో రెండు టగ్‌ల నిర్మాణం

విశాఖపట్నం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం పోర్టుకు అవసరమైన రెండు బొల్లార్డ్‌ పుల్‌ టగ్‌ల నిర్మాణానికి హిందూస్థాన్‌ షిప్‌యార్డులో సోమవారం శ్రీకారం చుట్టారు. సుమారు 32.5 మీటర్ల పొడవు 60 టన్నుల బరువైన బొల్లార్డ్‌ టగ్‌ నిర్మాణానికి సోమవారం కీలు వేశారు. అదే వేదికపై మరో టగ్‌ నిర్మాణానికి పోర్టు, షిప్‌యార్డ్‌ మధ్య ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా పోర్టు చైర్మన్‌ అంగముత్తు మాట్లాడుతూ, అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి, నిర్మాణంలో నాణ్యత షిప్‌యార్డ్‌ అందిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. సరకు రవాణా పెరుగుతున్నందున అందుకు తగిన మౌలిక వసతులు పెంచుకోవడానికి ఈ టగ్‌లను ఆర్డర్‌ చేశామన్నారు. ఈ సహకారం ఇక ముందు కూడా కొనసాగుతుందన్నారు. షిప్‌యార్డు సీఎండీ కమొడోర్‌ గిరిదీప్‌ సింగ్‌ మాట్లాడుతూ, మేక్‌ ఇన్‌ ఇండియా నినాదానికి తగినట్టు నౌకల నిర్మాణం చేస్తున్నామని, అనుకున్న గడువులోగా ఇవ్వడమే తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు.


పెసా మహోత్సవ్‌కు సర్వంసిద్ధం

నేటి నుంచి ప్రారంభం...పోర్టు స్టేడియంలో కార్యక్రమాలు

గిరిజన ఉత్పత్తుల ప్రదర్శన కోసం స్టాళ్లు ఏర్పాటు

విశాఖపట్నం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):

నగరంలో తొలిసారిగా మంగళవారం నుంచి జరగనున్న ‘ది పంచాయతీస్‌ ఎక్స్‌టెన్షన్‌ టూ షెడ్యూల్డ్‌ ఏరియాస్‌’ (పెసా) మహోత్సవ్‌కు పంచాయతీరాజ్‌ శాఖ విస్తృత ఏర్పాట్లుచేసింది. పోర్టు స్టేడియంలో ఉత్సవ్‌ ప్రధాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలోని పది రాష్ట్రాల నుంచి 1,500 మంది క్రీడాకారులు, కళాకారులు హాజరవుతున్నారు. స్వాగత ద్వారం నుంచి అన్ని వేదికలను గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా అలంకరించారు. ఆయా రాష్ట్రాల గిరిజనులు ఉత్పత్తిచేసే వస్తువుల ప్రదర్శన కోసం 70 స్టాళ్లు ఏర్పాటుచేశారు. కేంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉత్సవ్‌లో భాగంగా బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పది గ్రామాల్లో పెసా సభలు జరగనున్నాయి.

Updated Date - Dec 23 , 2025 | 01:31 AM