డీసీసీబీలో దందాపై ఆప్కాబ్ ఆరా
ABN , Publish Date - Nov 06 , 2025 | 01:22 AM
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్ని రకాలుగా అర్హతలున్న ఒక ఉద్యోగికి పదోన్నతి కల్పించాలని మంత్రి ఒకరు స్వయంగా ఫోన్ చేసి బ్యాంకు పాలకులకు చెప్పారు. అయితే మంత్రి సూచన పాటించామని చెబుతూనే పదోన్నతి పొందిన సదరు ఉద్యోగి నుంచి భారీగా సొమ్ములు వసూలు చేశారు. ఈ విషయం మంత్రికి తెలియడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారని తెలిసింది. అలాగే పదోన్నతి పొందిన ఒకరు అడిగినంత సొమ్ము ఇవ్వలేదని శివారు ప్రాంతంలోని బ్రాంచిలో పోస్టింగ్ ఇచ్చారనేది మరో ఆరోపణ.
పదోన్నతికి అన్ని అర్హతలున్నా డబ్బులు వసూలు
మంత్రి సిఫారసు చేసిన ఉద్యోగి వద్ద కూడా...
బ్యాంకులో అనధికార వ్యక్తి పెత్తనం
ప్రాథమిక సహకార సంఘాల నుంచి కూడా
నెలవారీ మామూళ్లు వసూళ్లకు ప్రయత్నం
విశాఖపట్నం/నర్సీపట్నం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి):
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్ని రకాలుగా అర్హతలున్న ఒక ఉద్యోగికి పదోన్నతి కల్పించాలని మంత్రి ఒకరు స్వయంగా ఫోన్ చేసి బ్యాంకు పాలకులకు చెప్పారు. అయితే మంత్రి సూచన పాటించామని చెబుతూనే పదోన్నతి పొందిన సదరు ఉద్యోగి నుంచి భారీగా సొమ్ములు వసూలు చేశారు. ఈ విషయం మంత్రికి తెలియడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారని తెలిసింది. అలాగే పదోన్నతి పొందిన ఒకరు అడిగినంత సొమ్ము ఇవ్వలేదని శివారు ప్రాంతంలోని బ్రాంచిలో పోస్టింగ్ ఇచ్చారనేది మరో ఆరోపణ.
కాగా వాహన కంపెనీ షోరూమ్ ప్రతినిధి ఒకరు ప్రతిరోజు బ్యాంకుకు వచ్చి కీలక వ్యక్తి ఛాంబర్‌లో కూర్చుని పెత్తనం చలాయిస్తున్నారనే సిబ్బంది చెబుతున్నారు. ఆయన వ్యవహారశైలిపై అభ్యంతరం వ్యక్తంచేసినా పెద్దలు పట్టించుకోవడం లేదంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు తెలిసింది. ఇదిలావుండగా ఉమ్మడి జిల్లాలో 98 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సదరు ప్రైవేటు వ్యక్తి ఫోన్ చేసి ప్రతినెలా కొంత మామ్మూళ్లు కింద ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడంతో అనకాపల్లి జిల్లాలో పలు సొసైటీలకు చెందిన ఉద్యోగులు తమ పరిధిలో కూటమి ప్రజా ప్రతినిఽధుల దృష్టికి తీసుకువెళ్లారని తెలిసింది. సొసైటీలు నష్టాల్లో నడుస్తున్నాయని, ఇటువంటి తరుణంలో ఈ దందా ఏమిటని వాపోయినట్టు చెబుతున్నారు. డీసీసీబీలో పదోన్నతుల వ్యవహారంలో సొమ్ముల వసూళ్లపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం రావడంతో విజయవాడలోని ఆప్కాబ్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఎంతమందికి పదోన్నతి ఇచ్చారు?, వారిలో అనర్హులు ఉన్నారా?, పదోన్నతి పొందిన వారి నుంచి ఏ మేరకు వసూలు చేశారు?, పదోన్నతి పొందిన వారి వివరాలు పంపాలని బ్యాంకు ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఒకటి, రెండు రోజుల్లో ఆప్కాబ్ ప్రతినిధులు నగరంలోని డీసీసీబీని తనిఖీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.