పారిశ్రామికవేత్తలకు ఏపీ స్వర్గధామం
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:42 AM
పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ స్వర్గధామమని పలువురు పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు.
సీఐఐ సమ్మిట్‌లో పలువురు అభిప్రాయం
విశాఖపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ స్వర్గధామమని పలువురు పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇస్తున్న భరోసాతో సీఐఐ పెట్టుబడిదారుల సదస్సు ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగుతోందన్నారు. స్నేహపూర్వకమైన వాతావరణంలో ప్రభుత్వంతో పలు ప్రాజెక్టులకు ఎంవోయూలు చేసుకున్నామని వివరించారు.
రూ.650 కోట్లు పెట్టుబడి పెడుతున్నాం..
- అంజు వల్లభనేని, ప్రెసిడెంట్, ఐటీ సర్వ్ అలియన్స్ అమెరికా
అమెరికా అంతటా 2,500 చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలకు ఐటీ సర్వ్ అలియన్స్ ప్రాతినిథ్యం వహిస్తోంది. మంత్రి లోకేశ్ ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చాం. ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విశాఖలో రూ.650 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎంవోయూ చేసుకున్నాం. 10 వేల ఉద్యోగాలు కల్పిస్తాం. కాపులుప్పాడలో పది ఎకరాలు కేటయించారు.
పవర్ ఎలక్ర్టానిక్స్‌లో...
- సచిన్ శివపుర్, క్రెవావి టెక్నాలజీ సీఈవో, జర్మనీ
ఏపీలో రూ.200 కోట్లు పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకుంటున్నాం. దీని ద్వారా 500 మందికి ఉపాధి కల్పిస్తాం. పెట్టుబడిదారులకు భరోసా కల్పించేలా ఏపీ ప్రభుత్వం స్నేహపూర్వక వాతావరణం కల్పించింది. జర్మనీ నుంచి మరిన్ని కంపెనీలను ఏపీకి తీసుకొస్తాం. ప్రభుత్వంతో ఆ దిశగానే చర్చలు సాగాయి.
ప్రింటింగ్ సర్క్యూట్ బోర్డు రంగంలో రూ.350 కోట్లు
- వికాస్ అగర్వాల్, గుజరాత్
ప్రస్తుతం గుజరాత్‌లో ప్రింటింగ్ సర్క్యూట్ బోర్డు పరిశ్రమ నిర్వహిస్తున్నాం. అటువంటి యూనిట్‌ను సుమారు రూ.350 కోట్లతో ఏపీలో ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. ఎక్కడ ఏర్పాటు చేసేది ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుంది. ఈ పరిశ్రమ ద్వారా 850 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దేశ అవసరాలకు ప్రస్తుతం ఇతర దేశాల నుంచి ప్రింటింగ్ సర్క్యూట్ బోర్డులను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ రంగంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకునేలా పెట్టుబడులను పెట్టుబోతున్నాం.
రూ.2,500 కోట్లతో విశాఖలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ
- వెంకట సింహాద్రి, ఎండీ, ఆసిప్ టెక్నాలజీ
రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. రూ.2,500 కోట్లతో పెట్టుబడి పెట్టనున్నాం. మొదటి ఫేజ్‌లో రూ.2,000 కోట్లు పెట్టి 1,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. రెండో దశలో మిగిలిన రూ.500 కోట్లను పెట్టుబడి పెడతాం. దక్షిణ భారతదేశంలో ఈ తరహా పరిశ్రమ ఏర్పాటుకావడం ఇదే తొలిసారి. దీన్ని విశాఖలో ఏర్పాటు చేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం, మైటీ రూపొందించిన ఇండియా సెమీ కండక్టర్ మిషన్‌లో భాగంగా పది ప్రాజెక్టులకు రూ.76 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ పది ప్రాజెక్టుల్లో మాది ఒకటి. దీనిని సీఎం చంద్రబాబు చొరవతో విశాఖలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఇప్పటివరకూ సెమీ కండక్లర్ల కోసం తైవాన్, కొరియా, జపాన్ దేశాలపై ఆధారపడుతూ వస్తున్నాం. ఇకపై మనమే తయారు చేసుకోబోతున్నాం.
కిటకిటలాడిన ఎగ్జిబిషన్ స్టాల్స్
విశాఖపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):
ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో జరుగుతున్న సీఐఐ సదస్సు ప్రాంగణంలోని హాల్‌నంబర్-2లో ఏపీఐఐసీ, సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ సందర్శకులతో కిటకిటలాడింది. రాష్ట్ర ప్రభుత్వశాఖలు ఏపీ సీఆర్‌డీఏ, జీసీసీ, హస్తకళలు, లేపాక్షి, చేనేత, ఆయుష్ విభాగాలతో పాటు శ్రీసిటీ, రోబోటిక్ కెఫే వంటి సంస్థలు స్టాల్స్‌ను ఏర్పాటుచేశాయి. అయితే ఏపీసీఆర్‌డీఏ, అరకు కాఫీ, రోబోటిక్ కెఫే స్టాల్స్ వద్ద రద్దీ ఎక్కువగా కనిపించింది. అరకు కాఫీ స్టాల్ వద్ద కాఫీతోపాటు అనేక రకాల డ్రై కాఫీ గింజలను స్టాల్‌లో ఉంచడంతో వాటి గురించి విదేశీ ప్రతినిధులు ఆరా తీయడం కనిపించింది. సదస్సుకు హాజరైనవారంతా దాదాపుగా ఎగ్జిబిషన్‌ను సందర్శించడంతో స్టాళ్లు సందడిగా మారాయి.
ఉప రాష్ట్రపతికి సాదర స్వాగతం, ఆత్మీయ వీడ్కోలు
గోపాలపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): నగరంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనడానికి విచ్చేసిన ఉప రాష్ట్రపతి సీ.పి.రాధాకృష్ణన్‌కు శుక్రవారం ఉదయం కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు, తదితరులు సాదర స్వాగతం పలికారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న అనంతరం శుక్రవారం రాత్రి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తిరుగు ప్రయాణమయ్యారు. ఐఎన్‌ఎస్ డేగ ఎయిర్‌పోర్టులో జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్, సీపీ శంఖబ్రతబాగ్చి ఇతర అధికారులు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. అనంతరం ఉప రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు.