ఎగుమతుల హబ్‌గా ఏపీ
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:20 AM
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు అన్నారు.
ఎంఎస్‌ఎంఈ చైర్మన్ శివశంకరరావు
విశాఖపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు అన్నారు. హోటల్ మేరియట్‌లో ఆదివారం జరిగిన ఏపీ ఎంఎస్‌ఎం ఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ రంగానికి సంబంధించి ఎగుమతుల హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచనకు అనుగుణంగా కార్పొరేషన్ ఇప్పటివరకు మూడు సదస్సులు నిర్వహించిందన్నారు.
విశాఖలో నిర్వహించే ఎగుమతుల అభివృద్ధి సదస్సు నాలుగోదని, రాష్ట్రంలోని ఉత్పత్తులకు సంబంధించి విదేశీ కొనుగోలుదారులు, స్థానిక ఉత్పత్తిదారులతో అనుసంధానం చేయడమే సంస్థ ఉద్దేశమన్నారు. ఆయా దేశాల్లో మార్కెట్ డిమాండ్‌కు తగిన విధంగా ఉత్పత్తులు తయారుచేసేలా అక్కడి వ్యాపారుల సలహాలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, ఆహార, సముద్ర ఉత్పత్తులు, ఐటీ సర్వీసులు, జౌళి, ఫార్మా తదితర రంగాల ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశాలను గుర్తించిన 16 దేశాలకు చెందిన 34 మంది సదస్సుకు హాజరయ్యారన్నారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటుకు విశాఖ అనువైనదని ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ నెలకొల్పుతున్నారన్నారు. ఎస్‌ఎంఈ ఇండియా అధ్యక్షుడు వినోద్‌కుమార్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం నుంచి 2023లో 3.9 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరగ్గా గత ఏడాది 26 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు. ప్రధానంగా సముద్ర ఉత్పత్తులు ప్రపంచంలో 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో బియ్యం, వ్యవసాయోత్పత్తులు, పొగాకు ఎగుమతులకు ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ఘనా దేశానికి చెందిన అబ్బాస్ మాట్లాడుతూ వ్యవసాయోత్పత్తులు ఎక్కువగా లభించే ఏపీ నుంచి భారీస్థాయిలో ఎగుమతి చేసుకోవచ్చునని ప్యాకింగ్, నాణ్యతలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్రీలంకకు చెందిన సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ కొబ్బరి పీచ ుపరిశ్రమకు అవసరమైన ముడిసరుకు ఏపీలో ఉందన్నారు. ముంబైకు చెందిన రాజ్‌బాషా 2030 కల్లా ప్రపంచంలో టెలికం రంగంలో ఇండియా నంబరువన్‌గా మారుతుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన సునీతా కృష్ణ సుగంధ ద్రవ్యాల ఎగుమతులకు విశాఖలో ఫెలిసిటేషన్ సెంటర్ ఏర్పాటుచేయాలని కోరారు.