నాలెడ్జ్ హబ్‌గా ఏపీ
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:55 AM
తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత విద్యార్థులపై వుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

ఆ దిశగా సీఎం చంద్రబాబు, మంతి లోకేశ్ తీవ్ర కృషి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర
తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు నేర్చాలని విద్యార్థులకు పిలుపు
టెన్త్, ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన ‘షైనింగ్ స్టార్స్’కు పురస్కారాలు ప్రదానం
అనకాపల్లి టౌన్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి):
తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత విద్యార్థులపై వుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం రింగురోడ్డులోని ఒక కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో నగదు పురస్కారాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత యువతదేనని, ప్రపంచంలో ఏ దేశంలో చూసినా తెలుగువారు ఐటీ రంగంలో రాణిస్తున్నారని చెప్పారు. 2014-19 మధ్య నాటి సీఎం చంద్రబాబునాయుడు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం వల్ల దేశంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండేదని, గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేయడం వల్ల 19వ స్థానానికి పడిపోయిందన్నారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో నారా లోకేశ్ విద్యా శాఖకు కోరుకొని తీసుకున్నారని చెప్పారు. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామన్నారు.
అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ, బాగా చదువుకుంటున్న విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నగదు అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.20 వేల నగదుతోపాటు మెడల్, జ్ఞాపికను అందించనున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, షైనింగ్ స్టార్స్ అవార్డులు అందజేయడం వల్ల మిగిలిన విద్యార్థుల్లో కూడా బాగా చదువుకోలనే ఆసక్తి, పట్టుదల పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మాట్లాడుతూ, షైనింగ్ స్టార్స్ అవార్డును స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 184 మందికి, ఇంటర్మీడియట్ విద్యార్థులు 32 మందికి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో జి.అప్పారావునాయుడు, ఇంటర్ విద్యా శాఖ అధికారి బి.సుజాత, సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ జయప్రకాశ్, ఆర్డీవో షేక్ ఆయీషా, వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, పీవీజీ కుమార్, మళ్ల సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, కార్పొరేటర్ మాదంశెట్టి చినతల్లి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.