Share News

ఏవోబీ జల్లెడ

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:05 PM

ఆంధ్ర- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు సీపీఐ మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరగనున్నాయి. దీని విజయవంతానికి సీపీఐ మావోయిస్టులు, భగ్నం చేసేందుకు పోలీసులు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు.

ఏవోబీ జల్లెడ
వంగసార బ్రిడ్జి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న బాంబ్‌ స్క్వాడ్‌ పోలీసులు(ఫైల్‌)

నేటి నుంచి సీపీఐ మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

విజయవంతానికి మావోలు.. విఫలయత్నానికి పోలీసులు సన్నాహాలు

సరిహద్దు అడవుల్లో ప్రత్యేక బలగాల గాలింపు

చింతపల్లి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు సీపీఐ మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరగనున్నాయి. దీని విజయవంతానికి సీపీఐ మావోయిస్టులు, భగ్నం చేసేందుకు పోలీసులు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టులు సరిహద్దు గ్రామాల్లో సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

తాజా పరిణామాల నేపథ్యంలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సీపీఐ మావోయిస్టు పార్టీ 1972 జూలై 28 నుంచి అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తోంది. మావోయిస్టు నాయకుల్లో ఒకరైన కామ్రేడ్‌ చారు మజుందార్‌ పోలీసు కస్టడీలో ఉండగానే తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏటా జూలై 28 నుంచి అమరవీరుల వారోత్సవాలను జరుపుకుంటూ, ఏడాది కాలంలో ఉద్యమ పోరాటంలో మరణించిన మావోయిస్టులకు ఘన నివాళి అర్పిస్తుంటారు. ఇదే తరహాలో ఈ ఏడాది కూడా వారోత్సవాలు నిర్వహించాలని, ఉద్యమ పోరాటంలో మరణించిన కుటుంబాలకు ఓదార్పునిస్తూ, కొత్త నియామకాలకు మావోయిస్టు అగ్ర నేతలు ప్రాధాన్యమిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

విజయవంతానికి వ్యూహాత్మక అడుగులు

తూర్పు కనుముల్లో సీపీఐ మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాల విజయవంతానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానంగా ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నేతలు అమరులయ్యారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, వందల సంఖ్యలో దళ సభ్యులు అమరులయ్యారు. ఉద్యమంలో వీరోచితంగా పోరాడి మరణించిన అమరులకు నివాళి అర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. శాశ్వత, తాత్కాలిక స్థూపాల నిర్మాణంతో పాటు పాత స్థూపాలను రంగులతో అలంకరించి అమరులకు నివాళి అర్పించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అలాగే సరిహద్దు గిరిజన గ్రామాల్లో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు గ్రామ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. మావోయిస్టు అమరుల కుటుంబాలను ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని పరామర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

సరిహద్దు అడవుల్లో గాలింపు

మావోయిస్టు పార్టీ చర్యలు, వారోత్సవాలను భగ్నం చేసేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ సరిహద్దు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే సుమారు ఐదు కంపెనీల ప్రత్యేక పోలీసు బలగాలు పది రోజులుగా ఏవోబీ సరిహద్దు అడవులను గాలిస్తున్నాయి. ఏపీఎస్పీ, గ్రేహౌండ్స్‌ దళాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆయుధాలను ఉపయోగిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రధానంగా కూంబింగ్‌ పార్టీలు నైట్‌ విజన్లు, డ్రోన్‌ కెమెరాలను ఉపయోగిస్తున్నాయి. కూంబింగ్‌ పార్టీ చుట్టూ మూడు కిలోమీటర్లు మేరకు మావోయిస్టు పార్టీ కదలికలను గగనతలం నుంచి పసిగట్టేందుకు డ్రోన్‌ కెమెరాలను ఆపరేట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఓ వైపు అడవుల్లో గాలిస్తూనే మరోవైపు బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలతో ప్రధాన కేంద్రాలు, రహదారులను తనిఖీ చేస్తున్నారు. మావోయిస్టు యాక్షన్‌ టీం సభ్యులు సంచరించేందుకు అవకాశమున్న కేంద్రాల్లో 24 గంటలు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు హిట్‌లిస్టులో ఉన్న వ్యక్తులు వారోత్సవాలు ముగిసేంత వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వీఐపీలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సరిహద్దు గిరిజన గ్రామాలు యుద్ధభూమిని తలపిస్తున్నాయి. కాగా వారోత్సవాలు ముగిసేంత వరకు ఏక్షణంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలను చూడాల్సి వస్తుందోనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు.

Updated Date - Jul 27 , 2025 | 11:05 PM