Share News

కాఫీ యూనిట్‌కు కదలిక ఏదీ?

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:31 PM

మండలంలో డౌనూరు కేంద్రంగా గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన సమీకృత కాఫీ ప్రొసెసింగ్‌ యూనిట్‌ గత రెండేళ్లుగా పిల్లర్లకే పరిమితమైంది.

 కాఫీ యూనిట్‌కు కదలిక ఏదీ?
సమీకృత కాఫీ ప్రొసెసింగ్‌ యూనిట్‌కు కేటాయించిన స్థలంలో పిల్లర్ల స్థాయి దాటని నిర్మాణాలు

రెండేళ్ల క్రితం అట్టహాసంగా సమీకృత కాఫీ ప్రొసెసింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపన

నిధులు విడుదల చేయని గత వైసీపీ ప్రభుత్వం

పునాదుల స్థాయిలోనే నిలిచిపోయిన పనులు

కొయ్యూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మండలంలో డౌనూరు కేంద్రంగా గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన సమీకృత కాఫీ ప్రొసెసింగ్‌ యూనిట్‌ గత రెండేళ్లుగా పిల్లర్లకే పరిమితమైంది. 2023 అక్టోబరులో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని అప్పట్లో గొప్పలు చెప్పారు. అయితే నిధులు విడుదల చేయకపోవడంతో పునాదుల స్థాయిలోనే నిర్మాణం నిలిచిపోయింది.

మండలంలో డౌనూరు కేంద్రంగా కాఫీ క్యూరింగ్‌, రోస్టింగ్‌, గ్రైండింగ్‌, అలాగే ప్యాకింగ్‌ చేసేందుకు గాను రూ.4 కోట్లతో సమీకృత కాఫీ ప్రొసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణానికి 2023 అక్టోబరు 20న అప్పటి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి శంకుస్థాపన చేశారు. గిరిజన రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఈ యూనిట్‌ ఎంతో ఉపయోగపడుతుందని, ఆరు నెలల్లో దీన్ని అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే నిధులు విడుదల చేయకపోవడంతో పిల్లర్ల స్థాయిలోనే నిర్మాణం నిలిచిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కదలిక లేదు. ఈ యూనిట్‌ అందుబాటులోకి వచ్చి ఉంటే కాఫీ రైతులు దళారుల బారిన పడకుండా నేరుగా జీసీసీకి అమ్మకాలు జరిపి లాభాలు ఆర్జించేవారు. అంతేకాకుండా స్థానిక మహిళలకు ఉపాధి కూడా దొరికేది. అయితే గత పాలకుల నిర్లక్ష్యం వలన ఇది కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వమైనా స్పందించి ఈ యూనిట్‌ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఈ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 11:31 PM