Share News

మెట్రో రైలు కారిడార్‌లో మరో ముందడుగు

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:49 AM

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులో మరో అడుగు ముందుకుపడింది.

మెట్రో రైలు కారిడార్‌లో మరో ముందడుగు

రూ.6 వేల కోట్ల రుణ సాయం చేసేందుకు ఏఐఐబీ ఆసక్తి

ఏఎంఆర్‌సీ ఎండీతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన

విశాఖపట్నం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులో మరో అడుగు ముందుకుపడింది. ఈ ప్రాజెక్టుకు సాయం చేయడానికి ముందుకువచ్చిన ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) ప్రతినిధులు క్షేత్ర పర్యటనకు వచ్చారు. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి వారిని సోమవారం విశాఖకు తీసుకువచ్చి.. కొమ్మాది నుంచి స్టీల్‌ప్లాంటు వరకు స్టేషన్లు నిర్మించే స్థలాలను చూపించారు. ఎక్కడెక్కడ ఏమేమి నిర్మించాలనుకుంటున్నదీ వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన గురుద్వారా కూడలిలో విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు.

తొలి దశలో కొమ్మాది నుంచి స్టీల్‌ప్లాంటు వరకు 34.4 కి.మీ., గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకు 5.07 కి.మీ., తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కి.మీ. పొడవునా మూటు కారిడార్లను నిర్మిస్తామన్నారు. కొమ్మాది-స్టీల్‌ప్లాంట్‌ మధ్య 29 స్టేషన్లు, గురుద్వారా-పాత పోస్టాఫీసుల మధ్య ఆరు స్టేషన్లు, తాటిచెట్లపాలెం-చినవాల్తేరుల మధ్య ఏడు స్టేషన్లు కలిపి మొత్తం 42 స్టేషన్టను నిర్మిస్తామని పేర్కొన్నారు. విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులకు తొలి దశలో రూ.12 వేల కోట్లు అవసరం కాగా ఏఐఐబీ రూ.6 వేల కోట్లను రుణంగా ఇవ్వడానికి ముందుకు వచ్చిందన్నారు. ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాలు, ట్రాఫిక్‌, తదితర అంశాలను తెలుసుకునేందుకు విశాఖపట్నం వస్తే వారికి అన్నీ వివరించామన్నారు.


జీవీఎంసీ ఇన్‌చార్జి సీఈగా పల్లంరాజు

ఏసీబీ కేసు పెండింగ్‌లో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు

చక్రం తిప్పిన నగరానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి

విశాఖపట్నం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఇన్‌చార్జి చీఫ్‌ ఇంజనీర్‌గా జీవీ పల్లంరాజుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.సురేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీవీఎంసీ చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేసిన పి.శివప్రసాదరాజు గతనెల 31న పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. చీఫ్‌ ఇంజనీర్‌గా జీవీఎంసీకి వచ్చేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కె.వేణుగోపాల్‌, వీఎంఆర్డీఏ చీఫ్‌ ఇంజనీర్‌ వినయ్‌కుమార్‌ ప్రయత్నించారు. వినయ్‌కుమార్‌ ప్రస్తుతం వ్యక్తిగత సెలవుపై అమెరికా వెళ్లగా, గతంలో జీవీఎంసీలో ఎస్‌ఈగా పనిచేసిన కె.వేణుగోపాల్‌కు అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. కానీ జీవీఎంసీలో ప్రస్తుతం ఎస్‌ఈగా పనిచేస్తున్న పల్లంరాజుకు ఇన్‌చార్జి సీఈగా పూర్తి అదనపు బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పల్లంరాజుపై ఏసీబీ కేసు పెండింగ్‌లో ఉండడంతోపాటు ఆయన ఎస్‌ఈ క్యాడర్‌లో ఉన్నందున ఆయనకు అవకాశం వస్తుందని ఎవరూ ఊహించలేదు. పైగా ఎస్‌ఈ కేడర్‌ కలిగిన అధికారికి ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించాలనుకున్నాసరే మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేయనున్న నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ కేవీఎన్‌ రవికి చాన్స్‌ దక్కుతుందని పలువురురు భావించారు. శివప్రసాదరాజు పదవీ విరమణ చేశాక కూడా రవికే ఇన్‌చార్జిగా తాత్కాలికంగా బాధ్యతలను అప్పగించారు. ఒకవేళ పూర్తిస్థాయి సీఈని నియమించకపోతే రవికే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్న తరుణంలో జీవీ పల్లంరాజుకు బాధ్యతలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారిందది. నగరానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి పల్లంరాజు వెనుక ఉండి రాష్ట్ర పురపాలక శాఖలో చక్రం తిప్పారని, అందువల్లే పరిశీలనలో లేని పల్లంరాజుకు అవకాశం దక్కిందని జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రచారం జరుగుతోంది.


నగరం గరం..

ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు

ఎయిర్‌పోర్టులో 39.2 డిగ్రీలు..

విశాఖపట్నం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి):

ఎండ తీవ్రత, ఉక్కపోతతో నగరం ఉడికిపోయింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మాడుపగిలేలా ఎండ కాసింది. ‘ఉక్క’రిబిక్కిరి చేసేలా ఉక్కపోత కొనసాగింది. ఉదయం పూట బలహీనమైన మేఘాలు ఉన్నప్పటికీ ఎండ ప్రభావం నెలకొనడంతో నగరం వేడెక్కింది. మధ్యాహ్న సమయానికి నగరం నిప్పులకుంపటిలా మారింది. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారంతా ఠారెత్తిపోయారు.

భవన నిర్మాణ కార్మికులు, ఇతరత్రా పనులు చేసేవారంతా ఎండకు తాళలేకపోయారు. ఎక్కువమంది ప్రజలు ఏసీ రెస్టారెంట్లను ఆశ్రయించారు. ద్విచక్రవాహనదారులైతే ఎండకు సొమ్మసిల్లిపోయారు. సాయంత్రం తరువాత నుంచి కొద్దిసేపు గాలులు వీచినా వేడి వాతావరణం కొనసాగడంతో ప్రజలు నానాపాట్లు పడ్డారు. ఇళ్లల్లో ఉన్నవారందరూ ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వేసుకోవాల్సి వచ్చింది. బీచ్‌ రోడ్డులో కూడా వేడిగాలులు, ఉక్కపోత కొనసాగడంతో తీరంలో సేదదీరేవారు సైతం ఇబ్బందులు పడ్డారు. ఎయిర్‌పోర్టులో సోమవారం 39.2 డిగ్రీల ఉష్ణాగ్రత నమోదైంది. ఈ నెల రెండో తేదీన ఎయిర్‌పోర్టులో 39.4 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఈ నెల రెండో తేదీ, సోమవారమే అత్యధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా గత వారం రోజులగా 36 నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణాగ్రతలు నమోదు కావడం, పగటి పూట ఎండ తీవ్రత చాలా అధికంగా ఉండడం, వర్షాలు లేకపోవడంతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. మంగళవారం కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.


ఏయూ ప్రొఫెసర్లపై సస్పెన్షన్లు ఎత్తివేత

బీటెక్‌లో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కోర్సు ప్రారంభం

సీఏఎస్‌ ప్రమోషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌

పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

విశాఖపట్నం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలక మండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం సాయంత్రం సుమారు రెండు గంటలపాటు జరిగింది. సమావేశానికి మొత్తంగా 15 మంది సభ్యులకు గాను ఇద్దరు మినహా మిగిలిన వారంతా ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానంలో హాజరయ్యారు. సమావేశంలో కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ (సీఏఎస్‌) ప్రమోషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పటికే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించినందున తదుపరి ప్రక్రియను పూర్తిచేసి పదోన్నతులు కల్పించనున్నారు. మొత్తంగా 21 మందికి పదోన్నతలు ఇవ్వనున్నారు. అలాగే కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన కూడ నాగేశ్వరరావు సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. సోషల్‌ వర్క్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ స్వామిదాస్‌పై సస్పెన్షన్‌ విధించి ఐదేళ్లు పూర్తయినందున ఆ సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. 2025-26 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ఆమోదించారు. బీటెక్‌లో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కోర్సును ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వీటితోపాటు మరికొన్ని అంశాలపైనా చర్చించినట్టు చెబుతున్నారు.


విశాఖ పోర్టులో డ్రైవర్‌ హత్య

బొగ్గు లోడు అపహరించారనే అభియోగంతో నిర్బంధం

ఇనుప రాడ్డుతో తలపై మోదిన రౌడీషీటర్‌

కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి

సూపర్‌వైజర్‌నూ కొట్టడంతో తీవ్ర గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స

విశాఖపట్నం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి):

విశాఖ పోర్టులో బొగ్గు హ్యాండ్లింగ్‌ చేసే ఓ కంపెనీలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి సోమవారం హత్యకు గురయ్యాడు. యార్డుకు వెళ్లాల్సిన సరకును బయటకు తీసుకువెళ్లిపోయాడయే అనుమానంతో ఆయనతో పాటు యార్డు సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని కంపెనీ కార్యాలయంలో నిర్బంధించి రౌడీషీటర్‌తో చితకబాదించారు. దెబ్బలకు తాళలేక డ్రైవర్‌ మృతి చెందగా, సూపర్‌వైజర్‌ గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. త్రీస్టార్‌ పేరుతో ఒక కంపెనీ పోర్టులో బొగ్గు హ్యాండ్లింగ్‌ చేస్తోంది. పోర్టు నుంచి యార్డుకు లారీలతో సరకును తరలిస్తుంటుంది. పోర్టు నుంచి యార్డుకు చేరాల్సిన సరకులో రెండు లోడ్‌లు బయటకు వెళ్లిపోయినట్టు కంపెనీ ప్రతినిధులు గుర్తించారు. ఆ లోడ్‌లను లారీడ్రైవర్‌ సన్యాసిరావు, సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న అహ్మద్‌ కలిసి బయటకు తరలించేశారనే అనుమానంతో వారిద్దరిని సోమవారం పోర్టులోని కంపెనీ కార్యాలయంలో నిర్బంధించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారికి చిత్రహింసలు పెట్టారు. సెక్యూరిటీ ఇన్‌చార్జిగా కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ కలిగివున్న లాగన్‌ను నియమించిన యాజమాన్యం.. అతనితో వారిద్దరినీ ఇనుప రాడ్డులతో కొట్టించింది. ఆ దెబ్బలకు తాళలేక ఇద్దరూ స్పృహ తప్పి పడిపోవడంతో కంపెనీ ప్రతినిధులు సోమవారం రాత్రి కేజీహెచ్‌కు తరలించారు. అయితే అప్పటికే సన్యాసిరావు మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు. అహ్మద్‌ గాయాలతో చికిత్సపొందుతున్నారు. దీనిపై సమాచారం అందిన వెంటనే హార్బర్‌ సీఐ సింహాద్రినాయుడు తమ సిబ్బందితో కేజీహెచ్‌కు వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు.

Updated Date - Jun 10 , 2025 | 01:49 AM