Share News

మరో రెవెన్యూ డివిజన్‌

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:52 AM

జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాకు మరో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంగళవారం సీఎం చంద్రబాబునాయుడు ఆమోద ముద్ర వేశారు.

మరో రెవెన్యూ డివిజన్‌

- నక్కపల్లి కేంద్రంగా ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం

- ఇప్పటికే ఉన్న అనకాపల్లి, నర్సీపట్నంతో పాటు మరో డివిజన్‌

- ప్రస్తుతం నర్సీపట్నం డివిజన్‌లో ఉన్న మాడుగుల, చీడికాడ మండలాలు అనకాపల్లి పరిధిలోకి..

- పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మరింత మెరుగైన సేవల కోసం ఏర్పాటు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాకు మరో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంగళవారం సీఎం చంద్రబాబునాయుడు ఆమోద ముద్ర వేశారు. దీంతో జిల్లాలో ఇప్పటికే ఉన్న అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లతో పాటు నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌గా మారనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ కావడంతో కొత్త డివిజన్‌ ఏర్పాటుపై అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో కొత్తగా మరొక రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని ఆలోచన చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో పాయకరావుపేట, ఎలమంచిలి నియోజకవర్గాల పరిధిలోని మండలాలతో నక్కపల్లి కేంద్రంగా కొత్తగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు మంత్రి వర్గం ప్రతిపాదనలకు కదలిక వచ్చింది. ఇప్పటికే జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లు ఉండగా తీర ప్రాంత ప్రజల సౌకర్యార్థం, నక్కపల్లి కేంద్రంగా పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నక్కపల్లి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయనుంది. కొత్తగా ఏర్పాటు కానున్న నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌లో పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్‌.రాయవరం, కోటవురట్ల మండలాలు, ఎలమంచిలి నియోజకవర్గం పరిధిలోని ఎలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాలు కలవనున్నాయి. ప్రస్తుతం నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం, కోటవురట్ల మండలాలు, అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న ఎలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాలు నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌లో కలవనున్నాయి. కాగా నర్సీపట్నం డివిజన్‌లో ఉన్న మాడుగుల, చీడికాడ మండలాలు అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి రానున్నాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీర ప్రాంత మండలాలైన నక్కపల్లి, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లు సముద్ర తీర ప్రాంతానికి దూరంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వ సేవల కోసం ప్రజలు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ప్రధానంగా అధిక వర్షాలు, తుఫానుల సమయంలో తక్షణ సహాయక చర్యలు కాస్త ఆలస్యమవుతున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం నక్కపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, హోం మంత్రి వంగలపూడి అనితతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం నక్కపల్లి మండలంలో డీఎల్‌ పురం, చందనాడ, వేంపాడు, బుచ్చిరాజుపేట, రాజయ్యపేట పరిసరాల్లో నక్కపల్లి సెజ్‌ ఏర్పాటు చేయడం ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతోంది. మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌, బల్క్‌డ్రగ్‌ పార్కు వంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాంతంలో 16వ నంబరు జాతీయ రహదారి, సముద్ర తీర ప్రాంతం కనెక్టివిటీ ఉన్నందున భవిష్యత్తులో జరగబోయే పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నక్కపల్లిలో ప్రత్యేకంగా ఒక రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పడితే ప్రభుత్వ సేవలు మరింత చేరువ అవుతాయని, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వేగం గా అందుతాయని ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 26 , 2025 | 12:52 AM