Share News

మరో పార్కుకు ఎసరు

ABN , Publish Date - Jul 15 , 2025 | 01:10 AM

జీవీఎంసీ 28వ వార్డు పరిధిలో గల ఫేకర్‌ లేఅవుట్‌లోని పార్కును కొట్టేసేందుకు ప్రైవేటు వ్యక్తులు పావులు కదుపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరో పార్కుకు ఎసరు

  • ఫేకర్‌ లేఅవుట్‌లోని పార్కులో షెడ్డు నిర్మాణం, విద్యుత్‌ కనెక్షన్‌

  • టీడీఆర్‌ కోసం కొందరి యత్నం

  • విలువ రూ.90 కోట్లు

  • పట్టించుకోని జీవీఎంసీ అధికారులు

  • ఆ పార్కు అభివృద్ధికి రెండేళ్ల క్రితం రూ.1.6 కోట్లు కేటాయించిన జీవీఎంసీ

  • పనులు చేయకుండానే బిల్లుల చెల్లింపు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ 28వ వార్డు పరిధిలో గల ఫేకర్‌ లేఅవుట్‌లోని పార్కును కొట్టేసేందుకు ప్రైవేటు వ్యక్తులు పావులు కదుపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే షెడ్డు నిర్మించి, విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఫేకర్‌ లేఅవుట్‌ ఉంది. దశాబ్దాల కిందట వాల్తేరు వార్డు టౌన్‌ సర్వే నంబర్‌ 76లో (ఎల్‌పీ నంబర్‌ 8/97) లేఅవుట్‌ వేశారు. లేఅవుట్‌లో సుమారు 4,500 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. ఆ పార్కు జీవీఎంసీ ఆధీనంలోనే ఉంది. అభివృద్ధి చేయాలంటూ ఫేకర్‌ లేఅవుట్‌ రెసిడెన్సియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో రెండేళ్ల కిందట జీవీఎంసీ రూ.1.6 కోట్లు కేటాయించింది. ఆ పనులను టెండర్ల ద్వారా కేటాయించారు. ఇదిలావుండగా పార్కు స్థలం తమదంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలను సృష్టించి కొట్టేయడానికి యత్నిస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా పార్కు లోపల షెడ్‌ నిర్మించడమే కాకుండా విద్యుత్‌ కనెక్షన్‌ కూడా ఏర్పాటుచేశారని, ఇదంతా ఎవరు చేశారని జీవీఎంసీ అధికారులను అడిగితే తమకు సంబంధం లేదని చెప్పడం తమకు ఆందోళన కలిగిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. జీవీఎంసీకి సంబంధం లేకుండా సొంతంగా షెడ్‌ నిర్మించిన వ్యక్తులే ఆ స్థలం తమదని పేర్కొంటూ టీడీఆర్‌ కోసం జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నట్టు ఆరోపిస్తున్నారు. దీనిపై టౌన్‌ప్లానింగ్‌ అధికారులను కలిసి ఆరా తీస్తే ఎవరైనా దరఖాస్తు చేసి ఉండవచ్చునని ఇంకా తమ దృష్టికి అయితే రాలేదని దాటవేత ధోరణిలో సమాధానం చెబుతున్నారన్నారు. అక్కడ భూమి ధర గజం రూ.రెండు లక్షలు వరకు ఉంది. అంటే 4,500 గజాలు రూ.90 కోట్లు విలువ ఉంటుంది. అంతటి విలువైన ఆస్తి పరిరక్షణ పట్ల జీవీఎంసీ ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 25వ వార్డులోని రాజేంద్రనగర్‌ పార్కు, ఈస్ట్‌పాయింట్‌ కాలనీ పార్కు, ఐదో వార్డులోని స్వతంత్రనగర్‌ పార్కు, బొట్టవానిపాలెం పార్కులు అన్యాక్రాంతం అయిపోయాయంటూ జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. నగరం నడిబొడ్డున ఉన్న రూ.90 కోట్లు విలువైన పార్కు స్థలం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పార్కులో అభివృద్ధి పనులపై ఆనుమానాలు

ఫేకర్‌ లేఅవుట్‌లోని పార్కులో అభివృద్ధి పనులకు జీవీఎంసీ రూ.1.6 కోట్లు వెచ్చించింది. వాకింగ్‌ ట్రాక్‌, కార్‌పార్కింగ్‌, వాచ్‌మెన్‌ కోసం గది నిర్మించేందుకు రూ.20 లక్షలతో టెండర్‌ పిలిచారు. అలాగే పార్కు ప్రవేశ ద్వారం, గేటు ఏర్పాటు, వాటర్‌ఫౌంటెయిన్‌, విద్యుత్‌ సదుపాయం కోసం రూ.20 లక్షలు, పార్కుస్థలం వాలుగా ఉండడంతో రక్షణ గోడల నిర్మాణానికి రూ.20 లక్షలు, మెట్ల నిర్మాణానికి రూ.20 లక్షలు, సాఫ్ట్‌ల్యాండ్‌ స్కేపింగ్‌కి రూ.20 లక్షలు, గ్యాలరీ ఇతర పనుల కోసం రూ.20 లక్షలు, స్టేజ్‌తోపాటు చుట్టూ నడకదారి కోసం రూ.20 లక్షలు, పిల్లల ఆట స్థలం అభివృద్ధి, పరికరాల ఏర్పాటుకోసం రూ.20 లక్షలు కేటాయిస్తూ టెండర్లు పిలిచారు. ఆయా పనుల్లో దాదాపు అన్ని పనులను పూర్తిచేసినట్టు అధికారులు రికార్డుల్లో చూపించి సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లులు కూడా చెల్లించేశారు. అయితే పార్కులో చూస్తే ఒక్క ప్రహరీ గోడ తప్పితే వాటర్‌ ఫౌంటెయిన్‌గానీ, స్టేజీ గానీ, వాకింగ్‌ ట్రాక్‌ కానీ, గ్యాలరీ గానీ ఏదీ కనిపించదు. పార్కులో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోయి ఉన్నాయి. అధికారులు రూ.1.6 కోట్లతో పనులు చేపడితే అవన్నీ ఏమైపోయాయో ఇంజనీరింగ్‌ అధికారులే చెప్పాలి. దీనిపై చీఫ్‌ ఇంజనీర్‌ పల్లంరాజును వివరణ కోరగా...తనకు ఆ పనుల గురించి తెలియదని, ఫైల్‌ తెప్పించుకుని పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని సమాధానం ఇచ్చారు.

Updated Date - Jul 15 , 2025 | 01:10 AM