అంగన్‌వాడీలకు మరో తీపికబురు
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:36 AM
అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నికల ముందు అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తూ కార్యకర్తలకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నంబర్ 116ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
కార్యకర్తలు, ఆయాలకు గ్రాట్యుటీ అమలు
రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం
పదవీ విరమణ తరువాత కార్యకర్తకు రూ.లక్ష, ఆయాకు రూ.40 వేలు
అంగన్‌వాడీ వర్కర్ల ఆనందం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నికల ముందు అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తూ కార్యకర్తలకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నంబర్ 116ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం జిల్లాలో 183 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ప్రధాన కేంద్రాలుగా మారాయి. ఆయా కేంద్రాల్లో పనిచేస్తున్న పదో తరగతి విద్యార్హత కలిగిన కార్యకర్తలకు పదోన్నతలు కల్పించేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. తాజాగా అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు గ్రాట్యుటీ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ అమలుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో 1,908 అంగన్‌వాడీ కేంద్రాలు వున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రయోజనం చేకూరనున్నది. 62 సంవత్సరాలు నిండిన తరువాత పదవీవిరమణ సమయంలో అంగన్‌వాడీ కార్యకర్తకు గ్రాట్యుటీగా రూ.లక్ష, ఆయాలకు రూ.40 వేలు ప్రభుత్వం అందించనుంది. ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్తలు నెలకు రూ.11,500 వేతనం పొందుతున్నారు. ఆయాలకు రూ.7 వేలు అందుతుంది.