Share News

జిల్లాలో మరో బల్క్‌డ్రగ్‌ పార్క్‌

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:37 AM

జిల్లాలో మరో బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటు కానున్నది. ఇప్పటికే నక్కపల్లి మండలంలో బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం భూములు, నిధులు కేటాయించగా, తాజాగా రాంబిల్లి మండలంలో ప్రైవేటు రంగంలో బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటు కానున్నది. ప్రముఖ ఫార్మా కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ ముందుకు వచ్చింది. సుమారు రూ.5 వేల కోట్లతో ఏర్పాటయ్యే బల్క్‌ డ్రగ్‌ పార్కులో దాదాపు ఏడున్నర వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

జిల్లాలో మరో బల్క్‌డ్రగ్‌ పార్క్‌
రాంబిల్లి మండలంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కోసం లారస్‌ ల్యాబ్స్‌కు కేటాయించేందుకు పరిశీలనలో ఉన్న భూమి

రాంబిల్లి మండలంలో ఏర్పాటుకు ముందుకు వచ్చిన లారస్‌ ల్యాబ్స్‌

500 ఎకరాల్లో రూ.5 వేల కోట్లతో నిర్మాణం

7,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

సీఎం చంద్రబాబును కలిసిన కంపెనీ సీఈవో, వైస్‌ ప్రెసిడెంట్‌

భూమి కేటాయించాలని వినతి, డీపీఆర్‌ అందజేత

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో మరో బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటు కానున్నది. ఇప్పటికే నక్కపల్లి మండలంలో బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం భూములు, నిధులు కేటాయించగా, తాజాగా రాంబిల్లి మండలంలో ప్రైవేటు రంగంలో బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటు కానున్నది. ప్రముఖ ఫార్మా కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ ముందుకు వచ్చింది. సుమారు రూ.5 వేల కోట్లతో ఏర్పాటయ్యే బల్క్‌ డ్రగ్‌ పార్కులో దాదాపు ఏడున్నర వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమల ఏర్పాటులో అనకాపల్లి జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వానికి భిన్నంగా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తున్నది. వైసీపీ హయాంలో ఔషధ తయారీ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సాహించకపోగా అప్పటికే ఉన్న ఫార్మా కంపెనీలపై రకరకాల ఆంక్షలు విధించి వేధింపులకు గురి చేసింది. గత ఏడాది ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఔషధ తయారీ రంగం అభివృద్ధి, విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. పరిశ్రమల ఏర్పాటుకు అడిగిందే తడవుగా ప్రభుత్వం తరపున తోడ్పాటు అందిస్తుండడంతో అనేక కంపెనీలు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అనకాపల్లి జిల్లాలో రెండు (నక్కపల్లి, రాంబిల్లి) బల్క్‌ డ్రగ్‌ పార్కుల ఏర్పాటుకు ప్రముఖ ఔషధ తయారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇప్పటికే అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి మండలాల్లో పదుల సంఖ్యలో ఫార్మా కంపెనీలు వున్నాయి. అయినప్పటికీ మరిన్ని కొత్త ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.

నక్కపల్లిలో 2,100 ఎకరాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌

నక్కపల్లి మండలంలోని ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే 2,100 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ నుంచిఇ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇక్కడ మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం సుమారు రూ.1,500 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయా పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన తరువాత ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం భూములు కేటాయిస్తుంది. ఇక్కడ దేశవిదేశాలకు చెందిన పలు కంపెనీలు రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నాయి. వీటిల్లో సుమారు 50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అభిస్తాయి.

రాంబిల్లి మండలంలో ‘లారస్‌’ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌

రాంబిల్లి ఏపీఐఐసీ సెజ్‌లో 500 ఎకరాల్లో ప్రముఖ ఫార్మా కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ రూ.5 వేల కోట్లతో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు లారస్‌ ల్యాబ్స్‌ సీఈవో చావా సత్యనారాయణ, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సీఎన్‌ రావు ఇటీవల అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి రాంబిల్లి మండలంలో బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటు కోసం భూమి కేటాయించాలని కోరారు. ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన డీపీఆర్‌ను సీఎంకు అందజేశారు. చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించారు. లారస్‌ ల్యాబ్స్‌ అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే పరవాడ ఫార్మా సిటీ, అచ్యుతాపురం సెజ్‌లో ఔషధ తయారీ కంపెనీలు వున్నాయి. రాంబిల్లి మండలంలో ఏర్పాటు చేయతలపెట్టిన బల్క్‌ డ్రగ్‌ పార్కు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Updated Date - Apr 05 , 2025 | 12:37 AM