Share News

వైసీపీకి మరో దెబ్బ

ABN , Publish Date - Oct 22 , 2025 | 01:01 AM

పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఎస్‌.రాయవరం జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి వైసీపీ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం గోకులపాడు సమీపంలో భర్త అప్పారావుతో కలిసి నిర్వహించిన మీడిమా సమావేశంలో వెల్లడించారు.

వైసీపీకి మరో దెబ్బ
మీడియాతో మాట్లాడుతున్న జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి

వైసీపీకి ఎస్‌.రాయవరం జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి గుడ్‌బై

పార్టీ సభ్యత్వంతోపాటు మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా

నేడు తెలుగుదేశం పార్టీలో చేరిక?

ఎస్‌.రాయవరం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఎస్‌.రాయవరం జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి వైసీపీ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం గోకులపాడు సమీపంలో భర్త అప్పారావుతో కలిసి నిర్వహించిన మీడిమా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన రాజకీయ గురువు, వైస్‌ ఎంపీపీ బొలిశెట్టి గోవిందరావు వైసీపీని వీడి టీడీపీలో చేరినప్పటికీ తాను మాత్రం వైసీపీలోనే కొనసాగుతున్నానని, కానీ ఈ పార్టీ నాయకులు తనకు కనీస విలువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఇటీవల కాలంలో మూడు ప్రధాన సమావేశాలు నిర్వహించారని, కానీ ఒక్కదానికి కూడా తనను ఆహ్వానించలేదన్నారు. వైసీపీ నాయకుల తీరు నచ్చకపోవడంతోపాటు తనకు విలువ ఇవ్వకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. కాగా బుధవారం ఎస్‌.రాయవరంలో నిర్వహించే ఒక సమావేశంలో కాకర దేవి, ఆమె అప్పారావు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సమక్షంలో టీడీపీలో చేరనున్నట్టు తెలిసింది.

ఎస్‌.రాయవరంలో వైసీపీ ఖాళీ

ఎస్‌.రాయవరం మండలంలో వైసీపీ ఖాళీ అవుతున్నది. వైస్‌ ఎంపీపీ, సీనియర్‌ నేత బొలిశెట్టి గోవిందరావు ఇటీవల వైసీపీకి రాజీనామాచేసిన విషయం తెలిసిందే. తరువాత ఎంపీపీ వెంకటలక్ష్మి, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు వైసీపీకి రాజీనామా చేసి బొలిశెట్టితోపాటు టీడీపీలో చేరారు. ఇప్పుడు జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి కూడా వైసీపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ చాలా వరకు ఖాళీ అయ్యింది.

Updated Date - Oct 22 , 2025 | 01:01 AM