అన్నదాత వర్రీ
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:36 AM
నైరుతి బంగాళాఖాతంలో నెలకొన్న ‘దిత్వా’ తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడినప్పటికీ, రానున్న రెండు రోజులు వర్షాల కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు.
తుఫాన్ ప్రభావంతో ముసురు వాతావరణం
పలుచోట్ల మోస్తరు వర్షం, తడిసిన వరి పనలు
రెండు రోజులపాటు వర్షాలు కురిస్తాయన్న హెచ్చరికలతో రైతులు ఆందోళన
చేతికందాల్సిన పంట నీటిపాలవుతుందని బెంగ
వరి కోతలు వాయిదా వేసుకోవాలని అధికారుల సూచన
అనకాపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్):
నైరుతి బంగాళాఖాతంలో నెలకొన్న ‘దిత్వా’ తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడినప్పటికీ, రానున్న రెండు రోజులు వర్షాల కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ వారంలో పంట కోయాలకున్న వారితోపాటు గత రెండు, మూడు రోజుల్లో వరి కోతలు పూర్తయి, కుప్పలు వేయని రైతులు దిగాలు పడుతున్నారు. కాగా ఆదివారం రాత్రి, సోమవారం పగలు జిల్లాలోని పలు మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. అక్కడక్కడా మోస్తరు వర్షం కురిసింది. దీంతో కుప్పలు వేయని పొలాల్లో వరి పనలు తడిసిపోయాయి. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోతాయని వాపోతున్నారు.
వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 54,465 హెక్టార్లలో వరి సాగు చేశారు. ఇంతవరకు 4,632 హెక్టార్లలో వరి కోతలు పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల గింజ గట్టిపడడం లేదా కోత దశకు చేరాయి. ఇటువంటి తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా ఆదివారం రాత్రి నుంచే జిల్లాలో వాతావరణం మారిపోయింది. అనకాపల్లి, చోడవరం, కశింకోట, మునగపాక, బుచ్చెయ్యపేట మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ముసురు వాతావరణం నెలకొంది. సబ్బవరం, రావికమతం, దేవరాపల్లి, నక్కపల్లి, పాయకరావుపేట, కె.కోటపాడు, ఎలమంచిలి, చోడవరం, బుచ్చెయ్యపేట, మాడుగుల, చీడికాడ, గొలుగొండ మండలాల్లో ఆకాశంలో మబ్బులు కమ్ముకొని తేలికపాటి జల్లులు కురిశాయి. నర్సీపట్నం, గొలుగొండ, మాకవరపాలెం, కోటవురట్ల, నాతవరం మండలాల్లో ఆకాశం మేఘావృతమైంది. గొలుగొండ మండలంలో సుమారు 50 ఎకరాల్లో వరి పనలు తడిసిపోయాయి. వర్షం మరింత పెరిగితే పనలు నీటమునిగి, ధాన్యం మొలకెత్తి రంగు మారుతుందని రైతులు ఆవేదనతో చెబుతున్నారు. తుఫాన్ బలహీనపడినప్పటికీ రాగల 48 గంటల్లో ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో వరి రైతుల కంటిమీద కునుకు లేదు. ఈదురు గాలులు వీచి, భారీ వర్షాలు కురిస్తే పంట నేలవాలి, గింజ మొలకెత్తే ప్రమాదం వుంది.
వరి కోతలు వాయిదా వేసుకోవాలి
వ్యవసాయ శాఖ నర్సీపట్నం ఏడీ శ్రీదేవి
రావికమతం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
తుఫాన్ కారణంగా రాగల రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం వున్నందునరైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని వ్యవసాయ శాఖ నర్సీపట్నం డివిజన్ ఏడీ శ్రీదేవి సూచించారు. ఆమె సోమవారం కొండెంపూడి కేవీకే ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ ఎన్.రాజ్‌కుమార్, మరో శాస్త్రవేత్త సౌజన్యతో కలసి మండలంలోని కొమిర, చినపాచిల, మత్స్యపురం, రావికమతం గ్రామాల్లో వరి పొలాలను పరిశీలించారు. ఇప్పటికే వరి కోతలు పూర్తి చేసి, కుప్పలు వేయని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. వర్షానికి వరి పనలు తడిస్తే.. లీటరు నీటికి వంద గ్రాముల చొప్పున ఉప్పు కలిపి, వరి పనలపై పిచికారీచేయాలని, దీనివల్ల ధాన్యం మొలకెత్తకుండా, రంగు మారకుండా వుంటుందని చెప్పారు. వరి పనలు నీట మునగకుండా మెరక ప్రదేశానికి చేర్చుకోవాలని సూచించారు.