అర్హత గల ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:10 PM
జిరాయితీ, డీ పట్టా, ఆర్వోఎఫ్‌ఆర్ భూముల్లో సాగు చేస్తున్న రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వేగవంతం చేయాలి
మ్యూటేషన్, రీ సర్వే ప్రక్రియపై దృష్టి సారించాలి
అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
పాడేరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిరాయితీ, డీ పట్టా, ఆర్వోఎఫ్‌ఆర్ భూముల్లో సాగు చేస్తున్న రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ మండలాల తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులతో వారాంతపు రెవెన్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల పంపిణీలో జాప్యం చేయరాదన్నారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు. అటవీ, రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో జాప్యంపై ఆరా తీశారు. కార్డుల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న రేషన్ డిపోలన్నీ ఆన్‌లైన్ చేయాలని పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించారు. మ్రైగేషన్, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న స్మార్ట్ రేషన్ కార్డుదారుల వివరాలను పక్కాగా సేకరించి, రద్దు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. వృద్ధులకు ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు అందజేయాలని రేషన్ డీలర్లను ఆదేశించారు. గ్రామ రెవెన్యూ అధికారులు రేషన్ డిపోలను తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, ఏడీ రీ సర్వే దేవేంద్రుడు, జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ పాల్గొన్నారు.
స్థానికులకు ఉపాధి కల్పించేలా క్వారీల నిర్వహణ
పాడేరు రూరల్: స్థానికులకు ఉపాధి కల్పించేలా క్వారీలు నిర్వహించాలని, దీని వలన ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం మండలాధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఖనిజాల లభ్యతపై మండలాల వారీగా సమగ్ర సమాచారం తయారు చేయాలన్నారు. అరకు నియోజకవర్గంలో రూ.9.8 కోట్ల వ్యయంతో 5 ఎకరాల్లో 36 యూనిట్‌లతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మించనున్నామన్నారు. ఈ కాంప్లెక్స్ ఏర్పాటుతో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ కాంప్లెక్స్‌లో అరకు బ్రాండ్ పేరుతో కాఫీ, మిరియాలు, పసుపు, చిరుధాన్యాలు, ఇతర గిరిజన ఉత్పత్తులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తామని, రూ.500 కోట్లతో పరిశ్రమ పార్క్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించనున్నామన్నారు. చింతపల్లి మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ మంజూరైందని తెలిపారు. ప్రతి మండలానికి ఒక డిజిటల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ను మండల ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్‌గా నియమిస్తామన్నారు. వారి ద్వారా ప్రతి మండలంలో 3 నుంచి 5 ఇండస్ట్రియల్ యూనిట్లను ఏర్పాటు చేసే విధంగా ఔత్సాహికులను గుర్తించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి మూడు ఐటీడీఏల పరిధిలో ఎంపీడీవోలతో డిజిటల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లకు ప్రత్యేక శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్‌ధన్ వికాస్ కేంద్రాల లావాదేవీలను ఐటీడీఏ పీవోలు పర్యవేక్షించి వాటి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, రంపచోడవరం ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్ స్మరణ్‌రాజ్, శుభమ్ నొక్వాల్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ బీవీవీ నాగేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి పాల్గొన్నారు.