Share News

పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు

ABN , Publish Date - Sep 19 , 2025 | 01:25 AM

నగరంలో అన్న క్యాంటీన్లకు విశేష ఆదరణ లభిస్తోంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలు, నిరాశ్రయులు, వివిధ పనులపై ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి ఆకలి తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరిగ్గా ఏడాది కిందట అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. ఈ ఏడాది కాలంలో నగరంలోని 25 అన్న క్యాంటీన్లలో సగటున రోజుకు 23,843 మంది భోజనం చేస్తున్నారు.

పేదల ఆకలి తీరుస్తున్న  అన్న క్యాంటీన్లు

ఏడాది కిందట నగరంలో 25 చోట్ల ఏర్పాటు

సంవత్సర కాలంలో

74.62 లక్షల మందికి ఆహారం

రుచిగా, శుచిగా ఉండడంతో పెరిగిన ఆదరణ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో అన్న క్యాంటీన్లకు విశేష ఆదరణ లభిస్తోంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలు, నిరాశ్రయులు, వివిధ పనులపై ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి ఆకలి తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరిగ్గా ఏడాది కిందట అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. ఈ ఏడాది కాలంలో నగరంలోని 25 అన్న క్యాంటీన్లలో సగటున రోజుకు 23,843 మంది భోజనం చేస్తున్నారు.

నిరుపేదలకు నామమాత్రపు ధరకు నాణ్యమైన ఆహారం అందించేందుకు 2018లో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు అన్న క్యాంటీన్‌లను ప్రారంభించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్‌లను మూసివేయించింది. 2024లో తిరిగి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించారు. గత ఏడాది సెప్టెంబరు 19న జీవీఎంసీ పరిధిలో 25 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం రూ.5కు అందుబాటులో ఉంచారు. జీవీఎంసీ పరిధిలో తగరపువలస, భీమిలి, మారికవలస, వాంబే కాలనీ, విమ్స్‌ ఎదురుగా సంజీవగాంధీ నగర్‌, ఆరిలోవ, ఎంవీపీ రైతుబజార్‌, పెదవాల్తేరులోని ప్రభుత్వ ఛాతీ, శ్వాసకోశ వ్యాధుల ఆస్పతి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, టర్నర్‌చౌలీ్ట్ర, కేజీహెచ్‌ ఓపీ గేటు పక్కన, వన్‌టౌన్‌లోని జనతాబజార్‌, తాటిచెట్లపాలెం వైఎస్‌ఆర్‌ నగర్‌, మర్రిపాలెం, నక్కవానిపాలెం ఆర్టీసీ డిపో, శ్రీహరిపురం కోరమాండల్‌ గేట్‌, ఆటోనగర్‌, గాజువాక వంటిల్లు జంక్షన్‌, నమ్మిదొడ్డి, అనకాపల్లి ఎన్‌టీఆర్‌ ఆస్పత్రి, భీమునిగుమ్మం రైల్వేస్టేషన్‌, బాజీ జంక్షన్‌, పెందుర్తి, వేపగుంట, గోపాలపట్నం రైతుబజార్‌ పాంతాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. క్యాంటీన్‌లకు ఆహారం తయారు చేయడంతోపాటు సరఫరాచేసే బాధ్యతను అక్షయప్రాతకు అప్పగించింది. కంచరపాలెంలోని హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అక్షయపాత్ర సెంట్రల్‌ కిచెన్‌లో వంటకాలను తయారుచేసి వాహనాల్లో అన్న క్యాంటీన్లకు సరఫరా చేస్తున్నారు. మంచి రుచి, నాణ్యత కలిగి వుండడంతో నిరుపేదలు, కూలీలే కాకుండా ఆటోడ్రైవర్లు, చిరువ్యాపారులు కూడా భోజనం కోసం వీటినే ఆశ్రయిస్తున్నారు. దీంతో క్యాంటీన్లకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది.

అల్పాహారం కింద ప్రతిరోజూ మూడు ఇడ్లీలు, 150 మిల్లీలీటర్ల సాంబార్‌, 150 గ్రాములు చట్నీ ఇస్తున్నారు. ప్రత్యామ్నాయంగా సోమవారం, గురువారాల్లో మూడు పూరీ, వంద గ్రాముల కర్రీ, మంగళ, శుక్రవారాల్లో 250 గ్రాముల ఉప్మా, మిక్చర్‌, సాంబార్‌, బుధ, శనివారాల్లో హాట్‌ పొంగల్‌, సాంబార్‌, మిక్చర్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం కింద సోమవారం నుంచి శనివారం వరకూ 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల పప్పు లేదా సాంబార్‌, 100 గ్రాముల కూర, 75 గ్రాముల పెరుగు, పచ్చడి అందజేస్తున్నారు. అన్న క్యాంటీన్‌లకు ఆదివారం సెలవు. మిగిలిన రోజుల్లో ఉదయం ఏడున్నర నుంచి పది గంటల వరకూ అల్పాహారం, మధ్యాహ్నం 12.30 నుంచి మూడు గంటల వరకూ భోజనం, రాత్రి ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకూ భోజనం అందుబాటులో ఉంచుతున్నారు. గత ఏడాదికాలంలో ప్రతీరోజూ సగటున 23,843 మంది చొప్పున ఏడాదిలో మొత్తం 74,62,824 మంది అన్న క్యాంటీన్‌లలో ఆకలి తీర్చుకున్నారు. 28,76,030 మంది అల్పాహారం, 29,22,631 మంది మధ్యాహ్న భోజనం, 16,64,163 మంది రాత్రివేళ భోజనం చేసినట్టు యూసీడీ పీడీ సత్యవేణి తెలిపారు.

Updated Date - Sep 19 , 2025 | 01:25 AM