Share News

కలవరపెడుతున్న స్పాండిలైటిస్‌

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:45 AM

స్పాండిలైటిస్‌... గతంలో ఓ వయసు దాటిన వారికి ఎదురయ్యే సమస్య ప్రస్తుతం యువతను వేధిస్తోంది.

కలవరపెడుతున్న స్పాండిలైటిస్‌

  • ఇటీవల భారీగా కేసుల నమోదు

  • ఆర్థో, న్యూరో వైద్య నిపుణుల వద్దకు క్యూ

  • రోగుల్లో 50 శాతం 35 ఏళ్లలోపు వయసు వారే

  • కంప్యూటర్‌ వర్క్‌, ఇతర అలవాట్లే కారణం

  • జాగ్రత్తలతో సమస్యకు చెక్‌ చెప్పే వీలు

( విశాఖట్నం, ఆంధ్రజ్యోతి)

స్పాండిలైటిస్‌... గతంలో ఓ వయసు దాటిన వారికి ఎదురయ్యే సమస్య ప్రస్తుతం యువతను వేధిస్తోంది. గంటలు తరబడి కంప్యూటర్‌ ముందు కోర్చోవడం, సిటింగ్‌ పొజిషన్‌ సరిగా లేకపోవడం, నెక్‌ మూవ్‌మెంట్‌ సక్రమంగా లేకపోవడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

నగర పరిధిలో ఆర్థో, న్యూరో వైద్య నిపుణుల వద్దకు గతంలో రోజూ పదుల సంఖ్యలో వచ్చే రోగుల సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది. తాజాగా 25 ఏళ్ల వయసు వారిని కూడా ఈ సమస్య వేధిస్తోంది. కేజీహెచ్‌, విమ్స్‌ ఆస్పత్రులకు ప్రతినెలా కనీసం 300 నుంచి 400 మంది వరకు ఇదే సమస్యను ఎదుర్కొంటున్న వారు వస్తున్నారని, ఇది ఆందోళన కలిగించే అంశమని చెబుతున్నారు.

ఈ తరహా లక్షణాలతో..

స్పాండిలైటిస్‌తో బాధపడే వారు వేగంగా గుర్తించలేదు. సాధారణ సమస్యగా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆలస్యమయ్యే కొద్దీ సమస్య తీవ్రత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వారిలో మెడనొప్పి, చేయి లాగడం, చేతి వేళ్లు తిమ్మిర్లు ఎక్కడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

కారణాలివే..

స్పాండిలైటిస్‌ బారినపడేందుకు అనేక అంశాలు దోహదం చేస్తుంటాయి. యువతలో ఈ సమస్యకు ప్రధాన కారణం సిటింగ్‌ పొజిషన్‌ సరిగా లేకపోవడం, కూర్చునే కుర్చీలు సక్రమంగా లేకపోవడమే. కంప్యూటర్‌ ఎదుట గంటలు తరబడి పనిచేసే వారు సరైన కుర్చీలు వినియోగిస్తే సమస్య బారినపడకుండా ఉండవచ్చు. కుర్చీల్లో జారి కూర్చోవడం, వెనక్కి, చుట్టుపక్కలకు ఒకేసారి తిరగడం వల్ల దీని బారినపడే ప్రమాదం ఉంది. ఆధునిక జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, టెన్షన్‌, ఒత్తిడి కారణంగా చెబుతున్నారు. ఆల్కహాల్‌, పొగతాగడం వంటి అలవాట్లు కూడా స్పాండిలైటిస్‌కు కారణమవుతాయి. కొందరు రెండు, మడు తల దిండ్లు పెట్టుకుంటే గానీ నిద్రపోరు. ఇది అత్యంత ప్రమాదంగా నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల డిస్క్‌ల మధ్య గ్యాప్‌ ఏర్పడి స్పాండిలైటిస్‌కు దారితీస్తుంది.

బైక్‌ నడిపినా

ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హ్యాండిల్‌ సరిగా పట్టుకోకపోయినా ఈ సమస్య బారినపడే అవకాశం ఉంది. వంగి బైక్‌ నడిపితే సమస్య వేధిస్తుంది. సెల్‌ఫోన్‌ను షోల్డర్‌, చెవి మధ్య పెట్టుకుని తలవంచి ఎక్కవసేపు అదేపనిగా మాట్లాడుతుంటారు. వారిని ఈ సమస్య వేఽధించే అవకాశం ఉంది. బరువులు ఎత్తే సమయంలో సరైన భంగిమలు పాటించకపోయినా ప్రమాదమే.

ఈ జాగ్రత్తలతో చెక్‌..

స్పాండిలైటిస్‌ సమస్యకు కొన్ని జాగ్రత్తలతో చెక్‌ చెప్పవచ్చు. యోగా, మెడిటేషన్‌, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్‌, సరిగా కూర్చోవడం, మంచి కుర్చీలను వినియోగించడం, తల, నడుము, షోల్డర్‌ వంచకుండా నిటారుగా కూర్చోవడం, నిలబడడం, రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

భారీగా పెరుగుతున్న కేసులు

గతంతో పోలిస్తే స్పాండిలైటిస్‌ కేసులు భారీగా పెరిగాయి. వంద కేసులు చూస్తే సుమారు 50 స్పాండిలైటిస్‌ కేసులే. ఇందులోనూ 35 ఏళ్లలోపు వారే 50 శాతం ఉంటున్నారు. వీరిలో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, కంప్యూటర్‌పై పని చేసేవారు ఉంటున్నారు. మెడలోని కీళ్లు, వెన్నెముక అరుగుదల వల్ల స్పాండిలైటిస్‌ వస్తుంది. మెడ భాగంలో నొప్పి వచ్చి, భుజం నుంచి చేతుల మీదుగా వేలి వరకు వెళ్తుంది. బోన్‌కు బోన్‌కు మధ్య రాపిడి, గ్యాప్‌ పెరగడం వల్ల సమస్య ఉత్పన్నమవుతుంది. నెక్‌ మూవ్‌మెంట్‌ సక్రమంగా జరగకపోతే వేగంగా సమస్య బారిన పడతారు. వైద్యుల సలహా మేరకు మందులుతోపాటు కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

- డాక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్థో వైద్య నిపుణులు

Updated Date - Jun 23 , 2025 | 12:45 AM