అంజలి శనివారం పంచాయతీకి మహర్దశ
ABN , Publish Date - Nov 09 , 2025 | 10:46 PM
మండలంలోని అంజలి శనివారం పంచాయతీకి మహర్దశ పట్టింది. దశాబ్దాలుగా కనీస రహదారి సదుపాయం లేక అవస్థలు పడుతున్న ఆదివాసీలకు రవాణ కష్టాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది.
రూ.23 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో గ్రావెల్ రోడ్లు
20 గ్రామాల ప్రజలకు తీరనున్న రవాణ కష్టాలు
చురుగ్గా సాగుతున్న పనులు
రూ.2.8 కోట్లతో తారు రోడ్డు నిర్మాణం పూర్తి
చింతపల్లి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):మండలంలోని అంజలి శనివారం పంచాయతీకి మహర్దశ పట్టింది. దశాబ్దాలుగా కనీస రహదారి సదుపాయం లేక అవస్థలు పడుతున్న ఆదివాసీలకు రవాణ కష్టాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. 20 ఆదివాసీ గ్రామాలకు కనెక్టివిటీ గ్రావెల్ రోడ్లు నిర్మించేందుకు రూ.23.04కోట్ల ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో రోడ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి.
మండలంలో అంజలి శనివారం శివారు పంచాయతీ. ఈ పంచాయతీ పరిధిలో 32 గిరిజన గ్రామాలున్నాయి. పంచాయతీ పరిధిలో 3,600 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. 12 గ్రామాలకు మెటల్ రోడ్లు ఉన్నాయి. 20 గ్రామాలకు కనీసం కాలిబాట మినహా రహదారులు లేవు. ఈ ప్రాంత ప్రజలు పలుమార్లు తమ గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించాలని గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ పాలకులు, అధికారులకు అర్జీలు ఇచ్చి అలసిపోయారు. ఐదేళ్ల గడిచిపోయినప్పటికీ వైసీపీ పాలకులు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పంచాయతీ పరిధిలోనున్న టీడీపీ నాయకులు ఆదివాసీలు ఎదుర్కొంటున్న రవాణ కష్టాలను నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి, జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ప్రతి గ్రామానికి గ్రావెల్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీంతో రెండు నెలల క్రితం 20 గ్రామాల పరిధిలో ఉన్న 2,100 మంది ప్రజలకు రహదారుల సదుపాయం కల్పించేందుకు నిధులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది.
శరవేగంగా నిర్మాణాలు
పంచాయతీ పరిధిలో గ్రావెల్ రహదారుల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. రెండు నెలల క్రితం నిధులు విడుదలైనప్పటికీ వర్షాల కారణంగా పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్ పనులను వేగవంతం చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ గ్రావెల్ రహదారులు నిర్మిస్తున్నారు.
తీరనున్న రవాణ కష్టాలు
పంచాయతీ పరిధిలోనున్న 20గ్రామాల ప్రజలకు గ్రావెల్ రోడ్లు నిర్మించడంతో రవాణ కష్టాలు తీరనున్నాయి. గతంలో కనీసం గిరిజన గ్రామాలకు రెండు చక్రాల వాహనాలు సైతం నడిచే పరిస్థితి లేదు. అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఉన్నా రోగులు, గర్భిణులను డోలిలో ప్రధాన రహదారి వరకు తీసుకొచ్చి అక్కడ నుంచి అంబులెన్సులో తాజంగి ఆస్పత్రికి తీసుకొచ్చేవారు. నిత్యావసర సరకులు, ఇతర అవసరాలకు పొరుగు గ్రామాలకు కాలినడక ప్రయాణించాల్సి వచ్చేది. ఆదివాసీలు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను సైతం మోసుకుంటూ సంతలకు తరలించేవారు. గ్రావెల్ రహదారుల నిర్మించడంతో ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్తులో తారు రోడ్లు
కూటమి ప్రభుత్వం గ్రావెల్ రోడ్లు నిర్మించిన ప్రతి గ్రామానికి తారు రోడ్డు నిర్మించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తొలివిడతగా గ్రావెల్, మెటల్ రోడ్లు నిర్మించిన ఏడాదికి తారు రోడ్లు నిర్మించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం గ్రావెల్ రోడ్లు నిర్మిస్తున్న తాటిబంద, చిన్నయ్యపాలెం, తురుబొంగుల, గున్నమామిడిపాలెం, కొత్తలగరువు, పులిగొంది, తాటిబంద, ముంతమామిడి, మునగాలబంద, చిక్కుడువీధి, సింగవరం కొత్తూరు, దోనిబంద, పొర్లుబంద, మాడెంబంద పెదవీధి, అజలం, బచ్చలివేనం, కాపసుపాడు, నడింపాలెం, కాగులబంద, గొడుగుమామిడి గ్రామాలకు భవిష్యత్తులో తారు రోడ్లు సైతం అందుబాటులోకి రానున్నాయి.
రూ.2.8 కోట్లతో తారు రోడ్డు
అంజలి శనివారం పంచాయతీ కేంద్రానికి కూటమి ప్రభుత్వం రెండు నెలల క్రితం రూ.2.8 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో తారు రోడ్డు నిర్మించింది. గత వైసీపీ ప్రభుత్వం జాజులపాలెం నుంచి అంజలి శనివారం వరకు తారు రోడ్డు నిర్మిస్తామంటూ కాలయాపన చేసిందే తప్ప కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంజలి శనివారం గ్రామ పంచాయతీకి తారు రోడ్డు నిర్మించేందుకు అవసరమైన నిధులను విడుదల చేసింది. దీంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు తారు రోడ్డు నిర్మాణాలను పూర్తి చేశారు. దీంతో ఆదివాసీలు ఎదురుచూస్తున్న దశాబ్దాల నాటి కల నెరవేరింది.