అంగన్‌వాడీలకు ‘యాప్’ కష్టాలు!
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:22 AM
అంగన్‌వాడీ సిబ్బందిని యాప్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే అమలుచేస్తున్న ‘బాల సంజీవని’ యాప్‌లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసి 2.0 పేరుతో ఈ నెల ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు రేషన్ సరకులను మరింత పకడ్బందీగా పంపిణీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం యాప్‌లో మార్పులు చేసింది. అయితే మార్పులు చేసిన తరువాత యాప్ సరిగా పనిచేయడం లేదని, దీంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు.

‘బాల సంజీవని’లో మార్పులు
2.0 పేరుతో అప్‌డేట్ చేసిన ప్రభుత్వం
సాంకేతిక సమస్యతో వినియోగంలో ఇబ్బందులు
వివరాలు అప్‌లోడ్ కావడం లేదంటున్న సిబ్బంది
లబ్ధిదారులకు రేషన్ ఇచ్చేందుకూ తప్పని ఇక్కట్లు
విశాఖపట్నం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి):
అంగన్‌వాడీ సిబ్బందిని యాప్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే అమలుచేస్తున్న ‘బాల సంజీవని’ యాప్‌లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసి 2.0 పేరుతో ఈ నెల ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు రేషన్ సరకులను మరింత పకడ్బందీగా పంపిణీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం యాప్‌లో మార్పులు చేసింది. అయితే మార్పులు చేసిన తరువాత యాప్ సరిగా పనిచేయడం లేదని, దీంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు.
జిల్లాలో 776 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అనేకచోట్ల యాప్ ఓపెన్ కావడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. కొన్నిచోట్ల యాప్ ఓపెన్ అయినప్పటికీ వివరాలు అప్‌లోడ్ కావడం లేదంటున్నారు. ప్రతిరోజూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్ చేసిన తరువాతే రేషన్ అందించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో ఒక్కోసారి లబ్ధిదారులు అంగన్‌వాడీ కేంద్రాలకు రాలేకపోతున్నారని, అలాంటి సందర్భంలో వారికి సరకులు అందించడం కష్టమవుతోందని వాపోతున్నారు. అలాగే, కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫొటో తీసే సమయంలో పిల్లలు కెమెరా వైపు చూడకపోతే వారి హాజరును యాప్ గుర్తించడం లేదంటున్నారు. ఉదాహరణకు ఒక కేంద్రంలో 30 మంది పిల్లలు హాజరైతే 15 నుంచి 20 మందిని మాత్రమే కౌంట్ చేస్తోందని, దీనివల్ల పిల్లలకు పూర్తిస్థాయిలో వండి వడ్డించలేని పరిస్థితి ఎదురవుతోందంటున్నారు. అంతేకాకుండా సిబ్బంది హాజరు కూడా ఇదే యాప్‌లో నమోదు చేయాలని, సమయానికి యాప్ ఓపెన్ కాకపోవడంతో కేంద్రానికి ఆలస్యంగా వచ్చినట్టు నమోదవుతోందని వాపోతున్నారు.
ఖర్చుల వివరాలూ యాప్‌లోనే..
కొద్దిరోజుల కిందటి వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖర్చులకు సంబంధించిన వివరాలను రిజిస్టర్‌లో నమోదుచేసే అవకాశం ఉండేది. తాజాగా పిల్లలకు వండి వడ్డించేందుకు అయ్యే ఖర్చుకు సంబంధించిన ప్రతి రూపాయిని యాప్‌లోనే అప్‌లోడ్ చేయాలి. సాంకేతిక సమస్యలతో వివరాలు అప్‌లోడ్ కాకపోతే మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. పిల్లలు గుండు చేయించుకుని ఉన్నా, ఫొటో తీసే సమయంలో కెమెరావైపు చూడకపోయినా వారి హాజరును లెక్కించడం లేదని, దీంతో రోజువారీ ఖర్చులపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో పిల్లాడికి రోజుకు 75 గ్రాముల బియ్యం ఇవ్వాలి. పది మంది పిల్లలుంటే 750 గ్రాముల బియ్యం వివరాలు యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. కానీ, కొంతమంది పిల్లల హాజరు తీసుకోకపోవడంతో సమస్యలు వస్తున్నాయంటున్నారు. నెల ప్రారంభంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ (గత నెలలో మిగిలిన గుడ్లు, ఇతర సరకులు) వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. అయితే, ఓపెనింగ్ బ్యాలెన్స్‌లో అప్‌లోడ్ చేసిన సరకుల వివరాలకు రెట్టింపు చూపిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ చిక్కులన్నీ తమ పనితీరుపై ప్రభావం చూపిస్తున్నాయని, తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని సిబ్బంది పేర్కొంటున్నారు. అప్‌డేట్ చేసిన యాప్‌తో ఎదురవుతున్న సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించామని, వెంటనే పరిష్కార మార్గాలను సూచించాలని వారంతా కోరుతున్నారు.