Share News

ఆంధ్రా బెబ్బులి వంగవీటి రంగా

ABN , Publish Date - Dec 27 , 2025 | 01:03 AM

వంగవీటి మోహనరంగా ఆంధ్రా బెబ్బులి అని ఆయన కుమార్తె వంగవీటి ఆశాకిరణ్‌ అన్నారు.

ఆంధ్రా బెబ్బులి వంగవీటి రంగా

  • ఆయన కోసం ఏమి చేశారో చెప్పాలని టీడీపీ, వైసీపీ, జనసేన నాయకులను ప్రశ్నిస్తున్నా

  • కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలి

  • త్వరలో రాష్ట్రమంతటా పర్యటన

  • వంగవీటి ఆశాకిరణ్‌

అక్కయ్యపాలెం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి):

వంగవీటి మోహనరంగా ఆంధ్రా బెబ్బులి అని ఆయన కుమార్తె వంగవీటి ఆశాకిరణ్‌ అన్నారు. మోహనరంగా 37వ వర్ధంతి సందర్భంగా రాధా రంగా రాయల్‌ అసోసియేషన్‌ ‘రంగానాడు’ పేరుతో శుక్రవారం సాయంత్రం నగరంలోని ఇనార్బిట్‌మాల్‌ ఎదురుగా బహిరంగ సభ నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగాహాజరైన ఆమె మాట్లాడుతూ ఆయనకు బెజవాడలోనే కాకుండా ఆంధ్రా అంతటా అభిమానులు ఉన్నారన్నారు. రంగాకు కులమతాలు లేవని, జీవితాంతం ప్రజల సంక్షేమం కోసమే పోరాటం చేశారన్నారు. రంగా ఫొటోతో ఓట్లు దండుకొని ఆయన కోసం ఏమి చేశారో చెప్పాలని టీడీపీ, వైసీపీ, జనసేన నాయకులను ప్రశ్నిస్తున్నానన్నారు. కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని గత మూడేళ్ల నుంచి అడుగుతున్నా, ఎవరూ కూడా పట్టించుకోవడం లేదన్నారు. రంగానాడు బహిరంగ సభ జరగకుండా రాజకీయ శక్తులు ఎన్నో ప్రయత్నాలు చేశాయని, మూడుసార్లు స్థల మార్పులు జరిగాయన్నారు. ఈ సభకు రాకుండా జనాలను భయపెట్టారని, ఒకరిని భయపెడితే వందమంది వస్తారని గుర్తుపెట్టుకోవాలన్నారు. తాము వర్గ పోరాటానికి రాలేదని, మంచి పని చేద్దామని, రంగా పేరు నిలబెడదామని ముందుకు వచ్చామని ప్రకటించారు. ఆడబిడ్డ అని, సాఫ్ట్‌గా ఉన్నానని అనుకుంటే పొరపాటని, తనది రంగా రక్తమని, అన్యాయం చేసిన వారిని నిలదీస్తానని అన్నారు. ప్రారంభంలోనే అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఎంత తొక్కితే అంత పైకి వెళతామని, వెనకడుగు వేయడం తమకు తెలియదన్నారు. దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. రంగా ఆశయ సాధనను ముందుకు తీసుకువెళతామన్నారు. త్వరలో రాష్ట్ర పర్యటన ఉంటుందని, దానిలో భాగంగా ప్రతి మండలానికి వెళ్లి రంగా మిత్రమండలి, యూఐ సభ్యులను కలుస్తానన్నారు.

రంగా కుటుంబానికి అండగా ఉంటా: ఆర్‌.కృష్ణయ్య

రంగా కుమార్తె ఆశాకిరణ్‌తో పాటు కుటుంబ సభ్యులకు కూడా అండగా ఉండి వారి ఉద్యమాలకు పూర్తి మద్దతిస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం నాయకుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ఈ సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ తాను బీసీల కోసం ఉద్యమం చేస్తే రంగా అండగా నిలబడ్డారన్నారు.

రంగాకు నివాళులర్పించడం అదృష్టంగా భావిస్తున్నా: ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు

ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగాకు నివాళులర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ బహిరంగ సభకు ఆటంకాలు వచ్చాయని తెలిసి, ఇబ్బందులు లేకుండా తన వంతు ప్రయత్నం చేశానన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రంగా కుమారుడు రాధా తన గెలుపునకు ఎంతో కృషిచేశారని గుర్తుచేశారు. రాధా రంగా రాయల్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు గాదె బాలాజీ మాట్లాడుతూ రామరాజ్యం, రాజన్న రాజ్యం చూశారని, త్వరలో రంగా రాజ్యం చూస్తారన్నారు. ఉత్తర నియోజకవర్గంలో రంగా విగ్రహం ఏర్పాటు చేశామంటే ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కృషి ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో వంగవీటి శంకర్‌ కుమార్‌, మున్నూరు కాపు గ్లోబల్‌ చైర్మన్‌ రజనీకాంత్‌, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య తదితరులు ప్రసంగించారు. మాజీ కార్పొరేటర్‌ పీలా ఉమారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ, కాపు సంఘాల నాయకులు లక్ష్మణ్‌ పటేల్‌, గుర్రం శ్రీనివాస్‌, కర్రి వెంకటరమణ, సత్యారెడ్డి, జగత్‌ శ్రీనివాస్‌, ముత్యం సతీష్‌, పీలా వెంకటలక్ష్మి, దినకర్‌, సుంకరి అప్పారావు, గుడివాడ ప్రభాకర్‌, తుర్లపాటి సురేష్‌, బొగ్గు శ్రీను, సిపాని శ్రీనుబాబు, వంగవీటి రాజా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 01:03 AM