అంచనాలు పక్కాగా...
ABN , Publish Date - Nov 27 , 2025 | 01:28 AM
అభివృద్ధి పనులు చేపట్టేందుకు అంచనాలు పక్కాగా రూపొందించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులను సక్రమంగా, సకాలంలో వినియోగించాలని అధికారులను రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు ఆదేశించారు.
అప్పుడే సత్ఫలితాలు
నిధులను సక్రమంగా, సకాలంలో వినియోగించాలి
జిల్లా అధికారులకు రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్
వేగుళ్ల జోగేశ్వరరావు ఆదేశం
మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ మరమ్మతులకు నిధులు కోరిన కలెక్టర్
విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):
అభివృద్ధి పనులు చేపట్టేందుకు అంచనాలు పక్కాగా రూపొందించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులను సక్రమంగా, సకాలంలో వినియోగించాలని అధికారులను రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా రూపొందించే అంచనాలతోనే మంచి ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. కమిటీ సభ్యులు ఏలూరి సాంబశివరావు, నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, వరుదు కల్యాణిలతో కలిసి బుధవారం జిల్లా పర్యటించిన ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ విభాగాల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో స్థితిగతులు, చేపట్టిన ప్రాజెక్టుల గురించి కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్, విభాగాల అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు మాట్లాడుతూ అంచనాలు రూపొందించే సమయంలో జాగ్రత్తగా ఉంటే పనులు చేపట్టే సమయంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తవన్నారు. పనులు జరిగిన వెంటనే బిల్లులను అప్‌లోడ్ చేయాలన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున పలు కార్యక్రమాలు చేపడుతోందని, అవి ప్రజలకు చేరువయ్యేలా అధికారులు కృషిచేయాలని కోరారు. సభ్యుడు ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో అమలు చేస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాల్సి ఉందన్నారు. మరో సభ్యుడు మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో సచివాలయ, డీఆర్‌డీఏ ఉద్యోగులతో పాటు ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు భాగస్వామ్యులైతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. వరుదు కల్యాణి మాట్లాడుతూ కేజీహెచ్‌లో ఇటీవల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడానికి గల కారణాలేమిటని ప్రశ్నించారు. అక్కడ సరిపడా జనరేటర్లు లేవా?...అధికారులను అడిగారు. సంబంధిత అధికారులు వివరాలు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అధ్వర్యంలో ఉందని, దానికింద ఆయకట్టు అంతగా లేదని, అందువల్ల జీవీఎంసీ తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నామన్నారు. రిజర్వాయర్ మరమ్మతులకు తగిన నిధులు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో శాసనసభ డిప్యూటీ సెక్రటరీ రాజ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఆర్డీఓ సుధాసాగర్, వీఎంఆర్టీఏ జాయింట్ కమిషనర్ రమేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.