Share News

ఆర్‌ఈసీఎస్‌ ఉద్యోగుల అరాచకం

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:59 AM

అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘం (ఆర్‌ఈసీఎస్‌)లో కొందరు ఉద్యోగులు నిబంధనలను బేఖాతరు చేస్తూ చెలరేగిపోతున్నారు.

ఆర్‌ఈసీఎస్‌ ఉద్యోగుల అరాచకం

  • ‘51 ఎంక్వయిరీ’ ఆపాలని వినియోగదారుల పేరిట హైకోర్టులో పిటిషన్‌

  • తప్పులు బయటపడతాయని భయం

  • సర్వీసు నిబంధనలకు వ్యతిరేకం

  • చర్యలు చేపట్టకుండా జిల్లా అధికారుల తాత్సారం

  • ఆది నుంచి అదే తీరు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘం (ఆర్‌ఈసీఎస్‌)లో కొందరు ఉద్యోగులు నిబంధనలను బేఖాతరు చేస్తూ చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా అడ్డగోలుగా ఉద్యోగంలో చేరి, అర్హతలు లేకుండా పదోన్నతులు పొంది లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నవారు తమ తప్పులు బయట పడకుండా శతవిధాలా యత్నిస్తున్నారు.

ఆర్‌ఈసీఎస్‌లో భారీఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని, అర్హత లేకుండా చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారని ఫిర్యాదులు అందడం, వాటిపై విచారణ చేయాలని ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) కూడా సూచించడంతో రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌ ఈ ఏడాది మార్చి నెలలో 51 విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఉన్నతాధికారులు ఎవరితో విచారణ చేయాలో స్పష్టంగా ఆదేశాలు ఇవ్వకుండా ఆ బాధ్యత జిల్లా జిల్లా సహకార శాఖ అధికారి(డీసీఓ)కే వదిలేశారు. దాంతో విచారణాధికారిగా తుమ్మపాల షుగర్స్‌ ఎండీ ఎంవీఎస్‌ శాస్త్రిని అనకాపల్లి డీసీఓ ప్రేమస్వరూప నియమించారు. విచారణ జరిగితే మొత్తం తప్పులు బయట పడతాయని పాత రికార్డులు అందుబాటులో లేకుండా సిబ్బంది మాయం చేశారు. దాంతో విచారణ నెమ్మదిగా సాగుతోంది.

ఇదిలావుండగా ఆర్‌ఈసీఎస్‌ బాధ్యతలు చేపట్టిన ఈపీడీడీసీఎల్‌ అధికారులు ఇటీవల అక్కడి ఉద్యోగుల సర్వీసు రికార్డులు పరిశీలించారు. పదోన్నతులు పొందిన వారి అర్హతలను తనిఖీ చేశారు. సస్పెన్షన్‌లో ఉండగా పదోన్నతులు పొందారని, అదేవిధంగా పదోన్నతులు పొందడానికి నిర్ణీత సమయం ఉండగా, దానిని కూడా పాటించలేదనీ గుర్తించారు. ఆ విధంగా అధిక మొత్తాలు పొందుతున్న వారి జీతాలను జూలై నెల నుంచి తగ్గించేస్తూ ఈపీడీసీఎల్‌ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకూ అధికంగా పొందిన జీతాలను ఎలా రికవరీ చేయాలా?...అని ఆలోచిస్తోంది. ఇలా ఒక్కొక్క బండారం బయట పడుతుండడంతో త్వరలో 51 విచారణతో నిధుల దుర్వినియోగం కూడా వెలుగులోకి వస్తుందని అక్రమార్కులు భయపడుతున్నారు. దీనిని అడ్డుకోవాలని యత్నిస్తున్నారు.

వినియోగదారుల పేరుతో హైకోర్టులో కేసు

సొసైటీలో ఉద్యోగులుగా పనిచేస్తున్న ఐదుగురు (ఎం.పరదేశినాయుడు, ఆడారి ప్రసన్నరాణి, బొమ్మిశెట్టి సత్యవేణి, విల్లూరి శివకుమార్‌, బొక్కం కనకారావు) సాధారణ విద్యుత్‌ వినియోగదారుల్లా ఈ నెల 4వ తేదీన హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అనకాపల్లి ఆర్‌ఈసీఎస్‌పై జరుగుతున్న 51 విచారణను నిలిపివేయాలని, దానిపై స్టే ఇవ్వాలని కేసు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనల ప్రకారం...ఏ ప్రభుత్వ సంస్థపై గాని, ఉద్యోగులపై గాని ఆరోపణలు వచ్చి ప్రభుత్వం విచారణ చేస్తుంటే...దానిని ఆపాలని కోర్టుకు వెళ్లే హక్కు అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉండదు. ఆ విచారణను ఎదుర్కోవాలి. నివేదిక వచ్చాక చర్యలకు సిద్ధపడాలి. కానీ ఇక్కడ ఈ ఐదుగురు కూడా తాము ఉద్యోగులమని పిటిషన్‌లో పేర్కొనకుండా వాస్తవం దాచి పెట్టడం గమనార్హం. ఈ నెల 4వ తేదీన కేసు ఫైల్‌ కాగా ఆ విషయం వెంటనే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సంబంధిత అధికారులకు తెలియజేస్తారు. దానిపై కౌంటర్‌ వేయడానికి సమాచారం ఇవ్వాలని కోరతారు. ఆ వివరాలు ఆర్‌ఈసీఎస్‌కు రావాలి. దానికి జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఎండీగా అనకాపల్లి ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ వ్యవహరిస్తున్నారు. జిల్లా సహకార శాఖ అధికారి 51 ఎంక్వయిరీకి అధికారిని నియమించారు. హైకోర్టులో కేసు వేసిన వారు ఎవరో ముందుగా చూడాలి. వారు ఇక్కడ పనిచేస్తున్న వారే కాబట్టి అది సర్వీసు రూల్స్‌కు వ్యతిరేకం అయినందున చర్యలు చేపట్టాలి. కానీ ఎవరూ తమకు హైకోర్టులో కేసు విషయం తెలియదని చెబుతున్నారు. ఆ కేసు వేసిన ఉద్యోగులను పిలిచి కనీస విచారణ కూడా చేయకపోవడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా సహకార శాఖ అధికారులు మేల్కొంటారా? లేదో మరి.

Updated Date - Aug 19 , 2025 | 12:59 AM