Share News

అనంత పద్మనాభుని దీపోత్సవం రేపు

ABN , Publish Date - Nov 18 , 2025 | 01:46 AM

అనంత పద్మనాభుని దీపోత్సవ సంబరం ఈనెల 19న నిర్వహించడానికి దేవస్థానం ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

అనంత పద్మనాభుని దీపోత్సవం రేపు

ఏటా కార్తీక బహుళ అమావాస్య రోజున నిర్వహణ

విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం

పద్మనాభం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):

అనంత పద్మనాభుని దీపోత్సవ సంబరం ఈనెల 19న నిర్వహించడానికి దేవస్థానం ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఏటా కార్తీక బహుళ అమావాస్య రోజున ఈ ఉత్సవాన్ని అత్యంత భక్తిప్రపత్తులతో నిర్వహిస్తారు. అనంతుని కొండకు ఉన్న 1,286 మెట్లకు ఇరువైపులా నూనె దీపాలను ఒకేసారి వెలిగించడం ఈ ఉత్సవం ప్రత్యేకత. ఉత్సవంలో భాగంగా భక్తులు వేకువజామున తొలి పావంచా వద్ద పూజలు చేసి, మెట్లకు పసుపు, కుంకుమ బొట్లు పెడుతూ గిరిని అధిరోహించి అనంతపద్మనాభుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీపాలను వెలిగించడానికి భక్తులు మధ్యాహ్నం నుంచి మెట్లను ముందుగానే రిజర్వు చేసుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు కుంతీమాధవస్వామి ఆలయంలో ఉన్న ఉభయ దేవేరులతో కూడిన అనంత పద్మనాభుడి ఉత్సవ విగ్రహాలను వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ గరుడ వాహనంపై ఊరేగింపుగా తొలి పావంచా వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై కొలువు తీరుస్తారు. అనంతరం విశేష అర్చనలు చేసి భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు కొండపై జేగంట కొట్టగానే, అప్పటికే మెట్లపై ఏర్పాటుచేసిన నూనె దీపాలను భక్తులు వెలిగిస్తారు. ఆ దీపకాంతులతో అనంతుని గిరి దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఈ ఉత్సవానికి దేవస్థానం అధికారులు, జిల్లా అధికారులు ఏర్పాట్లుపూర్తిచేశారు. తొలి పావంచాల వద్ద, కొండపై అనంతపద్మనాభస్వామి, కుంతీమాధవస్వామి, నారాయణేశ్వరస్వామి ఆలయాల వద్ద క్యూలైన్లు సిద్ధం చేశారు. పద్మనాభం ప్రధాన రహదారిని విద్యుద్దీపాలతో అలంకరించారు. పోలీసులు వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లుచేశారు.

Updated Date - Nov 18 , 2025 | 01:46 AM