Share News

అక్కరకు రాని ఆయుష్‌ ల్యాబ్‌!

ABN , Publish Date - Aug 14 , 2025 | 01:09 AM

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని శొంఠ్యాంలో ఏర్పాటుచేసిన ఆయుష్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ లేబొరేటరీ ఇంకా సేవలు ప్రారంభించలేదు. సుమారు రూ.8 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భవన నిర్మాణ పనులు పూర్తయ్యి పది నెలలు దాటుతోంది.

అక్కరకు రాని ఆయుష్‌ ల్యాబ్‌!

  • శొంఠ్యాంలో రూ.8 కోట్లతో నిర్మాణం

  • పది నెలల కిందట పనులు పూర్తి

  • పరికరాలు కొనుగోలు చేయకపోవడం, మౌలిక వసతులు

  • కల్పించకపోవడంతో ఇంకా అందుబాటులోకి రాని వైనం

  • లేబొరేటరీ ప్రారంభమైతే మందుల నాణ్యత పరీక్షలు వేగవంతమయ్యేందుకు అవకాశం

విశాఖపట్నం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని శొంఠ్యాంలో ఏర్పాటుచేసిన ఆయుష్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ లేబొరేటరీ ఇంకా సేవలు ప్రారంభించలేదు. సుమారు రూ.8 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భవన నిర్మాణ పనులు పూర్తయ్యి పది నెలలు దాటుతోంది. అయితే పరికరాలు కొనుగోలు చేయకపోవడం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ల్యాబ్‌ ప్రారంభంలో జాప్యం జరుగుతోంది. ఈ ల్యాబ్‌ అందుబాటులోకి వస్తే ఆయుష్‌ విభాగానికి సంబంధించిన తయారైన మందులను ఇక్కడే పరీక్షించేందుకు అవకాశం కలుగుతుంది.

ప్రస్తుతం ఆయుర్వేద, యునాని, హోమియో వంటి విభాగాలకు సంబంధించిన మందులను తయారుచేసే కంపెనీలు వాటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌, చెన్నై వంటి ప్రాంతాల్లోని ల్యాబ్‌లకు పంపిస్తున్నాయి. అక్కడ పరీక్షలు పూర్తిచేసుకుని వచ్చేసరికి సమయం పడుతోంది. ఇది ఆయా మందులు అందుబాటులోకి వచ్చే కాల వ్యవధిని పెంచేలా చేస్తోందని భావించిన ప్రభుత్వం రాష్ట్రంలోనే ఒక డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటుచేయాలని భావించింది. అందుకు అనుగుణంగా శొంఠ్యాంలో కొన్నాళ్ల కిందట ల్యాబ్‌ నిర్మాణ పనులను ప్రారంభించి సుమారు పది నెలల కిందట పూర్తిచేసింది. అయితే, భవన నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ పరికరాల కొనుగోలు చేయకపోవడం, మౌలిక వసతులు కల్పించకపోవడం సమస్యగా మారింది. సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నిధులను మంజూరుచేసినట్టు ప్రకటించినప్పటికీ విడుదల చేయకపోవడంతో అడుగు ముందుకుపడడం లేదు.

అదనపు భారంతో ఇబ్బందులు

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో డ్రగ్‌ టెస్టింగ్‌ లేబొరేటరీ, ఆయుర్వేద మందుల మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. ఈ ఇబ్బందులను గుర్తించే ప్రభుత్వం ల్యాబ్‌ను విశాఖలో ఏర్పాటుచేసేందుకు ముందుకువచ్చింది. ల్యాబ్‌ అందుబాటులోకి రావడం వల్ల మందుల నాణ్యత పకడ్బందీగా పరీక్షించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మందులు తయారుచేసే కంపెనీలు టెస్టింగ్‌ కోసం ఇతర ప్రాంతాలకు పంపితే అదనపు ఖర్చు అవుతోంది. ల్యాబ్‌ అందుబాటులోకి వస్తే ఈ వ్యయం తగ్గుతుది. తద్వారా రోగులపై భారం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో సరికొత్త ఔషధాలు తయారీకి సంబంధించిన పరిశోధనలను ఇక్కడ నిర్వహించేందుకు అవకాశం ఉంది. ఔషధ పరిశోధన నూతన ఫార్ములేషన్ల అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఆయుర్వేద విద్యార్థులకు పరిశీలన, ప్రాక్టీస్‌ నిర్వహణకు కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కాబట్టి ఉన్నతాధికారులు వీలైనంత తొందరగా టెస్టింగ్‌ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Updated Date - Aug 14 , 2025 | 01:09 AM