ఉల్లంఘనులపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:37 AM
జిల్లాలో నిబంధనలు పాటించని వాహనాలను గుర్తించేందుకు రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. ప్రధానంగా రాయి క్వారీల నుంచి కంకర, బండరాళ్లను రవాణా చేసే లారీలు, టిప్పర్లు చాలా వరకు కాలం చెల్లినవి (ఫిట్‌నెస్ లేనివి)గా రవాణా శాఖాధికారులకు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్ లేని, నిబంధనలు పాటించని వాహనాలను గుర్తించి, అవసరమైతే సీజ్ చేసేందుకు జిల్లా రవాణా శాఖాధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

నిబంధనలు పాటించని వాహనాలపై రవాణా శాఖ చర్యలు
- నెల రోజుల్లో రెండు సార్లు స్పెషల్ డ్రైవ్
- ఈ నెల ఒకటి నుంచి అమలులో..
- ఇప్పటి వరకు 44 కేసులు నమోదు
- రూ.97,480 జరిమానా
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో నిబంధనలు పాటించని వాహనాలను గుర్తించేందుకు రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. ప్రధానంగా రాయి క్వారీల నుంచి కంకర, బండరాళ్లను రవాణా చేసే లారీలు, టిప్పర్లు చాలా వరకు కాలం చెల్లినవి (ఫిట్‌నెస్ లేనివి)గా రవాణా శాఖాధికారులకు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్ లేని, నిబంధనలు పాటించని వాహనాలను గుర్తించి, అవసరమైతే సీజ్ చేసేందుకు జిల్లా రవాణా శాఖాధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
జిల్లాలో 1,250 లారీలు, 420 టిప్పర్లు, 580 ట్రాక్టర్లు, 1400 పైచిలుకు ఆటోలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా ప్రతి రోజు క్వారీల నుంచి కంకర, రోడ్డు మెటల్ రవాణా చేస్తుంటాయి. వీటిలో ఎక్కువ సంఖ్యలో భారీ వాహనాలు బండరాళ్లను అనకాపల్లి, వయా ఎలమంచిలి మీదుగా, మరికొన్ని రోలుగుంట, మాకవరపాలెం మీదుగా రాంబిల్లి వైపు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. వందలాది ఇసుక ట్రాకర్లు నిత్యం జాతీయ రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే పరిమితికి మించి విద్యార్థులతో స్కూల్ ఆటోలు తిరుగుతున్నాయి. వీటిపై రవాణా శాఖ దృష్టి పెట్టింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టి కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తోంది. నెలలో రెండు రోజులు ఈ డ్రైవ్ కొనసాగనుంది. ఇప్పటి వరకు 44 కేసులు నమోదు చేసి రూ.97,480 జరిమానా విధించారు. ఎంవీఐలు రమణ, రాజన్న, వెంకటరావు బృందం వాహనాలను తనిఖీ చేసి పర్మిట్ లేకుండా నడుపుతున్న వాటిని సీజ్ చేస్తున్నారు.