Share News

గంజాయిపై ఉక్కుపాదం

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:54 AM

నగరంలోకి గంజాయి రాకుండా అడ్డుకట్ట వేయడంపై పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీ దృష్టిసారించారు.

గంజాయిపై ఉక్కుపాదం

  • సిటీలోకి రాకుండా నియంత్రించేందుకు చెక్‌పోస్ట్‌లు

  • ఎనిమిది చోట్ల ఏర్పాటు

  • మూడు షిఫ్టుల్లో నిరంతర తనిఖీలు

  • వాటికి అనుబంధంగా రెండు మొబైల్‌ చెక్‌పోస్ట్‌లు

  • గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు మరికొన్ని చెక్‌పోస్టులను ఏర్పాటుచేసే ఆలోచన ఉందన్న పోలీస్‌ కమిషనర్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలోకి గంజాయి రాకుండా అడ్డుకట్ట వేయడంపై పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీ దృష్టిసారించారు. అందుకోసం శివారు ప్రాంతాలతో పాటు సిటీలో చెక్‌పోస్టులు ఏర్పాటుచేయించారు. అక్కడ నిరంతర తనిఖీలు నిర్వహించేలా మూడు షిఫ్టుల్లో (ముగ్గురు నుంచి నలుగురు) సిబ్బందిని నియమించారు. ఒకవేళ వారి నుంచి ఎవరైనా తప్పించుకున్నా వెంటపడి పట్టుకునేలా రెండు ప్రత్యేక లార్కింగ్‌ (మొబైల్‌) చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు.

నగరంలో గంజాయి వినియోగం పెరిగిపోయింది. ఆ మత్తులో కొందరు దాడులు, హత్యలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీనివల్ల నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. నగరంలో గంజాయి దొరకుండా చేయగలిగితే నేరాలు గణనీయంగా తగ్గుతాయని సీపీ భావిస్తున్నారు. ఏజెన్సీతోపాటు ఒడిశా నుంచి నగరానికి గంజాయి చేరుతున్నందున ఆయా మార్గాల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటుచేయాలనే నిర్ణయించారు. వాహనాలను నగర శివార్లలో ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేయగలిగితే 80 శాతం గంజాయిని నగరంలోకి రాకుండా నియంత్రించవచ్చునని అంచనా వేశారు. అనుకున్నదే తడవుగా నగరశివారు ప్రాంతాలైన ఆనందపురం, భీమిలి వద్ద ఉన్న చెక్‌పోస్టులను బలోపేతం చేయడంతోపాటు కొత్తగా మరికొన్ని చెక్‌పోస్ట్‌లను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని గుర్తించి వెంటనే వాటిని ప్రారంభించారు. అరకు వైపు నుంచి నగరంలోకి గంజాయి రవాణా జరుగుతున్నందున పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సరిపల్లి వద్ద చెక్‌పోస్ట్‌ను ఏర్పాటుచేశారు. అలాగే పాడేరు నుంచి సబ్బవరం మీదుగా నగరంలోకి గంజాయి రవాణా అవుతుండడంతో పినగాడి వద్ద చెక్‌పోస్ట్‌ ఏర్పాటుచేశారు. కూర్మన్నపాలెం, స్టీల్‌ప్లాంటు, ఆనందపురం, తగరపువలస, రైల్వేస్టేషన్‌, ద్వారకా బస్‌స్టేషన్‌ వద్ద చెక్‌పోస్ట్‌లను ఏర్పాటుచేశారు. ప్రతి చెక్‌పోస్ట్‌ వద్ద ముగ్గురు లేదా నలుగురు సిబ్బంది ఉంటూ అన్ని ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, కార్లు, వ్యాన్‌లు, బైక్‌లతోపాటు అన్ని రకాల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఒకవేళ అక్కడ పోలీసులను చూసి ఎవరైనా వాహనం ఆపకుండా ముందుకువెళ్లిపోతే వారిని పట్టుకునేందుకు వీలుగా రెండు ప్రత్యేక లార్కింగ్‌ (మొబైల్‌) చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. ఆయా చెక్‌పోస్టుల వద్ద మూడు షిఫ్టుల్లో నిరంతరం పనిచేసేలా సిబ్బందిని నియమించారు. దీంతో నగరంలోకి గంజాయి రవాణా తగ్గుతుందని ఆశిస్తున్నట్టు సీపీ శంఖబ్రతబాగ్చి వివరించారు. గంజాయి రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు మరికొన్ని చెక్‌పోస్టులను కూడా ఏర్పాటుచేసే ఆలోచన ఉందని, సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతానికి వేచిచూస్తున్నామన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:54 AM