Share News

పరీక్షల నిర్వహణలో వినూత్న ప్రయోగం

ABN , Publish Date - Aug 07 , 2025 | 01:19 AM

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే పరీక్షల్లో కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం జవాబు పత్రాలను విడిగా రాసి అందిస్తుండడంతో మూల్యాంకనం అనంతరం వాటిని పక్కన పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుక్‌లెట్‌ అందించి, అందులోనే సమాధానాలు రాసేవిధంగా మార్పుచేశారు. దీంతో విద్యార్థి ప్రతిభ, సామర్థ్యం అంచనా వేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

పరీక్షల నిర్వహణలో  వినూత్న ప్రయోగం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు

అందుబాటులోకి అసెస్‌మెంట్‌ పుస్తకాలు

వాటిలోనే జవాబులు రాసేందుకు వీలు

జిల్లాకు చేరిన 60 శాతం పుస్తకాలు

విద్యార్థి ప్రతిభ, సామర్థ్యం తెలుసుకునే అవకాశం

ఈనెల 11 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు

విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే పరీక్షల్లో కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం జవాబు పత్రాలను విడిగా రాసి అందిస్తుండడంతో మూల్యాంకనం అనంతరం వాటిని పక్కన పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుక్‌లెట్‌ అందించి, అందులోనే సమాధానాలు రాసేవిధంగా మార్పుచేశారు. దీంతో విద్యార్థి ప్రతిభ, సామర్థ్యం అంచనా వేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

పాఠశాల విద్యార్థులకు నిర్వహించే ఫార్మేటివ్‌ నుంచి సమ్మేటివ్‌ పరీక్షల వరకు తెల్లకాగితాలపై జవాబులు రాసే విధానానికి విద్యా శాఖ స్వస్తి పలికింది. ఏడాది పొడవునా పరీక్షలు రాసేందుకు వీలుగా అసెస్‌మెంట్‌ బుక్‌లెట్‌ రూపొందించింది. ఈనెల 11వ తేదీ నుంచి ఫార్మేటివ్‌-1 పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అసెస్‌మెంట్‌ బుక్‌లెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి విద్యాసంవత్సరంలో విద్యార్థులకు నాలుగు ఫార్మేటివ్‌, రెండు సమ్మేటివ్‌ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ప్రతి పరీక్షకు సంబంధించి విద్యార్థులు రాసే జవాబుపత్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి మూలనపడేస్తుంటారు. దీంతో అవసరమైన సందర్భంలో విద్యార్థి ప్రతిభ, సామర్థ్యం తెలుసుకునే వీలుండడం లేదు. ఈ నేపథ్యంలో ఉచితంగా అందజేసే అసెస్‌మెంట్‌ బుక్‌లెట్‌ విద్యార్థి ప్రతిభకు ప్రామాణికంగా నిలుస్తుందని ప్రభుత్వం భావించింది. ప్రతి సబ్జెక్టుకు ఒక అసెస్‌మెంట్‌ బుక్‌లెట్‌ను సరఫరా చేస్తోంది.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 75 వేల మంది చదువుతున్నారు. ఒకటి, రెండు తరగతులకు మూడు సబ్జెక్టులు, 3,4,5 తరగతులకు నాలుగు, ఆరు, ఏడు తరగతులకు ఆరు, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఏడు సబ్జెక్టులు బోధిస్తున్నారు. ఈ మేరకు ఉచితంగా అసెస్‌మెంట్‌ పుస్తకాలు అందజేస్తారు. పరీక్ష ముగిసిన తరువాత సబ్జెక్టు టీచరు దానిని మూల్యాంకనం చేస్తారు. అసెస్‌మెంట్‌ పుస్తకాలు సబ్జెక్టు టీచర్ల వద్దనే ఉంటాయి. పరీక్షల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యం అంచనా వేసేందుకు ఇవి దోహదపడతాయని జిల్లా పరీక్షల బోర్డు కార్యదర్శి ఎంవీ కృష్ణకుమార్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఇండెంట్‌లో 60 శాతం సరఫరా చేశారని, మిగిలినవి ఒకటి, రెండు రోజుల్లో వస్తాయన్నారు.

Updated Date - Aug 07 , 2025 | 01:19 AM