బియ్యం కార్డుల్లో మార్పులు, చేర్పులకు దరఖాస్తుల వెల్లువ
ABN , Publish Date - May 29 , 2025 | 01:35 AM
బియ్యం కార్డుల్లో మార్పులు, చేర్పులకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి బుధవారం నాటికి 23,193 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొత్తగా సభ్యులుగా చేరిక (ఇప్పటికే ఉన్న కార్డుల్లో) కోసం అత్యధికంగా 16,310 మంది దరఖాస్తు చేశారు.
ఇప్పటివరకూ 23,193 రాక
ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్ల నమోదుకు 16,310 మంది దరఖాస్తు
కొత్త కార్డుల కోసం 2,471 మంది, కార్డు విభజనకు 1,684 మంది..
అనాథాశ్రమంలోని వృద్ధులూ కార్డు కోసం
దరఖాస్తు చేసుకోవచ్చు: జేసీ మయూర్ అశోక్
విశాఖపట్నం, మే 28 (ఆంధ్రజ్యోతి):
బియ్యం కార్డుల్లో మార్పులు, చేర్పులకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి బుధవారం నాటికి 23,193 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొత్తగా సభ్యులుగా చేరిక (ఇప్పటికే ఉన్న కార్డుల్లో) కోసం అత్యధికంగా 16,310 మంది దరఖాస్తు చేశారు. అలాగే కొత్తగా బియ్యం కార్డు కోసం 2,471 మంది, కుటుంబంలో కొంతమంది వేరు కాపురం పెట్టడంతో పాత కార్డులో తమ పేర్లు తీసి కొత్తగా కార్డు ఇవ్వాలంటూ 1,684 మంది, కార్డు నుంచి సభ్యుల పేర్లను తొలగించాలంటూ 1,222 మంది, చిరునామా మార్పు కోసం 948 మంది, ఆధార్ నంబర్‌తో బియ్యం కార్డుకు అనుసంధానంలో తప్పుల సవరణకు 508 మంది, రేషన్ దుకాణాల రెన్యువల్‌కు 45 మంది, కార్డు సరండర్ చేస్తామని ఐదుగురు దరఖాస్తు చేశారు. దరఖాస్తుల స్వీకరణకు ఇంకా గడువు ఉన్నందున భారీగా వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
అనాథాశ్రమంలో వృద్ధులకు బియ్యం కార్డు: జేసీ మయూర్ అశోక్
బియ్యం కార్డులో మార్పులు, చేర్పులకు సంబంధించి జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ పలు సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. అనాథాశ్రమంలో ఉండే వృద్ధులు కొత్తగా బియ్యం కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. అదేవిధంగా కొత్త కార్డుకు ఈకేవైసీ పూర్తి చేసుకున్నవారు మరోసారి దరఖాస్తు చేయనవసరం లేదని పేర్కొన్నారు. వచ్చేనెలలో క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్‌కార్డులు లబ్ధిదారుల ఇళ్లకు పంపడం జరుగుతుందన్నారు. వివాహమైనా, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు కార్డు నుంచి తొలగించే ఆప్షన్ అందుబాటులోకి వచ్చిందన్నారు. 15 ఏళ్లు దాటిన పిల్లలను కార్డులో చేర్చవచ్చునని, ప్రభుత్వ పింఛన్ తీసుకుంటే కార్డుకు అర్హులు కారని, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగం చేస్తూ నెలకు నగరంలో రూ.12 వేలు, గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు జీతం వస్తే కుటుంబం మొత్తం కార్డు పొందేందుకు అర్హులుకారని ఆయన పేర్కొన్నారు. అలాగే నాలుగు చక్రాల వాహనం కలిగివుండడం, మూడెకరాల పల్లపు భూమి, మొత్తం 10 ఎకరాల భూమి కలిగివుంటే ఆ కార్డుదారుని అనర్హులుగా పరిగణించడం జరుగుతుందన్నారు.