ఉత్సాహంగా తొలి అడుగు
ABN , Publish Date - Jul 03 , 2025 | 01:16 AM
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం బుధవారం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఉత్సాహంగా ప్రారంభమైంది.
ఏడాది పాలనపై టీడీపీ ప్రచారం
ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు,
అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించిన నేతలు
దక్షిణ నియోజకవర్గంలో ఎంపీ,
గాజువాకలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా హాజరు
తూర్పు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ప్రారంభం
విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి):
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం బుధవారం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఉత్సాహంగా ప్రారంభమైంది. ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు అందరూ పాల్గొని ఏడాదిలో ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా సామాజిక పింఛన్లు రూ.నాలుగు వేలకు పెంపు, ఏడాదికి మూడు ఉచిత సిలెండర్లు, మత్స్యకారులకు ఆర్థిక సాయం, తల్లికి వందనం, శాంతి భద్రతలు మెరుగు, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు వంటి వాటిపై ఇంటింటికీ వెళ్లి ప్రజలకు తెలియపరచారు. దక్షిణ నియోజకవర్గంలోని 35వ వార్డులో జరిగిన కార్యక్రమంలో ఎంపీ ఎం.శ్రీభరత్ పాల్గొన్నారు. ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వార్డు నాయకులకు సూచించారు. భీమిలి నియోజకవర్గంలోని అన్నవరం, ఎర్రయ్యపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. రెండు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, అభివృద్ధి గురించి వివరించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం అందలేదని మహిళ ఒకరు ఫిర్యాదుచేయగా...అందుకు కారణాలు తెలుసుకుని సమస్య పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 56వ వార్డు పైడిమాంబ కాలనీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జీవీఎంసీ 67వ వార్డులో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడాది పాలనపై ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ హయాంలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని, దానిని గాడిలో పెట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం శ్రమిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. గాజువాక భూ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని, విశాఖ స్టీల్‌ప్లాంటును పరిరక్షించామని అన్నారు. స్టీల్‌ప్లాంటు, గంగవరం పోర్టు, ఏపీఐఐసీ నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఇతర నాయకులు 51వ వార్డు పరిధిలోని మాధవధారలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని పరవాడలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్‌సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అమలుతో అన్ని వర్గాలకు చేయూత లభించిందన్నారు. తూర్పు నియోజవర్గంలో మాత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానున్నది.