గంజాయిపై డేగ కన్ను
ABN , Publish Date - May 23 , 2025 | 11:07 PM
పాడేరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో గత రెండు రోజుల్లో రూ.37.5 లక్షల విలువైన 750 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ షేక్ షాహబాద్ అహ్మద్ తెలిపారు.
750 కిలోల గంజాయి స్వాధీనం
రెండు కేసుల్లో నలుగురి అరెస్టు
మరికొంతమంది పరారీ
ఇన్నోవా కారు, ఆటో సీజ్, 4 సెల్‌ఫోన్‌లు సీజ్
డీఎస్పీ షేక్ షాహబాద్ అహ్మద్
పాడేరురూరల్/ముంచంగిపుట్టు, మే 23(ఆంధ్రజ్యోతి):
పాడేరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో గత రెండు రోజుల్లో రూ.37.5 లక్షల విలువైన 750 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ షేక్ షాహబాద్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఇన్నోవా కారు, ఆటో, 4 సెల్‌ఫోన్‌లు, రూ. వెయ్యి నగదును సీజ్ చేసినట్టు చెప్పారు. డివిజన్‌లో గంజాయి రవాణాదారులపై గట్టి నిఘా పెట్టామన్నారు. అందులో భాగంగానే ముంచంగిపుట్టు ఎస్‌ఐ కె.రామకృష్ణకు ముందుగా అందిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు జంక్షన్ వద్ద వాహన తనిఖీలను నిర్వహిస్తున్నారు. అటుగా వస్తున్న ఆటోను తనిఖీ చేయగా 12 గోనె సంచుల్లో 350 కిలోల గంజాయిని గుర్తించారు. ఆటోలో ఉన్న ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ తుమిడిపుట్టు గ్రామానికి చెందిన గొల్లూరి సోమనాథ్(29), బరడ పంచాయతీ సొలగంపుట్టుకు చెందిన సుకేరి గాసీరాం(23)లను అరెస్టు చేశారన్నారు. ఈ కేసులో కోరాపుట్టు జిల్లా మాచ్‌ఖండ్ బ్లాక్ జోలాపుట్టు ఆర్‌ఎఫ్‌కు చెందిన తునా నాయక్(42), ముంచంగిపుట్టు మండలం బరడ పంచాయతీ అంటాబొంగు గ్రామానికి చెందిన కిల్లో గోపాల్, సొలగంపుట్టు గ్రామానికి చెందిన కిముడు ధనుర్జయ్ పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ షేక్ షాహబాద్ అహ్మద్ అన్నారు. ఈ తనిఖీల్లో ఏఎస్‌ఐ కె.లక్ష్మయ్య, హెచ్‌సీలు ఎస్‌జే.ముకుందం, కేఆర్‌కే.పడాల్, సిబ్బంది కె.వెంకటరావు, కె.మోహన్‌దాస్, ఎం.శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారన్నారు.
అదేవిధంగా పెదబయలు ఎస్‌ఐ కె.రమణకు అందిన ముందస్తు సమాచారం మేరకు బుధవారం సీతగుంట సమీపంలోని ప్రధాన రహదారిపై సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అటుగా వచ్చిన ఇన్నోవా కారును నిలిపి తనిఖీ చేయగా అందులో 400 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించామని డీఎస్పీ షేక్ షాహబాద్ అహ్మద్ తెలిపారు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మలసిరీస్ మండలం మండపే గ్రామానికి చెందిన కారు డ్రైవర్ పీసె.అక్షయ్(24), ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ ముక్కిపుట్టుకి చెందిన ముల్జంగి రామలింగం(41)లను అరెస్టు చేశారన్నారు. ఈ కేసులో నిందితులైన ముల్జంగి ఈశ్వరరావు(30), ఒడిశా మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పంచాయతీ బొడపొదర్‌కి చెందిన మొద్దు గొల్లోరి (35) పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఈ తనిఖీల్లో సిబ్బంది ఎం.వెంకటరావు, ఆర్.రమేష్, టి.కేశవరావు పాల్గొన్నారన్నారు. గంజాయిని పట్టుకున్న రెండు స్టేషన్ల సిబ్బందిని అభినందించిన ఆయన త్వరలో వారికి రివార్డులు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో జి.మాడుగుల సీఐ బి.శ్రీనివాసరావు, పెదబయలు ఎస్‌ఐ కె.రమణ, ముంచంగిపుట్టు ఎస్‌ఐ కె.రామకృష్ణ, హుకుంపేట సీఐ సన్యాసినాయుడు, పాడేరు ఎస్‌ఐ ఎల్.సురేష్ పాల్గొన్నారు.