నవజాత శిశువులకు రక్ష
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:28 AM
అనారోగ్య సమస్యలతో జన్మించే శిశువుల సంఖ్య పెరుగుతోంది.
ఘోషా ఆస్పత్రిలో 20 వార్మర్స్ ద్వారా వైద్య సేవలు
బరువు తక్కువగా ఉండే చిన్నారులకు, ప్రీ మెచ్యుర్ శిశువులకు, జన్యుపరమైన సమస్యలతో పుట్టే వారికి చికిత్స
అయితే చిన్న పిల్లల వైద్య నిపుణులు లేకపోవడంతో ఇబ్బందులు
విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి):
అనారోగ్య సమస్యలతో జన్మించే శిశువుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అటువంటి చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై ఘోషా ఆస్పత్రి అధికారులు దృష్టిసారించారు. ఇందుకోసం నవజాత శిశువుల సంరక్షణ కేంద్రంలో 20 బేబీ వార్మర్స్‌ను ఏర్పాటుచేశారు.
ఈ చిన్నారులకు వైద్యం..
నవజాత శిశువుల సంరక్షణ కేంద్రంలో 20 వార్మర్స్ అందుబాటులో ఉన్నాయి. బరువు తక్కువగా ఉండే చిన్నారులకు, ప్రీ మెచ్యుర్ శిశువులకు, జన్యుపరమైన సమస్యలతో పుట్టే వారికి అంటే గుండెలో రంధ్రాలు, ఇతర ఇబ్బందులు, ఉమ్మనీరు తాగేయడం, పచ్చకామెర్లు, ఫిట్స్, ఇతర ఇన్‌ఫెక్షన్లకు గురైన చిన్నారులకు అక్కడ చికిత్స అందిస్తారు. యాంటీ బయాటిక్స్, ఆక్సిజన్ వంటివి అందించడం ద్వారా వారు కోలుకునేలా చేస్తారు. సమస్యను బట్టి ఐదు నుంచి 15 రోజులు వార్మర్స్‌లో ఉంచుతారు.
వైద్యుల కొరత
నేషనల్ హెల్త్ మెషీన్ ప్రోగ్రామ్‌లో భాగంగా నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రంలో చేరే చిన్నారులకు వైద్యం అందించేందుకు నలుగురు చిన్న పిల్లల వైద్యులు అందుబాటులో ఉండాలి. అయితే, ఒక్కరు కూడా లేరు. ఆస్పత్రిలో ఫ్యామిలీ ప్లానింగ్ విభాగానికి చెందిన డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ ప్రస్తుతం ఎస్‌ఎన్‌సీయూ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఆయనతోపాటు కేజీహెచ్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు నవజాత శిశువులకు సేవలు అందిస్తున్నారు. అయితే, పూర్తిస్థాయి చిన్న పిల్లల వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడంతో కొన్నిరకాల ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నలుగురు వైద్యులను కేటాయించాలని అధికారులు కోరుతున్నారు.
నాణ్యమైన వైద్య సేవలతో కోలుకునేలా
- డాక్టర్ ఎస్.చంద్రశేఖర్, చిన్న పిల్లల వైద్య నిపుణులు, ఘోష ఆస్పత్రి
నవజాత శిశువుల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు ప్రత్యేకంగా ఎస్‌ఎన్‌యూసీ ఉంది. ఇక్కడ 20 వార్మర్స్‌తో సేవలు అందిస్తున్నాం. చిన్నపిల్లల వైద్య నిపుణులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పూర్తిస్థాయి చిన్న పిల్లల వైద్య నిపుణులను కేటాయిస్తే మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ కనీసం 10 నుంచి 15 మంది చిన్నారులు నవజాత శిశువుల సంరక్షణ కేంద్రంలో ఉంటున్నారు. పిల్లలు పూర్తిగా కోలుకున్న తరువాత వ్యాక్సినేషన్ చేయించి డిశ్చార్జ్ చేస్తున్నాం.