Share News

కోట్లకు పడగలు

ABN , Publish Date - Dec 24 , 2025 | 01:33 AM

సూపర్‌ బజార్‌ కార్యాలయం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ మోహన్‌రావు, మరో ఇద్దరు సిబ్బంది ఇళ్లలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.

కోట్లకు పడగలు

సబ్‌ రిజిస్ట్రార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌ల ఇంట్లో ఏసీబీ సోదాలు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నట్టు గుర్తింపు

సబ్‌ రిజిస్ర్టార్‌ ఇంట్లో డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం

జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌ ఇళ్లలో రూ.కోటి విలువైన ఆస్తుల గుర్తింపు

విశాఖపట్నం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):

సూపర్‌ బజార్‌ కార్యాలయం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ మోహన్‌రావు, మరో ఇద్దరు సిబ్బంది ఇళ్లలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. గత నెల 5, 6 తేదీల్లో ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు సూపర్‌ బజార్‌, మధురవాడ, పెదగంట్యాడ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఆ సమయంలో సూపర్‌ బజార్‌ కార్యాలయంలో రూ.10 వేల నగదు లభ్యమైంది. అది ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చిందనే ఆధారాలు లభించలేదు. మిగిలిన కార్యాలయాల్లో ఏమి దొరికిందో ఏసీబీ వెల్లడించలేదు. దాదాపు 45 రోజులు కావడంతో వాటిని అంతా మరిచిపోయారు. ఇప్పుడు ఏసీబీ అధికారులు విశాఖతో పాటు భోగాపురం, ఇంకా రాష్ట్రంలో మరికొన్ని కార్యాలయాలకు సంబంధించిన సిబ్బంది ఇళ్లలో మంగళవారం సోదాలు చేపట్టారు. సూపర్‌ బజారు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ మోహన్‌రావు, జూనియర్‌ అసిస్టెంట్‌ సుధారాణి, అటెండర్‌ ఆనంద్‌కుమార్‌ ఇళ్లలో సోదాలు జరిగాయి. మోహన్‌రావు రామ్‌నగర్‌లోని శారదా టవర్స్‌లో ఉంటున్నారు. ఆయన ఇంట్లో ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన పత్రాలు గుర్తించినట్టు ఏసీబీ అధికారులు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా నగదు, బంగారు ఆభరణాలు, వాహనాలు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు.కేర్‌ ఆస్పత్రి సమీపాన ఉంటున్న జూనియర్‌ అసిస్టెంట్‌ సుధారాణి, పూర్ణామార్కెట్‌ ప్రాంతంలో ఉంటున్న అటెండర్‌ ఆనంద్‌కుమార్‌ ఇళ్లలో చెరో కోటి రూపాయల విలువైన ఆస్తులు గుర్తించినట్టు ప్రకటించారు. వీటిపై విచారణ కొనసాగుతుందని ప్రకటించారు.

Updated Date - Dec 24 , 2025 | 01:33 AM