Share News

పురావస్తు శాఖ ఆధీనంలో అల్లూరి సమాధి

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:51 AM

గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని అల్లూరి సీతారామరాజు, గంటందొర సమాధులు పురావస్తు శాఖ ఆధీనంలో ఉందన్న సమాచారం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సమాధులు పురావస్తు, చారిత్రాత్మక చిహ్నాలుగా గుర్తించిన విషయం 13 ఏళ్ల తరువాత వెలుగులోకి రావడం శోచనీయం.

పురావస్తు శాఖ ఆధీనంలో  అల్లూరి సమాధి
కృష్ణాదేవిపేటలోని అల్లూరి సీతారామరాజు, గంటందొర సమాధులు

గంటందొర సమాఽధి కూడా...

13 ఏళ్ల తరువాత వెలుగులోకి..

2012లోనే పురావస్తు, చారిత్రాత్మక చిహ్నాలుగా గెజిట్‌ నోటిఫికేషన్‌

ఉమ్మడి రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ చందనఖాన్‌ ఉత్తర్వులు

అప్పట్లో విశాఖపట్నం కలెక్టర్‌కు జీవో కాపీ

ఇప్పటివరకూ వెలుగు చూడని వైనం

నర్సీపట్నం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని అల్లూరి సీతారామరాజు, గంటందొర సమాధులు పురావస్తు శాఖ ఆధీనంలో ఉందన్న సమాచారం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సమాధులు పురావస్తు, చారిత్రాత్మక చిహ్నాలుగా గుర్తించిన విషయం 13 ఏళ్ల తరువాత వెలుగులోకి రావడం శోచనీయం. కేంద్ర, రాష్ట్ర స్థాయి మంత్రులు, ఎంపీలు, కలెక్టర్లు... ఇలా ఎంతోమంది ఉన్నతాధికారులు కృష్ణాదేవిపేటలో ఉన్న అల్లూరి పార్కును సందర్శిస్తున్నారు.. ఎన్నో పర్యాయాలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతున్నారు. అయితే అల్లూరి, గంటందొర సమాధులు పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నట్టు ఏనాడూ ఎవరూ ప్రకటించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు, గంటందొర సమాధులను రక్షిత స్మారక చిహ్నంగా గుర్తించాలన్న ఉద్దేశంతో 2011 జనవరి 22న జీవో ఎంఎస్‌-18 విడుదల చేసి, సమాధుల స్థలాన్ని రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించింది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే రెండు నెలల్లోగా తెలియజేయాలని కోరింది. అయితే ఇందుకు సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు రాలేదు. ఈ నేపథ్యంలో అల్లూరి, గంటందొర సమాధులను పురావస్తు, చారిత్రాత్మక స్మారక చిహ్నలుగా ప్రకటిస్తూ 2012లో తుది జీవోను అప్పటి ప్రిన్సిపల్‌ సెక్రటరీ చందనఖాన్‌ విడుదల చేశారు. ఇందులో సర్వే నంబర్‌ 120/38లో 0.85 ఎకరాలు, 129/బీలో 0.43 సెంట్ల స్థలాన్ని కలిపి మొత్తం 1.28 ఎకరాల విస్తీర్ణంలో సమాధులు ఉన్నట్టు పేర్కొన్నారు. అల్లూరి పార్కు సరిహద్దులను కూడా జీవోలో స్పష్టంగా తెలియజేశారు. అప్పటినుంచి పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. వాస్తవంగా పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ప్రదేశాల సంరక్షణ బాధ్యత ఆ శాఖ అధికారులే చూసుకుంటారు. సదరు ఉత్తర్వుల కాపీని అప్పటి విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌కు కూడా పంపారు. పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలలో ఎటుంటి అభివృద్ధి పనులు జరపాలన్నా ఆ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలి. పురాతన కట్టడాలు, కళాఖండాలు, ఇతర చారిత్రాత్మక అవేశేషాలను పరిరక్షించి, వాటిని భవిష్యత్త తరాల కోసం భద్రపరచడం పురావస్తు శాఖ ముఖ్యమైన విధి. అయితే ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధులు పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న విషయం ఎవరికీ తెలియదు. రెండు రోజులు క్రితం నర్సీపట్నం మెయిన్‌ రోడ్డులో ఉన్న బ్రిటీష్‌ అధికారులు సమాధుల స్థలాన్ని న్యాయమూర్తి షియాజ్‌ఖాన్‌ పరిశీలించడానికి వచ్చినప్పుడు ఆయన వెంట పురావస్తుశాఖ ఏడీ కూడా ఉన్నారు. ఆయనే మాటల సందర్భంగా అల్లూరి, గంటందొర సమాధులు పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నట్టు వెల్లడించారు. ఆయన చెప్పేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.

Updated Date - Jul 13 , 2025 | 12:51 AM