Share News

అల్లూరి పార్కుకు సొబగులు

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:21 AM

స్థానిక అల్లూరి పార్కు కొత్త అందాలను సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకుంది. గత వైసీపీ పాలనలో మంత్రులు రూ.1.5 కోట్ల నిధులు ప్రకటించారే తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చొరవతో పార్కుకు మహర్దశ పట్టింది.

అల్లూరి పార్కుకు సొబగులు
తాజాగా అభివృద్ధి చేసిన తరువాత ఇలా..

- స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చొరవతో పూర్తి స్థాయిలో అభివృద్ధి

- అల్లూరి, గంటందొర సమాధుల మందిరానికి మరమ్మతులు

- సీతారామరాజు విగ్రహానికి మెరుగులు

- నాలుగు పగోడాల పునర్నిర్మాణం

- విద్యుద్దీప కాంతులతో పార్కు కళకళ

- గత వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యం

- నిర్వహణపై దృష్టి పెట్టని వైనం

- తాజాగా చేపట్టిన అభివృద్ధి పట్ల సందర్శకుల హర్షం

కృష్ణాదేవిపేట, జూలై 3 (ఆంధ్రజ్యోతి): స్థానిక అల్లూరి పార్కు కొత్త అందాలను సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకుంది. గత వైసీపీ పాలనలో మంత్రులు రూ.1.5 కోట్ల నిధులు ప్రకటించారే తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చొరవతో పార్కుకు మహర్దశ పట్టింది.

గత వైసీపీ ప్రభుత్వం అల్లూరి పార్కును నిర్లక్ష్యం చేయడంతో పరిస్థితి దారుణంగా ఉండేది. అల్లూరి, గంటందొర సమాధుల మందిరం బీటలువారి, రంగులు వెలిసిపోయి కళావిహీనంగా ఉండేది. అల్లూరి కాంస్య విగ్రహం నిర్వహణను కూడా పట్టించుకోలేదు. పార్కులోని నడక దారిలో టైల్స్‌ శిథిలమయ్యాయి. సందర్శకులు సేదతీరడానికి ఏర్పాటు చేసిన పగోడాలు ధ్వంసమయ్యాయి. నిర్వహణ దారుణంగా ఉండడంతో సందర్శకులు ఇబ్బంది పడేవారు.

అయ్యన్న చొరవతో..

కూటమి ప్రభుత్వం వచ్చాక స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ పార్కుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన సూచన మేరకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, రాజ్యసభ సభ్యుడు మస్తాన్‌రావు చెరో రూ.10 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో పార్కులో అభివృద్ధి పనులు చేపట్టారు. అల్లూరి, గంటందొర సమాధుల మందిరానికి మరమ్మతులు చేపట్టారు. రంగులు వేసి అందంగా తయారు చేశారు. అలాగే అల్లూరి కాంస్య విగ్రహానికి మెరుగులు దిద్దారు. ప్రహరీ గోడలు, భవనాలకు రంగులు వేయించారు. పార్కులో శిథిలమైన టైల్స్‌ను తొలగించి కొత్తవి వేశారు. పలు చోట్ల సోలార్‌, ఇతర విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. ధ్వంసమైన నాలుగు పగోడాలను తొలగించి కొత్తవి నిర్మించారు. 400 జాతుల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. తాజాగా ఈ పార్కును సందర్శించిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:21 AM