Share News

లక్కీడ్రా ద్వారా బార్‌ల కేటాయింపు

ABN , Publish Date - Aug 18 , 2025 | 11:43 PM

మూడేళ్ల కాలపరిమితితో జిల్లాలో నూతన బార్‌ పాలసీని అమలు చేయనున్నామని, ఇందులో భాగంగా జిల్లాలో నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల పరిధిలో మూడు బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖాధికారి సుధీర్‌ తెలిపారు.

లక్కీడ్రా ద్వారా బార్‌ల కేటాయింపు
మాట్లాడుతున్న వి.సుధీర్‌

జిల్లాలో మూడు బార్లకు దరఖాస్తుల స్వీకరణ

జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖాధికారి సుధీర్‌

అనకాపల్లి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మూడేళ్ల కాలపరిమితితో జిల్లాలో నూతన బార్‌ పాలసీని అమలు చేయనున్నామని, ఇందులో భాగంగా జిల్లాలో నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల పరిధిలో మూడు బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖాధికారి సుధీర్‌ తెలిపారు. కొత్త బార్‌ పాలసీపై ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో ఆయన అనకాపల్లి కొప్పాకలోని జిల్లా కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 సెప్టెంబరు 1 నుంచి 2028 సెప్టెంబరు 1 వరకు వచ్చే మూడేళ్ల పాటు కొత్త బార్‌ పాలసీ అమలులో ఉంటుందని తెలిపారు. గతంలో వేలం పాటల ద్వారా బార్లను కేటాయించగా, ప్రభుత్వం ఈసారి లాటరీ పద్ధతిన బార్లను కేటాయించనుందని పేర్కొన్నారు. జిల్లాలో నర్సీపట్నంలో 2, ఎలమంచిలి మునిసిపాలిటీ పరిధిలో 1.. మొత్తం మూడు కొత్త బార్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ప్రస్తుతం బార్లు రాత్రి 11 గంటలు వరకు మాత్రమే తెరిచి ఉండేవని, ప్రభుత్వ కొత్త బార్ల పాలసీ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు తెరుచుకొనే వెసులుబాటు కల్పించిందన్నారు. బార్ల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకొనేవారు 50 వేలు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 5 లక్షలలోపు జనాభా ఉండే ప్రాంతంలో రూ.55 లక్షలు, 5 లక్షలపైగా జనాభా ఉండే ప్రాంతాల్లో అయితే రూ.75 లక్షలు చొప్పున బార్ల లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. గతంలో లైసెన్స్‌ ఫీజు ప్రతి ఏడాది ఆగస్టు నెలలో మొత్తం ఒకేసారి చెల్లించాలనే నిబంధన ఉండేదని, కొత్త పాలసీ ప్రకారం బార్‌ పొందిన వ్యక్తి ఆరు విడతలుగా ఏడాదిలో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఏడాది పది శాతం లైసెన్స్‌ ఫీజు పెరుగుతుందని, లక్కీ డ్రాలో పాల్గొనే దరఖాస్తుదారుడు రూ.5 లక్షలు చెల్లించాలని తెలిపారు. ఒక బార్‌ ఏర్పాటు కోసం కనీసం 4 దరఖాస్తులు తప్పనిసరిగా రావాలన్నారు. అంతకంటే తక్కువ దరఖాస్తులు అందితే మరోసారి దరఖాస్తులు స్వీకరణ కొనసాగిస్తామన్నారు. కలెక్టర్‌ సమక్షంలో లక్కీడ్రా తెరిచి ఎంపిక చేస్తామని తెలిపారు. గతంలో బార్‌ లైసెన్స్‌ పొందాలంటే సంబంధిత వ్యక్తికి ముందుగానే రెస్టారెంట్‌ లైసెన్స్‌ ఉండాలనే నిబంధన ఉండేదని, కొత్త పాలసీ ప్రకారం బార్‌ లైసెన్స్‌ లక్కీ డ్రాద్వారా పొందిన వ్యక్తి 15 రోజుల గడువులోగా రెస్టారెంట్‌ లైసెన్స్‌ అనుమతి పత్రాలు సమర్పించే వెసులుబాటు కల్పించారని తెలిపారు. సోమవారం నుంచి ఆన్‌లైన్‌ విధానంలో లేదా ఆఫ్‌లైన్‌ విధానంలో ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు బార్ల ఏర్పాటు కోసం దరఖాస్తుల స్వీకరిస్తామని చెప్పారు. ఈ నెల 28వ తేదీన కలెక్టర్‌ సమక్షంలో లక్కీడ్రా తీస్తామని, సెప్టెంబరు 1 నుంచి కొత్త బార్‌లు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు.

Updated Date - Aug 18 , 2025 | 11:43 PM