Share News

అర్ధరాత్రి వేళా చలానాల యావే!

ABN , Publish Date - Nov 25 , 2025 | 01:26 AM

సిటీ పోలీసులు ట్రాఫిక్‌ చలాన్ల వసూళ్ల కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.

అర్ధరాత్రి వేళా చలానాల యావే!

వాహనాలకు అడ్డంపడి ‘ఫోన్‌పే’ ఓపెన్‌ చేయాలని డిమాండ్‌

పోలీసుల తీరుపై నగరవాసులు విస్మయం

విశాఖపట్నం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి):

సిటీ పోలీసులు ట్రాఫిక్‌ చలాన్ల వసూళ్ల కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను ఆపేసి, విషయం ఏమిటో చెప్పకుండా మొబైల్‌ ఫోన్‌లో ‘ఫోన్‌ పే’ యాప్‌ ఓపెన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేనికి అని ప్రశ్నిస్తే...‘ముందు ఓపెన్‌ చేయండి’ అంటూ గదమాయిస్తున్నారు. ఓపెన్‌ చేశాక...పైకి స్ర్కోల్‌ చేయిస్తున్నారు. అక్కడ ‘ఈ-చలాన్‌’ ఐకాన్‌ కనిపిస్తే అందులో ఎన్ని చలాన్లు ఉన్నాయో, వాటికి డబ్బులు అక్కడికక్కడే పే చేయాలని ఒత్తిడి పెడుతున్నారు. ఈ-చలాన్‌ ఐకాన్‌ ఓపెన్‌ కాకపోతే, మీ ఫోన్‌ అప్‌డేట్‌ కాలేదని, వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదంతా పాత చలానాల వసూలు కోసమనే విషయం చెప్పడం లేదు. అసలు...వారి దగ్గర ఉన్న డివైజ్‌లోనే వాహనం నంబర్‌ కొడితే ఎన్ని చలానాలు ఉన్నాయో తెలుస్తుంది. వాటిని చూపించి, కట్టాల్సిందిగా అడగొచ్చు. అలా చేయడం లేదు. వాహన చోదకుడి ఫోన్‌లో ఫోన్‌ పే యాప్‌ ఓపెన్‌ చేయిస్తున్నారు. అర్ధరాత్రి వేళ కూడా పోలీసులు ఇదే పనిలో ఉండడం గమనార్హం.

సీఎం చెప్పినా వినడం లేదు

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలపై ముందు ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆ తరువాత నోటీసులు ఇవ్వాలని సూచించారు. విశాఖపట్నం పోలీసులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఫొటోలు తీసి, చలానాలు పంపడం, వాటి కోసం దారికాయడం చేస్తున్నారు. ఆ చలానాలు కూడా వంద, రెండు వందలో కాదు, వేల రూపాయల్లో ఉంటున్నాయి. నో పార్కింగ్‌ అనేచోట నిలిపి ఉంటే రూ.1,535 చలానా వేస్తున్నారు.

ఫోన్‌ పేలో చెల్లించుకోవచ్చు

ప్రవీణ్‌కుమార్‌, అదనపు పోలీస్‌ కమిషనర్‌, ట్రాఫిక్‌

ఇంతకుముందు చలానాలు ఎంపరివాహన్‌ యాప్‌లో చెల్లించేవారు. కొంత కష్టంగా ఉండేది. అందుకని ఫోన్‌ పే యాప్‌లో చెల్లించే వెసులుబాటు కల్పించాం. ఇది సులువు. అందులోనే చెల్లించాలని కోరుతున్నాం.


విద్యార్థులు, ఉద్యోగులకే ఏయూలోకి ప్రవేశం

ఐడీ కార్డులు ధరించిన వారినే అనుమతిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది

బయట వ్యక్తులకు నో ఎంట్రీ

విశాఖపట్నం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోకి బయట వ్యక్తులు ప్రవేశించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రధాన గేటు ద్వారా ఇతరులు వాహనాలపై రాకపోకలు సాగిస్తున్నారు. అదే సమయంలో వర్సిటీకి సంబంధం లేని వ్యక్తులు రావడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్టు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా బయట వ్యక్తులు వసతి గృహాల్లో విద్యార్థులతో గొడవలు పడుతున్నారు. ఇటువంటి వాటిని కట్టడి చేసేందుకు ఉద్యోగులను, విద్యార్థులను మాత్రమే క్యాంపస్‌లోకి అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఉద్యోగులు, విద్యార్థులు ఇకపై తప్పనిసరిగా ఐడీ కార్డు ధరించి రావాల్సి ఉంటుంది. ఐడీ కార్డును పరిశీలించిన తరువాత మాత్రమే లోపలకు వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది అనుమతి ఇస్తున్నారు. ఒకవేళ ఇతర కళాశాలలకు చెందిన సిబ్బంది ఎవరైనా పనులు నిమిత్తం వచ్చినట్టయితే అధికారుల అనుమతి తీసుకుని మాత్రమే వారిని లోపలకు అనుమతించనున్నారు. ఈ మేరకు సెక్యూరిటీ సిబ్బందికి అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో సోమవారం నుంచి సెక్యూరిటీ సిబ్బంది ఈ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేశారు. ఏయూ ప్రధాన గేటు వద్ద ఐడీ కార్డులను పరిశీలించిన తరువాత లోపలకు అనుమతించారు. అలాగే, అవుట్‌ గేటు వైపు నుంచి ఎవరూ లోపలకు రాకుండా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ నిర్ణయంతో క్యాంపస్‌లో బయటి వారి కార్యకలాపాలకు అడ్డుకట్టే వేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


30న గ్లాస్‌ బ్రిడ్జి ప్రారంభం

విశాఖపట్నం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి):

కైలాసగిరిపై నిర్మించిన గ్లాస్‌ బ్రిడ్జిని ఈ నెల 30వ తేదీన ప్రారంభిస్తున్నట్టు వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోల శ్రీబాలవీరాంజనేయస్వామి, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌లు దీనిని ప్రారంభిస్తారని చెప్పారు. ఇది విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు మరింత అదనపు ఆకర్షణగా నిలుస్తుందన్నారు.


27న ఉక్కు కార్మికుల మహా ధర్నా

ఉత్పత్తి ఆధారిత జీతాల ఉత్తర్వులు ఉపసంహరించుకునే వరకు పోరాటం

అఖిల పక్ష కార్మిక సంఘం నాయకుల ప్రకటన

ఉక్కుటౌన్‌షిప్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి):

ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని ఉక్కు యాజమాన్యం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకునేంత వరకు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని అఖిలపక్ష కార్మిక సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం టౌన్‌షిప్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఇదే విషయమై 27వ తేదీ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్లాంటు పరిపాలనా భవనం ఎదుట మహాధర్నా చేపడతామన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసి ప్లాంటులో పరిస్థితులు వివరించి, ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ కోరతామన్నారు. ఉత్పత్తి ఆధారిత జీతాలతో ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని, యాజమాన్యం పునరాలోచించాలని కోరారు. సమావేశంలో అఖిలపక్ష కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 01:26 AM