టీచర్ పోస్టులన్నీ ఆదివాసీలకే చెందాలి
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:22 AM
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం పాడేరు పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. మెగా డీఎస్సీలో శత శాతం పోస్టులు ఆదివాసీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని, జీవో నంబర్-3పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ నిరుద్యోగ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు గోచీలు ధరించి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం నుంచి ఐటీడీఏ వరకు వినూత్నరీతిలో నిరసన తెలిపారు.
జీవో నంబర్-3పై స్పష్టత ఇవ్వాలి
ఆదివాసీ డీఎస్సీ సాధన కమిటీ డిమాండ్
పాడేరురూరల్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం పాడేరు పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. మెగా డీఎస్సీలో శత శాతం పోస్టులు ఆదివాసీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని, జీవో నంబర్-3పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ నిరుద్యోగ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు గోచీలు ధరించి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం నుంచి ఐటీడీఏ వరకు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఐటీడీఏ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స మాట్లాడుతూ, ఏజెన్సీలో టీచర్ పోస్టులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఆదివాసీలకే ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్, స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ జిల్లా కన్వీనర్ ఎస్.ధర్మన్నపడాల్, కో-కన్వీనర్ కూడా రాధాకృష్ణ, నిరుద్యోగ సంఘం జిల్లా కన్వీనర్ ఎస్.సత్యనారాయణ, వివిధ సంఘాల నాయకులు కుడుముల కాంతారావు, పొద్దు బాలదేవ్, పల్లుల ప్రసాదరావు, కృష్ణారావు, ఎస్.హైమావతి, పలువురు డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. కాగా విషయం తెలుసుకున్న కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీవో డాక్టర్ ఎంజే.అభిషేక్ గైడ ధర్నా శిబిరం వద్దకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. మీ డిమాండ్లపై ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నదని, స్పెషల్ డీఎస్సీ, ఏజెన్సీలో శతశాతం రిజర్వేషన్‌పై వర్కు జరుగుతున్నదని వారికి వివరించారు.